iPAC Andhra Pradesh: అదే సారే.. ఇప్పటికీ వారే
ABN , Publish Date - May 15 , 2025 | 02:51 AM
వైసీపీ హయాంలో ఐప్యాక్ గ్రామ, వార్డు సచివాలయాలపై సంపూర్ణ నియంత్రణ తెచ్చుకుంది. ఇప్పటికీ ఆ సంస్థ దురదృష్టకరంగా అక్కడ అధికారంగా కొనసాగుతుండడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఐప్యాక్ గుప్పిట్లోనే గ్రామ సచివాలయాలు
వైసీపీ హయాంలోని అధికారే కొనసాగింపు
కన్సల్టెంట్లు, ఎనలిస్టులూ, అకౌంటెంట్లూ వారే
నిరంతరాయంగా ‘ఐప్యాక్’కు సమాచారం!?
ప్రభుత్వం మారి ఇన్నాళ్లైనా అదే పరిస్థితి
నాడు జగన్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసింది. వైసీపీకి అనుకూలంగా ఉండే అధికారులు, కన్సల్టెంట్లు, ప్రైవేటు వ్యక్తులను కీలక స్థానాల్లో నియమించారు. వైసీపీకి వీరవిధేయులుగా పనిచేసేలా ‘శిక్షణ’ ఇచ్చారు. గ్రామ, వార్డు సచివాలయాల రోజువారీ కార్యకలాపాలు, డేటా వంటివన్నీ ఐప్యాక్‌కు చెందిన వ్యక్తి గుప్పిట్లో ఉండేలా మాస్టర్‌ప్లాన్ వేశారు. ఇప్పుడు ప్రభుత్వం మారింది. కూటమి సర్కారు వచ్చి 11 నెలలు దాటింది. అయినా సరే.. ఆ సారే ఉన్నారు. ఇతర కీలక అధికారులూ వారే కొనసాగుతున్నారు.
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
ఐప్యాక్.. వైసీపీ, జగన్ ప్రభుత్వంతో అంటకాగిన ప్రైవేటు సంస్థ. జగన్‌కు రాజకీయ వ్యూహాలు అందించిన ఈ సంస్థకు గత ప్రభుత్వం ఎలాంటి మేళ్లు చేసిందో ఇప్పటికే సవివరంగా బయటకొచ్చింది. కూటమి ప్రభుత్వం కొలువుదీరి 11 నెలలు దాటినా గ్రామ, వార్డు సచివాలయాల విభాగంపై ఇప్పటికీ ఐప్యాక్‌దే పెత్తనం. నాడు జగన్ ప్రభుత్వంలో నియమితులైన అధికారులు, కన్సల్టెంట్లు, ఎనలిస్టులు, అకౌంటెంట్లు, రిటైర్డ్ అధికారులు.. ఇలా ఎందరో ఇప్పటికీ కొనసాగుతున్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ శాఖ నుంచి డేటా నిరంతరాయంగా ఐప్యాక్‌కు చేరిపోతోంది. ఈ శాఖలో ఏం జరుగుతుందో, ఏం చేయనున్నారో ఆ సంస్థకు తెలిసిపోతోంది. కొందరు అధికారులు ఇప్పటికీ ఐప్యాక్, జగన్ కోసం పరితపించి పనిచేస్తున్నారు. గ్రామీణ, పట్టణ ప్రజలను ప్రభుత్వంతోఅనుసంధానం చేసే ఇలాంటి శాఖను ఇలాగే వదిలేస్తారా? కూటమి ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టి సంస్కరించకపోతే ఎలా? అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కూటమి ప్రభుత్వ మార్క్ మార్పులు, సంస్కరణలు తీసుకురాకపోతే ఈ శాఖ పూర్తిగా ప్రభుత్వంతో సంబంధం లేని వ్యవస్థగా మారిపోయే ప్రమాదం ఉందని సీనియర్ అధికారులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వైసీపీతో హౌస్‌ఫుల్
