Share News

Jagan Rages at CM Chandrababu: నరకానికి పోతావ్‌..

ABN , Publish Date - Aug 14 , 2025 | 04:38 AM

పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉపఎన్నికల్లో పోలీసులు పచ్చచొక్కాలు వేసుకుని డ్యూటీ చేశారంటూ..

Jagan Rages at CM Chandrababu: నరకానికి పోతావ్‌..

ఇవే నీకు చివరి ఎన్నికలు కావొచ్చు

  • ఈ ముసలి వయసులో రామా కృష్ణా అనుకుంటే పుణ్యం అయినా దక్కుతుంది

  • సీఎం చంద్రబాబుకు జగన్‌ తిట్లు.. శాపనార్థాలు

  • పులివెందులలో ప్రజాస్వామ్యం మంటగలిపారని అవాకులు

అమరావతి, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి): పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉపఎన్నికల్లో పోలీసులు పచ్చచొక్కాలు వేసుకుని డ్యూటీ చేశారంటూ వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ నోరు పారేసుకున్నారు. ‘ఇవే నీకు చివరి ఎన్నికలు కావచ్చు. ఈ ముసలి వయసులో రామాకృష్ణా.. అనుకుంటే పుణ్యం అయినా వస్తుంది. ఇలా చేస్తే గనుక నరకానికి పోతా’’రంటూ ముఖ్యమంత్రి చంద్రబాబుపై అవాకులు చెవాకులు పేలారు. కేంద్ర బలగాల పర్యవేక్షణలో పులివెందుల, ఒంటిమిట్ట ఉప ఎన్నికలను తిరిగి జరిపించేందుకు సిద్ధమా అంటూ చంద్రబాబుపై పొంతన లేని మాటలు మాట్లాడారు. డీఐజీ వ్యవస్థ మాఫియా ముఠాలా పనిచేస్తుందన్నారు. తాడేపల్లిలోని తన నివాసంలో బుధవారం ‘ఎంపిక చేసుకున్న’ మీడియాతో జగన్‌ మాట్లాడారు. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల్లో అక్రమాలు జరిగిపోయాయంటూ.. కొన్ని ఫొటోలు, వీడియోలు ప్రదర్శించారు. ఈ సందర్భంగా పోలీసు వ్యవస్థ, రాష్ట్ర ఎన్నికల సంఘం, సీఎం చంద్రబాబు, కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ, మాణిక్కం ఠాకూర్‌లపై ఆయన ఆరోపణలు గుప్పించారు. చంద్రబాబుకు తనకు నచ్చిన పోలీసు అధికారులను ఎంపిక చేసి ఉప ఎన్నికలను జరిపించారని జగన్‌ ఆరోపించారు. ‘‘డీజీపీ కోయ ప్రవీణ్‌ టీడీపీ మాజీ ఎంపీ అల్లుడు. పోలీసులు దగ్గరుండి రిగ్గింగ్‌ వేయించారు. పులివెందులలో 15 బూత్‌ల్లో వైసీపీ ఏజెంట్లే లేరు. చంబల్‌లోయ బందిపోట్లను మైమరిపించేలా దౌర్జన్యంగా చంద్రబాబు ఓట్లు వేయించుకున్నారు’’ అని ఆరోపించారు. చంద్రబాబును ఎవరూ లీడర్‌ అనరని.. ఫ్రాడ్‌స్టర్‌ అంటారంటూ అక్కసు వెళ్లగక్కారు.


రాహుల్‌ నిజాయితీపరుడా?

కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీపై జగన్‌ తీవ్ర విమర్శలు చేశారు. ‘రాహుల్‌ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు హాట్‌లైన్‌లో మాట్లాడుకుంటారు. అందువల్లే ఆంధ్రాలో దొంగఓట్లపై రాహుల్‌ మాట్లాడటం లేదు. రాష్ట్రంలోని కుంభకోణాలపై కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌ నోరెత్తరు. కానీ, నాపై విమర్శలు చేస్తారు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్‌ పోరాటంలో తనను చేరమనడానికి అర్థం ఉండాలంటూ ఓ మీడియా ప్రతినిధిపై అసహనం వ్యక్తం చేశారు. దొంగ ఓట్లపై రాష్ట్ర ఎన్నికల సంఘం ముందు వాదనలు వినిపించామన్నారు. దేశంలో ఎక్కడైనా ఓట్లలో మోసం జరిగిందంటే ఏపీలోనే అత్యధికంగా ఉందని జగన్‌ అన్నారు. కన్నుమూసి తెరచేలోగా ఏడాదిన్నర అయిపోయిందని, మరో మూడున్నరేళ్లు ఇలాగే కన్నుమూసి తెరిచేలోగా అయిపోతాయన్నారు. 2029 ఎన్నికల్లో చంద్రబాబుకు డిపాజిట్లు రాకుండా పోతాయని శపించారు. ప్రజాస్వామ్యం చేయి జారిపోతే నక్సలిజం పుడుతుందని విశ్లేషించారు. డేంజరస్‌ సిస్టమ్‌ వస్తుందన్నారు. కేంద్ర బలగాల ఆధ్వర్యంలో ఎన్నిక లు జరపించాలని డిమాండ్‌ చేశారు.

ఈసీపై అవాకులు

రాష్ట్ర ఎన్నికల సంఘం డమ్మీ పాత్రను పోషిస్తోందని జగన్‌ అన్నారు. జడ్పీటీసీ ఉప ఎన్నికలను రద్దు చేయాలంటూ కోర్టుకు వెళతామని తెలిపారు. ఈ కక్షలూ కార్పణ్యాలు, దుర్మార్గాలు చంద్రబాబుకు చుట్టుకుంటాయంటూ శాపనార్థాలు పెట్టారు. ఈ మాదిరిగా ఎన్నికలు జరిగినట్లయితే.. ఎన్నికలు జరపడం ఎందుకని జగన్‌ అసహనం వ్యక్తం చేశారు. ‘‘రాష్ట్ర ఎన్నికల సంఘానికి సంపూర్ణ అధికారాలు ఉన్నాయి. కొవిడ్‌ సమయంలో సగం ఎన్నికలు జరిగిపోయాక.. మిగిలిన ఎన్నికలను ఏడాది పాటు వాయిదా వేసింది. ఈసీకి ఉన్న అధికారం అది. కానీ, రాష్ట్రంలో ఎన్నికల సంఘం తనకున్న సంపూర్ణ అధికారాన్ని వాడటం లేదు’’ అని వ్యాఖ్యానించారు. పులివెందుల, ఒంటిమిట్టలో ప్రజాస్వామ్యం కనిపించలేదని, వైసీపీ నేతలను పట్టుకుని ‘‘కాల్చి పారేస్తా...’’ అని డీఎస్పీ అనేస్థాయిలో పోలీసుల దౌర్జన్యాలు కొనసాగాయని జగన్‌ విమర్శించారు.

Updated Date - Aug 14 , 2025 | 04:38 AM