Share News

Singenna Death: జగన్‌కు నోటీసు

ABN , Publish Date - Jun 25 , 2025 | 05:16 AM

వైసీపీ కార్యకర్త చీలి సింగయ్య మృతికి కారణమైన కేసులో మాజీ సీఎం జగన్‌ ప్రయాణించిన కారును పోలీసులు సీజ్‌ చేశారు. మంగళవారం రాత్రి గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు తాడేపల్లి నివాసంలో వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డికి నోటీసు అందజేసి ప్రమాదానికి కారణమైన ఏపీ 40 డీహెచ్‌ 2349 నెంబరు గల ఫార్చూనర్‌ కారును స్వాధీనం చేసుకున్నారు.

Singenna Death: జగన్‌కు నోటీసు

  • తాడేపల్లి నివాసంలో స్వాధీనం

  • నల్లపాడు స్టేషన్‌కు తరలింపు

  • నోటీసు అందుకున్న ఎమ్మెల్సీ లేళ్ల

  • పోలీసుల అదుపులో కారు డ్రైవర్‌

  • సింగయ్య మృతిపై దర్యాప్తు ముమ్మరం

గుంటూరు, జూన్‌ 24(ఆంధ్రజ్యోతి): వైసీపీ కార్యకర్త చీలి సింగయ్య మృతికి కారణమైన కేసులో మాజీ సీఎం జగన్‌ ప్రయాణించిన కారును పోలీసులు సీజ్‌ చేశారు. మంగళవారం రాత్రి గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు తాడేపల్లి నివాసంలో వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డికి నోటీసు అందజేసి ప్రమాదానికి కారణమైన ఏపీ 40 డీహెచ్‌ 2349 నెంబరు గల ఫార్చూనర్‌ కారును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కారును నల్లపాడు పోలీస్‌ ేస్టషన్‌కు తరలించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన కారు డ్రైవర్‌ ఏఆర్‌ కానిేస్టబుల్‌ రమణారెడ్డిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన రమణారెడ్డి జగన్‌కు కారు డ్రైవర్‌గా ఉన్నారు. కారును అధికారికంగా గుర్తించేందుకు ఫోరెన్సిక్‌, ఆర్టీఏ అధికారులు రంగంలోకి దిగనున్నారు. వారిచ్చే నివేదిక అనంతరం తదుపరి చర్యలు తీసుకోనున్నారు. సింగయ్యను ఢీ కొట్టింది జగన్‌ కారే అని వీడియో పుటేజీలతో సహా పోలీసుల వద్ద స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి.


ఇప్పటికే డ్రైవర్‌ కూడా నేరాన్ని అంగీకరించాడు. ఈ కేసులో మాజీ సీఎం జగన్‌తో పాటు మాజీ మంత్రులు విడదల రజని, పేర్ని నాని, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, జగన్‌ పీఏ కె. నాగేశ్వరరెడ్డి, కారు డ్రైవర్‌ రమణారెడ్డిలను నిందితులుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో నిబంధనలకు అనుగుణంగా పోలీసులు ఫోరెన్సిక్‌, ఆర్టీఏ అధికారుల నుంచి నివేదిక తీసుకోనున్నారు. అనంతరం నిందితులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ నెల 18న పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గ పరిధిలోని రెంటపాళ్ల గ్రామంలో జగన్‌ పర్యటించారు. పోలీసుల షరతులను ధిక్కరించి వైసీపీ నాయకులు వేలాది మందితో ర్యాలీగా గ్రామానికి వెళ్లారు. ఈ క్రమంలో ఏటుకూరు బైపాస్‌ వద్ద వెంగళాయపాలెం గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త చీలి సింగయ్య జగన్‌ కారుపై పూలు చల్లేందుకు రోడ్డు పక్కన నిలబడి ఉండగా ఆ కారు ఢీకొనడమే కాకుండా ఫర్లాంగు దూరం ఈడ్చుకుంటూ వెళ్లింది. ఈ ఘటనలో సింగయ్య మృతి చెందారు.

Updated Date - Jun 25 , 2025 | 05:16 AM