జగన్ సర్కారు గ్రామస్థాయి నుంచే వైసీపీ రాజకీయ వ్యూహాలను అమలు చేసేందుకు వలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చింది. వారికి శిక్షణ ఇచ్చే పేరిట రామ్‌ఇన్ఫోకు నాలుగేళ్ల భారీ కాంట్రాక్టు ఇచ్చింది. ఇక వలంటీర్ల సేవల పర్యవేక్షణ, సమన్వయం పేరిట రామ్‌ఇన్ఫోకే మరో కాంట్రాక్టు ఇచ్చింది. ఈ పనిలో యూని కార్పొరేట్ కంపెనీ జత కలిసింది. ఇలా రెండు కాంట్రాక్టుల కింద రూ.554 కోట్ల ప్రభుత్వ సొమ్ము రామ్‌ఇన్ఫోకు చేరింది. ఈ సొమ్ము రూట్ మారి ఐప్యాక్‌కు చేరినట్లుగా ఇప్పుడు అనుమానాలు బలంగా వ్యక్తమవుతున్నాయి. ఇందుకు కారణం.. గ్రామ, వార్డు సచివాలయాల్లో వలంటీ ర్లు, వారిపైన ఉన్న సూపర్‌బా్‌సలు పూర్తిగా ఐప్యాక్ నియంత్రణలో పనిచేశారు. ఇది జగమెరిగిన సత్యం. ఇక గ్రామ, వార్డు సచివాలయాల ప్రధాన కార్యాలయం కూడా ఐప్యాక్ గుప్పిట్లోకి వెళ్లింది. ఆ సంస్థ సూచించిన వారినే కీలక పోస్టుల్లో కూర్చోబెట్టారు. అలా వచ్చిన వారంతా జగన్‌కు వీరభక్తులుగా, విధేయులుగా పనిచేశారు. కీలక అధికారులు సైతం ఐప్యాక్ నుంచి వచ్చే ఆదేశాలకు జీ హుజూర్ అన్నారు. బిల్లుల చెల్లింపు, కాంట్రాక్టుల విషయంలో ఇద్దరు అధికారులు కీలకపాత్ర వహించారు. ఓ సీనియర్ అధికారి, మరో కన్సల్టెంట్ ఫక్తు ఐప్యాక్ రెగ్యులర్ ఏజెంట్లుగా పనిచేశారని ఉద్యోగులు బాహాటంగా చెబుతున్నారు. రామ్‌ఇన్ఫోకు బిల్లుల చెల్లింపుపై ఆడిట్ విభాగం తొలుత కొర్రీలు వేసింది. ఒకేసారి నాలుగేళ్ల పాటు కాంట్రాక్టు ఎలా ఇస్తారని ప్రశ్నించింది. అంతే.. ఈ శాఖలోని ఓ కీలక అధికారి, మరో కన్సల్టెంట్ మంత్రాంగం నడిపి కేవలం అరగంటలో బిల్లులు క్లియర్ చేయించారు. దీన్నిబట్టి వారి మాటకు ఎంత ప్రాధాన్యం ఉందో అర్థమవుతుంది.
లెక్కాపత్రం లేదు
రాష్ట్రవ్యాప్తంగా వివిధ డిజిటల్ సేవలకు సంబంధించి ప్రభుత్వ శాఖల నుంచి ఏటా కోట్లాది రూపాయలు సర్వీసు చార్జీల రూపంలో గ్రామ, వార్డు సచివాలయాల విభాగానికి వస్తాయి. ఇలా వచ్చిన నిధులను ఏం చేశారు? ఎక్కడ ఖర్చు పెట్టారు? అన్న లెక్క లేదు. దీనిపై ఆడిట్ నిర్వహించాలని స్వయంగా ఉద్యోగులే కోరుతున్నారు. దీనిపై విచారణ జరిపే లోపు హార్డ్‌డి్‌స్కలు, రికార్డులు మాయం చేస్తారేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏళ్ల తరబడి అక్కడే పనిచేస్తున్న అధికారులను, రిటైర్డ్ అయిన వారిని మళ్లీ కొనసాగించడం విచారణకు అడ్డంకిగా ఉంటుందని సీనియర్ అధికారులు చెబుతున్నారు.
ఎన్నికల ముందు వైసీపీ కోసం
గ్రామ, వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ కార్యాలయం అధికారులు గత ఎన్నికల్లో వన్‌సైడ్ అయ్యారు. వలంటీర్లతో పాటు సచివాలయ ఉద్యోగులను వైసీపీకి అనుకూలంగా వినియోగించుకున్నారు. ఎన్నికల కమిషన్ వలంటీర్లకు సిమ్‌లు బ్లాక్ చేయాలని ఎన్నిసార్లు హెచ్చరించినా అధికారులు ఖాతరు చేయలేదు. ఎన్నికల కమిషన్ అధికారులు గట్టిగా హెచ్చరిస్తే ఎన్నికల ముందు రోజు సిమ్‌లను బ్లాక్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయ శాఖను నడిపించింది వైసీపీ ఆధ్వర్యంలోని ఐప్యాక్ సంస్థనే. ఈ విషయాలన్నింటిపై విచారణ జరిగితే తప్ప వాస్తవాలు వెలుగులోకి రావు.
ఇప్పుడూ వారే..
