ST Gurukul College : అద్దే ముద్దా..?
ABN , Publish Date - Aug 17 , 2025 | 12:30 AM
అన్ని సౌకర్యాలతో సొంత భవనాలు ఉన్నా, వాటిని కాదని ఎస్టీ గురుకుల కళాశాలను అద్దె భవనంలో నిర్వహిస్తుండటంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. పట్టణ శివారు ప్రాంతం కదిరి - హిందూపురం రహదారిలో అన్నమరియ భవనాల్లో ఎస్టీ గురుకుల కళాశాలను నిర్వహిస్తున్నారు. దీనికి బాడుగు నెలకు రూ.76 వేలు. దీన్ని 2014లో ప్రారంభించారు. కొన్ని నెలల పాటు తనకల్లు మండలం సీజీ ప్రాజెక్టు వద్ద ఉన్న ఎస్టీ గురుకుల పాఠశాలలో ...
అద్దె భవనాల్లో ఎస్టీ గురుకుల కళాశాల నిర్వహణ
సొంత భవనాలు ఉన్నా పట్టించుకోని యంత్రాంగం
మార్చాలన్న ఎమ్మెల్యే ఆదేశాలు బేఖాతరు
ప్రతి నెలా రూ.76వేల అద్దె చెల్లింపు
కదిరి, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): అన్ని సౌకర్యాలతో సొంత భవనాలు ఉన్నా, వాటిని కాదని ఎస్టీ గురుకుల కళాశాలను అద్దె భవనంలో నిర్వహిస్తుండటంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. పట్టణ శివారు ప్రాంతం కదిరి - హిందూపురం రహదారిలో అన్నమరియ భవనాల్లో ఎస్టీ గురుకుల కళాశాలను నిర్వహిస్తున్నారు. దీనికి బాడుగు నెలకు రూ.76 వేలు. దీన్ని 2014లో ప్రారంభించారు. కొన్ని నెలల పాటు తనకల్లు మండలం సీజీ ప్రాజెక్టు వద్ద ఉన్న ఎస్టీ గురుకుల పాఠశాలలో తరగతులు నిర్వహించారు. అక్కడ ఇబ్బందిగా ఉందని కదిరి మున్సి పాలిటీ పరిధిలోని కుటాగుళ్ల వద్ద ఉన్న శాంతినికేతన పాఠశాలలో నిర్వహించారు. ఆ తరువాత హిందూపురం రోడ్డులో ఉన్న అన్నమరియ పాఠశాలల భవనాల్లోకి గురుకుల కళాశాలను మార్చారు. అప్పటి నుంచి ఇక్కడే తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ కళాశాలలో ఎంపీసీ, బైపీసీ గ్రూపులు మాత్రమే ఉన్నాయి.
అప్పటి నుంచి ఉన్న అరకొర సౌకర్యాల తోనే కళాశాల నిర్వహిస్తున్నారు. 2014లో ఈ కళాశాలకు పక్కా భవ నాల నిర్మాణానికి దాదాపు రూ.5 కోట్లు వచ్చాయి. దీంతో భవన నిర్మా ణానికి మండలంలోని గంగన్నగారిపల్లికి సమీపంలో పునాదులు వేసి గోడలు నిర్మించారు. ఇంతలోనే ప్రభుత్వం మారడంతో ఆ భవనం నిర్మాణ పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. ఆ తరువాత నిధులు వెనక్కి పోయినట్లు తెలిసింది. అప్పటి నుంచి ఈ బాడుగ భవనంలోనే కళాశాల నిర్వహిస్తున్నారు.
బాడుగ భవనంలో బాధలు
గిరిజన గురుకుల కళాశాల ఇప్పుడు నిర్వహిస్తున్న భవనంలో విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ కళాశాలకు వెనుక వైపున గుట్ట ఉంది. కళాశాల భవనానికి ప్రహరీ లేదు. నీటి సౌకర్యం అరకొరగా ఉంది. ఈకళాశాలలో ప్రస్తుతం 160 మంది వరకు ఉన్నారు. మరుగుదొడ్లు, స్నానపు గదులు చాలినన్ని లేవు. అయినా అలాగే నెట్టుకొచ్చారు. గత సంవత్సర నుంచి కదిరి - హిందూపురం రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు. దీంతో కళాశాలకు ముందు వైపున ఉన్న ప్రహరీని తొలగించారు. దీంతో బాలికల మరుగుదొడ్లు, స్నానపు గదులు రోడ్డుపైకి కనబడుతున్నాయి. రోడ్డు నుంచి వచ్చే దుమ్ము, ధూళితో ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఎవరు ఏవైపు నుంచి హాస్టల్ గదుల్లోకి వస్తారోనని భయంతో విద్యార్థినులు ఉన్నారు. అడవి ప్రాంతం కావడంతో జంతువులు, విషపురుగులు హాస్టల్ గదుల్లోకి వస్తాయన్న భయం కూడా వారిని వెంటాడుతోంది.
కళాశాలను మార్చాలని ఎమ్మెల్యే ఆదేశం
ఎస్టీ గురుకుల కళాశాలను తక్షణం తనకల్లు సీజీ ప్రాజెక్టుకు మార్చాలని ఎమ్మెల్యే కందికుంట ఆ కళాశాల అధికారులను ఆదేశించారు. నిత్యం అదే రహదారిపై వెళ్లే ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ అక్కడి పరిస్థితిని గమనించారు. ఈక్రమంలోనే నాలుగు రోజుల కిందట స్వయంగా ఆయనే ఆ కళాశాలకు వెళ్లి అక్కడి పరిస్థితిని పరిశీలించారు. అక్కడ అరకొర సౌకర్యాల నడుమ విద్యార్థినులు పడుతున్న ఇబ్బందిని చూసి చలించిపోయారు. వారంలోపు కళాశాలను ఇక్కడి నుంచి తరలించాలని ఆదేశించారు. అయితే అధికారులు మాత్రం వాటిని పట్టించుకోవడం లేదు.
తనకల్లులో ఖాళీగా హాస్టల్ భవనాలు
ఎస్టీ గురుకుల కళాశాలను సీజీ ప్రాజెక్టుకు మార్చాలని ఎమ్మెల్యే ఆదేశించారు. అక్కడ కళాశాలకు సరిపడా భవనాలు లేవని అధికార్లు చెబుతున్నారు. ఒకవేళ అక్కడ భవనాలు సరిపోకపోతే తనకల్లులో నాలుగు హాస్టల్ భవనాలు కొన్నేళ్ల నుంచి ఖాళీగా ఉన్నాయి. వాటిని హాస్టల్, తరగతి గదులు, ల్యాబ్‌లు, ఇతర అవసరాలకు వినియోగించుకోవచ్చని స్థానికులు చెబుతున్నారు.
అధికారులకు లేఖ పంపాం
- వెంకటరామనాయుడు, ప్రిన్సిపాల్
ఎస్టీ గురుకుల కళాశాలను తనకల్లు మండలంలోని సీజీ ప్రాజెక్టుకు మార్చాడానికి ఉన్నతాధికారులకు లేఖ పంపాము. ఇక్కడి పరిస్థితులు, ఎమ్మెల్యే ఆదేశాలు అన్ని పై అధికారులకు విన్నవించాము. అక్కడి నుంచి వచ్చిన ఆదేశాలను తప్పక పాటిస్తాం.