Jagan Fake Claims: అప్పుల గొప్పలు.. జగన్ తిప్పలు
ABN , Publish Date - May 23 , 2025 | 04:45 AM
ఆర్థిక అంశాలపై జగన్ చేసిన ఆరోపణలు తప్పుదోవ పట్టించేవని టిడిపి వర్గాలు మండిపడ్డాయి. అప్పుల సంఖ్యలు వక్రీకరించి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారని విమర్శలు.
చంద్రబాబు ఐదేళ్లలో 2,49,530 కోట్లు తెస్తే
నేను రూ.3,32,671 కోట్లు తెచ్చా: మాజీ సీఎం
ఇందులో ఏది ఎక్కువో ఆయనకు తెలుసా?
ఇంగ్లీషులో చదివేదొకటి.. వివరించేది మరోటి
వాస్తవాలు దాచి ప్రజలను మభ్యపెట్టే యత్నం
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
నాలుగు రకాల అంకెలు చూపించాలి.. ఏదో ఒకటి సృష్టించాలి.. ఏది తప్పో ఏది ఒప్పో పట్టించుకోని సోషల్ మీడియాలో హల్‌చల్ చేయాలి.. ఈ ఒక్క లక్ష్యంతోనే వైసీపీ అధ్యక్షుడు జగన్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ప్రెస్‌మీట్‌లో అబద్ధాలు చెప్పారు. తెచ్చుకున్న పేపర్లను చూస్తూ ఆయన ఇంగ్లీషులో చదివిన స్ర్కిప్టునకు, టీవీ మైకుల్లో తెలుగులో చెప్పిన మాటలకు సంబంధమే లేదు. ఉదాహరణకు.. 12 నెలల్లో సీఎం చంద్రబాబు రూ.1,37,546 కోట్ల అప్పులు చేశారని చెప్పారు. కానీ సదరు ఇంగ్లీషు స్ర్కిప్టులో.. అమరావతి కోసం తేవాలనుకుంటున్న రుణాలు రూ.31,000 కోట్లు, ఏపీఎండీసీ తెచ్చుకోవాలనుకుంటున్న అప్పు రూ.3,489 కోట్లు అని స్పష్టంగా రాసి ఉంది. అంటే అది తేవాలనుకుంటున్నదే తప్ప తెచ్చింది కాదు. జగన్ మాత్రం తెచ్చేశారని అసత్యమాడారు. పేపర్లు చూసిన జనాలకు ఏం అర్థమవుతుందిలే అన్న ఽధీమానో.. లేక ఆయనకే ఇంగ్లీషు అర్థం కాలేదో! జగన్ చెప్పిన రూ.1,37,546 కోట్ల లెక్కలో ఇంకా తీసుకురాని రూ.35,089 కోట్లను పక్కన పెడితే మిగిలేది 1,02,457 కోట్లు. ఇందులో 2024 ఏప్రిల్, మే నెలలతోపాటు జూన్ 4వ తేదీ వరకు జగనే సీఎం. ఆ సమయంలో ఆయన రూ.23,000 కోట్ల అప్పులు తెచ్చారు. వీటిని తీసేస్తే.. మిగిలేది రూ.79,457 కోట్లు. ఇందులో మార్క్‌ఫెడ్, పౌరసరఫరాల సంస్థ, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ సొంత అవసరాల కోసం తెచ్చుకున్న అప్పులు దాదాపు రూ.8,700 కోట్లు. జగన్ హయాంలో రాజ్యాంగ విరుద్ధంగా కార్పొరేషన్ల డబ్బులను ప్రభుత్వ పథకాలకు వాడినట్లుగా వీటిని వాడడం లేదు. అందుకేనేమో జగన్‌కు ఇందులో తప్పు కనిపించేసింది.
జగన్: 2019 నాటికి రాష్ట్ర అప్పు రూ.3,90,247 కోట్లు. ఇందులో రాష్ట్ర విభజన వల్ల సంక్రమించిన అప్పు రూ.1,40,717 కోట్లు. అంటే 2014-19 మధ్య ఐదేళ్లలో చంద్రబాబు చేసిన అప్పులు రూ.2,49,530 కోట్లు. 2024లో నేను దిగిపోయే నాటికి రూ.7,21,918 కోట్లు ఉంది. నా ఐదేళ్ల హయాంలో రూ.3,32,671 కోట్లే అప్పులు చేశాను.
అప్పులు చేయడంలో చంద్రబాబు కంటే తానే గొప్పని జగన్ చెప్పదలచుకున్నట్లుగా ఉంది. తాను దిగిపోయేటప్పుడు వదిలేసివెళ్లిన రూ.1,30,000 కోట్ల పెండింగ్ బిల్లులు.. కార్పొరేషన్లను అడ్డం పెట్టుకుని బ్యాంకుల నుంచి తెచ్చిన రూ.2,00,000 కోట్ల అప్పుల గురించి కూడా చెప్పి ఉంటే.. జగన్ అప్పుల రికార్డు తన మాటల్లోనే ఇంకా ఘనంగా ఉండేది. ఇప్పుడీ అడ్డగోలు అప్పులకే చంద్రబాబు ప్రభుత్వం అసలు, వడ్డీ కలిపి నెలకు రూ.70,000 కోట్ల వరకు చెల్లిస్తోంది. జగన్ తెచ్చిన అప్పులకు వడ్డీరేట్లు తగ్గించండంటూ బ్యాంకుల చుట్టూ తిరుగుతోంది.
అబద్ధాలు.. నిజాలు అబద్ధాలు.. నిజాలు
జగన్: రాజ్యాంగ ఉల్లంఘనలు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 436 గనులపై హక్కులను ఏపీఎండీసీకి కట్టబెట్టి వాటి విలువను రూ.1,91,000 కోట్లుగా లెక్కగట్టి.. వాటిని తాకట్టు పెట్టి రూ.9,000 కోట్లు అప్పులు తేవాలనుకుంటున్నారు.