నాడు జగన్ ప్రభుత్వంలో ఈ శాఖలో కీలకంగా వ్యవహరించిన అధికారి ఇప్పటికీ కొనసాగుతున్నారు. ఆయన తర్వాతి స్థానంలో ఉన్న మరో అధికారి, కన్సల్టెంట్లు, రిటైర్డ్ అధికారులు దర్జాగా కొనసాగుతున్నారు. ఐప్యాక్ సూచనల మేరకు వీరిందరిని నాటి జగన్ ప్రభుత్వం ఈ శాఖలో తెచ్చిపెట్టుకుంది. కూటమి సర్కారు వచ్చి పది నెలలు అవుతున్నా ఈ శాఖలో ఏ మార్పూ లేదు. ఆ అధికారులే ఉన్నారు. పనితీరులో మార్పు అంతకన్నా లేదని ఉద్యోగులు వాపోతున్నారు. రోజువారీ కార్యకలాపాలు, శాఖకు సంబంధించిన సున్నితమైన డేటా, ఇతర వ్యవహారాలన్నీ ఐప్యాక్ తెచ్చిపెట్టుకున్న ఉద్యోగుల చేతుల్లోనే ఉన్నాయి. అలాంటప్పుడు ఈ శాఖ డేటా ఐప్యాక్‌కు, దాన్ని పెంచిపోషిస్తున్న వైసీపీకి వెళ్లకుండా ఎలా ఉంటుందన్న అనుమానాలు ఉద్యోగులే వ్యక్తం చేస్తున్నారు. నిజానికి శాఖ అధికారిని మార్చాలని తొలుత ప్రభుత్వం భావించింది. ఈ విషయం తెలుసుకున్న ఆయన టీడీపీ నేతల గుడ్‌లుక్స్‌లోకి వెళ్లారు. దీంతో ఆయన బదిలీ ఆగిపోయింది. ఆ తర్వాత ఆయన మిగతా అధికారులను బదిలీ చేయకుండా, తనతో పాటే ఉండేలా చక్రం తిప్పారు. ఓ అధికారిపై వైసీపీ మనిషిగా ముద్ర ఉండటంతో కర్నూలు జిల్లాకు బదిలీ చేశారు. అయితే, ఈ శాఖ కీలక అధికారి లాబీయింగ్ చేసి ఆ బదిలీని ఆపేయించినట్లు తెలిసింది. ఆ తర్వాత మరో కన్సల్టెంట్‌ను కూడా అక్కడే కొనసాగేలా చక్రం తిప్పారని ఉద్యోగ వర్గాలు చెబుతున్నాయి.
వైసీపీ వీరాభిమానులే
గ్రామ, వార్డు సచివాలయ శాఖను జగన్ హయాంలో ఏర్పాటు చేసింది కావడంతో వైసీపీకి అనుకూలంగా పనిచేసే అధికారులను చాలామందిని అక్కడ నియమించుకున్నారు. జగన్ ఇలాకాకు చెందిన వారే ఎక్కువగా ఉన్నారు. ఇటీవల ఐఏఎస్ అధికారి కాటమనేని భాస్కర్‌ను నియమించినా, ఆ శాఖపై ఆయనకు ఇంకా పట్టు దొరకలేదు. కింది స్థాయిలో ఉన్న అధికారులే ఆ శాఖను నడిపిస్తున్నారు. ఈ శాఖలో అత్యంత కీలకమైన డేటాకు సంబంధించిన డిజిటల్ సర్వీసులు ఓ మధ్య స్థాయి అధికారి నియంత్రణలోనే ఉన్నాయి. మరో ప్రైవేటు ఉద్యోగి చేతిలో మొత్తం గ్రామ, వార్డు సచివాలయ శాఖ సమాచారం నిక్షిప్తమై ఉంది. వైసీపీ హయాంలో నియమించిన ఈ ప్రైవేటు ఉద్యోగికి రూ.1.50 లక్షలు జీతమిచ్చి కొనసాగిస్తున్నారు. ఈ విభాగంలోనే మరికొందరు కన్సల్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు పనిచేస్తున్నారు.
‘డిజిటల్’ పోషణ
గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ద్వారా డిజిటల్ సేవల పేరుతో భారీగా కన్సల్టెంట్లను నియమించారు. లక్షల్లో జీతాలిచ్చి వారిని పోషిస్తున్నారు. ప్రతి నెలా సుమారు రూ.4 కోట్లు వారికి జీతాలుగా అందిస్తున్నారు. గత నాలుగేళ్లలో సుమారు రూ.200 కోట్లు వారికి జీతాల రూపంలో చెల్లించారు. ఇప్పుడు వాస్తవానికి రాష్ట్రంలో ఎలాంటి డీబీటీ పథకాలూ అమలు కావడం లేదు. గతంలో అమలు చేసిన ఒక్క డీబీటీ కూడా ఇప్పుడు అమల్లో లేవు. వారంతా పని లేకుండా ఖాళీగా ఉంటున్నారు. పైగా వైసీపీ హయాంలో చేసిన అక్రమాలను కప్పిపుచ్చేందుకు ఆయా స్థానాల్లో కొనసాగుతున్నారా? అని ఉద్యోగులే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ శాఖలోని ఆర్థిక అరాచకాలను బయటకు తీయాలంటే అన్ని విభాగాల్లో అధికారులను, సిబ్బందిని, ప్రైవేటు కన్సల్టెంట్లను మార్చా ల్సి ఉంటుందని అధికారులు సూచిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Operation Sindoor: మసూద్ అజార్‌కు రూ. 14 కోట్లు చెల్లించనున్న పాక్
Donald Trump: అమెరికాకు సౌదీ బహుమతి.. స్పందించిన ట్రంప్
Teachers in Class Room: క్లాస్ రూమ్‌లోనే దుకాణం పెట్టిన హెడ్ మాస్టర్లు.. వీడియో వైరల్
For AndhraPradesh News And Telugu News