Share News

Jagan Private Army: అభద్రతలో జగన్‌.. ప్రైవేటు సైన్యాన్ని నియమించుకుని..

ABN , Publish Date - Aug 05 , 2025 | 05:12 AM

జగన్‌కు 58 మంది పోలీసులు భద్రత కల్పిస్తున్నారు. ఇప్పుడు వీరిని కాదని ప్రైవేటు సైన్యాన్ని నియమించుకోవడంపై ఆయన పార్టీ నేతలే విస్తుపోతున్నారు.

Jagan Private Army: అభద్రతలో జగన్‌.. ప్రైవేటు సైన్యాన్ని నియమించుకుని..
Jagan Mohan Reddy

  • 40 మందితో ప్రైవేటు సైన్యం.. రేపటి డోన్‌ పర్యటన నుంచి మొదలు

  • జడ్‌ ప్లస్‌ కేటగిరీలో ఉన్న ఆయనకు ఇప్పటికే 58 మంది రక్షణ

  • వారిని కాదని ప్రైవేటు ఆర్మీ ఎందుకో.. పోలీసులు అనుమతించేనా?

అమరావతి, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): జడ్‌ ప్లస్‌ కేటగిరీ రక్షణలో ఉన్న మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి తన భద్రత కోసం ప్రైవేటు సైన్యాన్ని నియమించుకున్నారు. ఏకంగా 40 మంది బౌన్సర్లను ఏర్పాటు చేసుకున్నారు. బుధవారం డోన్‌ పర్యటన నుంచి వీరు రంగంలోకి దిగనున్నారని వైసీపీ వర్గాలు తెలిపాయి. అయితే ఆయనకు రక్షణ కల్పిస్తున్న పోలీసులు.. ప్రైవేటు సైన్యాన్ని అనుమతిస్తారా అనేది ప్రశ్న. జగన్‌ భద్రతపై ఎలాంటి ఆందోళనలూలేవు. ఆయనకు ముప్పు ఉన్నట్లు నిఘా నివేదికలూ వెల్లడించలేదు.

అయినా సరే... జగన్‌కు 58 మంది పోలీసులు భద్రత కల్పిస్తున్నారు. ఇప్పుడు వీరిని కాదని ప్రైవేటు సైన్యాన్ని నియమించుకోవడంపై ఆయన పార్టీ నేతలే విస్తుపోతున్నారు. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి 11 స్థానాలు మాత్రమే రావడంతో జగన్‌కు ప్రతిపక్ష నేత హోదా దక్కలేదు. అయినప్పటికీ .. మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకు ప్రభుత్వం జడ్‌ ప్లస్‌ భద్రతను కల్పించింది. ఇందులో భాగంగా 58 మంది పోలీసులు జగన్‌కు రక్షణ కల్పిస్తున్నారు. జడ్‌ ప్లస్‌ కేటగిరీలో ఉన్న నాయకుడిగా ఆయన తన పర్యటనల వివరాలను పోలీసులకు ఎప్పటికప్పుడు తెలియజేయాలి. భద్రతా ఏర్పాట్లు వారే చేపట్టాలి.

పోలీసు భద్రతా నియమాలను ఆయన పక్కనపెట్టడానికి వీల్లేదు. అయితే ఇటీవల జగన్‌ ఎక్కడ పర్యటించినా భద్రతాపరమైన మార్గదర్శకాలన్నింటినీ ఉల్లంఘిస్తున్నారు. పోలీసులు అనుమతించిన సంఖ్యలో కాకుండా.. పథకం ప్రకారం వేల సంఖ్యలో జనాలను రప్పిస్తున్నారు. తన ముందు నడవాలంటూ నేతలు, కార్యకర్తలకు సైగలు కూడా చేస్తున్నారు. హెలిప్యాడ్‌ వద్దకు పెద్దసంఖ్యలో రావాలని సూచిస్తున్నారు. తమను అడ్డగిస్తున్న పోలీసులను వైసీపీ కార్యకర్తలు తోసుకుని మరీ వెళ్తున్నారు. దీంతో తనకు భద్రత కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని జగన్‌ ఆరోపణలు చేస్తున్నారు.

కార్యకర్తలను అడ్డుకుంటే.. ఎవరూ తనను కలవకుండా ఆంక్షలు పెడుతున్నారని విమర్శిస్తున్నారు. బంగారుపాళ్యం పర్యటన తర్వాత.. జగన్‌ అమలు చేస్తున్న ప్రణాళికలపై పోలీసులకు స్పష్టత వచ్చింది. భద్రతను ఛేదించుకుని ఎవరూ రాకుండా కఠినంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఇటీవల జగన్‌ నెల్లూరు పర్యటన సమయంలో కార్యకర్తల హడావుడి తగ్గింది. ఈ పరిస్థితుల్లో జగన్‌ ప్రైవేటు సైన్యాన్ని నియమించుకోవడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ఏదైనా అవాంఛనీయ పరిస్థితి ఏర్పడితే బాధ్యత ఎవరిదని పోలీసువర్గాలూ ప్రశ్నిస్తున్నాయి. రాష్ట్రప్రభుత్వం సరైన రక్షణ కల్పించడం లేదని ప్రచారం చేసుకునేందుకే బౌన్సర్లను తెచ్చుకుంటున్నారని రాజకీయవర్గాలు విమర్శిస్తున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

మందు బాబులకు గుడ్ న్యూస్

కవితకు షాక్ ఇచ్చిన కోర్టు

For More AP News and Telugu News

Updated Date - Aug 05 , 2025 | 10:10 AM