ఇది అసత్య ఆరోపణ కావడంతో కేంద్రం ఇదివరకే కొట్టిపారేసింది. ఆ అక్కసుతో.. జగన్ దానినిప్పుడు జనం మీదకు వదిలారు. రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ ఏపీఎండీసీ ద్వారా బాండ్లు జారీ చేయించి.. వచ్చిన డబ్బును రాజ్యాంగ విరుద్ధంగా ప్రభుత్వ అవసరాలకు వాడుతున్నారంటూ కేంద్రానికి ఇటీవల కొందరు (జగన్ సన్నిహితులు) ఫిర్యాదు చేశారు. దానిపై పీయూష్ ఇచ్చిన వివరణతో కేంద్రం ఏకీభవించి ఆ లావాదేవీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. సీఎం చంద్రబాబు తాజాగా ప్రభుత్వ ఆస్తులైన కొన్ని గనులను కంపెనీల చట్టం ప్రకారం ఏర్పడిన ఏపీఎండీసీకి ఇస్తున్నారు. నిబంధనల ప్రకారం జరుగుతున్న స్పష్టమైన లావాదేవీ ఇది. గనులు ఇస్తున్నందుకు ప్రభుత్వానికి ఏపీఎండీసీ నుంచి కూడా ప్రయోజనం ఉండాలి. అందుకే బాండ్లు జారీ చేసి ప్రయోజనం కల్పించాలని ఏపీఎండీసీ భావిస్తోంది. దీనిని ప్రభుత్వం ఎక్కడా దాచడం లేదు. ఈ వివరాలన్నీ పబ్లిక్ డొమైన్‌లోనే ఉన్నాయి. రాజ్యాంగాన్ని ఉల్లంఘించి అప్పులు పుట్టించడం జగన్‌కు మాత్రమే తెలిసిన విద్య. ఏపీఎండీసీలో వాటాలను ఒక విదేశీ ఇన్వెస్టర్‌కు విక్రయించే ఉద్దేశంతో 2024 ఎన్నికలకు ముందు షార్ట్ సర్క్యులేషన్ ద్వారా కేబినెట్ ఆమోదం తీసుకున్న సంగతి ఆయన ఉద్దేశపూర్వకంగా మరచిపోయారు. తన నిర్వాకాలన్నీ దాచి పదేపదే అబద్ధాలను ప్రచారం చేస్తే ప్రజలు నమ్ముతారన్నది ఆయన ఉద్దేశంగా కనబడుతోంది.
జగన్: 2023-24లో నేను రూ.67,720 కోట్ల అప్పు మాత్రమే తెచ్చా. కానీ 2024-25లో చంద్రబాబు 81,597 కోట్లు తెచ్చారు.
ఇదో పెద్ద అబద్ధం. 2024-25 ఆర్థిక సంవత్సరంలో జూన్ 4వ తేదీ వరకు జగన్ తెచ్చిన మంగళవారం అప్పులు రూ.23,000 కోట్లు. చంద్రబాబు తెచ్చారని చెబుతున్న రూ.81,597 కోట్ల అప్పులో జగన్ వాటా తీసివేస్తే నికరంగా ప్రస్తుత సీఎం తెచ్చిన అప్పు రూ.58,597 కోట్లు మాత్రమే. 2023-24లో జగన్ తెచ్చిన రూ.67,720 కోట్ల అప్పుల కంటే తక్కువే. పైగా చంద్రబాబు తెచ్చిన అప్పులన్నింటికీ కేంద్రం అనుమతి ఉంది. అయినా జగన్ తప్పుబడుతున్నారంటే.. బురద జల్లడానికేనని తేలిపోతోంది.
జగన్: ఈ అధిక అప్పులు ఎవరి జేబుల్లోకి పోతున్నాయి?
ఇవేమైనా లిక్కర్ మాఫియా డబ్బులా.. ఎవరో ఒకరి జేబులోకి పోవడానికి! ప్రతి పైసాకు ఆడిటింగ్ ఉంటుంది. ఏజీ నివేదికల్లో, ఆర్‌బీఐ వెబ్‌సైట్లో ఈ మంగళవారం అప్పుల లెక్కలు స్పష్టంగా ఉంటాయి. కేంద్రం అనుమతితో ఆర్‌బీఐ ప్లాట్‌ఫాం ద్వారా అత్యంత పారదర్శకంగా రాష్ట్రానికి వచ్చే అప్పులివి. ఇలా రాష్ట్రాలకు వచ్చే అప్పులకు కేంద్రం హామీగా ఉంటుంది. వీటిని ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చెల్లించేందుకు వీలుగా రాష్ట్ర ఖజానా ఆర్‌బీఐ వద్ద తాకట్టులో ఉంటుంది. ఇవన్నీ తెలియక జగన్ ఆ ప్రశ్న అడిగారా.. లేక కుట్రపూరితంగా ప్రభుత్వాన్ని బద్నాం చేద్దామనా?
జగన్: 2023-24లో మేం రూ.23,330 కోట్లు మూలధన వ్యయం చేశాం.. చంద్రబాబు రూ.19,177 కోట్లే ఖర్చుచేశారు.
2024-25లో చంద్రబాబు ప్రభుత్వం చేసిన మూలధన వ్యయం రూ.24,286 కోట్లు. ప్రభుత్వం ఇచ్చే లోన్లు, అడ్వాన్సులను మూలధన వ్యయం నుంచి కావాలనే తీసేసి రూ.19,177 కోట్లే ఖర్చు పెట్టారని జగన్ బురదజల్లాలని చూశారు.