BJP MLAs: ఉగ్రవాదులకన్నా జగన్ పెద్ద ముష్కరుడు
ABN , Publish Date - May 04 , 2025 | 05:47 AM
జగన్ ఉగ్రవాదులకన్నా ముష్కరుడని, కోర్టుల్లో శిక్షల నుంచి తప్పించుకోలేడని బీజేపీ ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించారు. రాష్ట్రాభివృద్ధికి మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ కట్టుబడి ఉన్నారని పాతూరి నాగభూషణం అన్నారు.
కోర్టుల్లో ఆయనకు శిక్షలు తప్పవు
బీజేపీ ఎమ్మెల్యేలు ఆదినారాయణరెడ్డి, విష్ణుకుమార్‌రాజు
వైసీపీ నేతలు కాలకేయులు: పాతూరి
అమరావతి, మే 3(ఆంధ్రజ్యోతి): ‘కశ్మీర్‌లో దాడి చేసిన ఉగ్రవాదుల కన్నా జగన్ పెద్ద ముష్కరుడు. ఆయనపై ఉన్న కేసులు కోర్టుల్లో విచారణకు వస్తున్నాయి. చట్టం, న్యాయపరంగా ఆయనకు శిక్షలు తప్పవు’ అని జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అన్నారు. విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మరో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుతో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఏపీని అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చిన మోదీపై పీసీపీ అధ్యక్షురాలు షర్మిల, వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు దేనికి సంకేతం? పేదలకు ఇళ్ల నుంచి రైల్వే లైన్ల వరకూ ఎన్నో ప్రాజెక్టులు ఇచ్చిన ప్రధాని మోదీపై కాంగ్రెస్, వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు నీచం. అమరావతి ప్రజల్ని జగన్ భయపెట్టారు. చంద్రబాబు భరోసా ఇచ్చారు. అధికారంలోకి వచ్చి అభివృద్ధి చేస్తున్నారు. ఆయనకు మోదీ అండగా నిలుస్తున్నారు.
వైసీపీ నేతలు ప్రశాంతంగా నిద్రపోలేక పోతున్నారు’ అని ఆదినారాయణ వ్యాఖ్యానించారు. విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ, ‘జగన్‌కు ఆహ్వానం పంపినా అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనకుండా ముఖం చాటేశారు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు అసెంబ్లీకీ రారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు’ అని అన్నారు. ఉగ్రదాడి తర్వాత విదేశీ పర్యటనలు సైతం రద్దు చేసుకుని భద్రతా సమీక్షలో తీరిక లేకుండా ఉంటోన్న ప్రధాని ఆంధ్రప్రదేశ్‌పై ప్రేమతో అమరావతికి వచ్చి అనుకున్న సమ యం కన్నా ఎక్కువ గడిపారని వారిరువురూ కొనియాడారు. బీజేపీ రాష్ట్ర మీడియా ఇన్‌చార్జి పాతూరి నాగభూషణం విడిగా మాట్లాడుతూ... ‘రాష్ట్రాభివృద్ధికి భుజం భు జం కలుపుదామంటూ చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు సభా వేదిక నుంచి ప్రధాని నరేంద్ర మోదీ చేసిన సూచనతో ఆ ముగ్గురినీ ప్రజలు బాహుబలులుగా.. గత ఐదేళ్లు రాష్ట్రాన్ని నాశనం చేసిన వైసీపీ నేతల్ని కాలకేయులుగా చూస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు.