Nara Lokesh: బెదిరించినట్టు ఎక్కడ ఉంది?
ABN , Publish Date - Mar 05 , 2025 | 02:49 AM
వీసీల రాజీనామా అంశంపై మంగళవారం మరోమారు శాసనమండలిలో వాడీవేడిగా చర్చ జరిగింది.

వీసీల రాజీనామా లేఖల్లో ఆ పదం చూపించగలరా?
మండలిలో బొత్సకు మంత్రి లోకేశ్ సవాల్
వీసీల అంశంపై మరోసారి మంటలు
సభా హక్కుల నోటీసు ఇచ్చిన లోకేశ్
అమరావతి, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): వీసీల రాజీనామా అంశంపై మంగళవారం మరోమారు శాసనమండలిలో వాడీవేడిగా చర్చ జరిగింది. వీసీలు సమర్పించిన రాజీనామా లేఖల్లో బెదిరించారనే పదం ఎక్కడ ఉందో చూపించాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సవాల్ విసిరారు. యూనివర్సిటీ వైస్ చాన్సలర్లను బెదిరించారని శాసనమండలిలో విపక్షనేత బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై లోకేశ్ సభా హక్కుల నోటీసును(ప్రివిలేజ్ మోషన్) ఇచ్చారు. దానిని సభాహక్కుల కమిటీకి పంపాలని మండలి చైర్మన్‌ను కోరారు. వీసీలు స్వచ్ఛందంగా రాజీనామా చేశారని, వారి రాజీనామాలను గవర్నర్ ఆమోదించారని లోకేశ్ తెలిపారు. కూటమి ప్రభుత్వంలో పారదర్శకంగా వీసీల నియామకం చేపట్టామని స్పష్టం చేశారు. వీసీల నియామకం అంశంపై వైసీపీ సభ్యుల తీరును లోకేశ్ దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వం రాగానే 17 మంది వీసీలను బలవంతంగా రాజీనామా చేయించారనే అంశంపై ఆధారాలు సభ ముందు పెడుతున్నామని, దీనిపై విచారణ జరిపించాలని బొత్స డిమాండ్ చేశారు. బెదిరించకపోతే ఇంతమంది ఎలా రాజీనామా చేస్తారని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై లోకేశ్ అభ్యంతరం తెలిపారు. గతంలో రికార్డులు తీయాలని, ఆ రికార్డుల ఆఽధారంగా వీసీలను టీడీపీ ప్రభుత్వం బెదిరించినట్లు వైసీపీ సభ్యులు ఆరోపణలు చేశారా, లేదా గుర్తించాలని కోరారు. ‘‘బెదిరించి వీసీలతో రాజీనామా చేయించారని మీ సభ్యులు ఇదే సభలో అన్నారా? లేదా?’’ అంటూ బొత్సను లోకేశ్ నిలదీశారు. రాజీనామా చేసిన 17మందిలో 10మంది వ్యక్తిగత కారణాలతో కొందరు, ఏ కారణం చెప్పకుండానే ఇంకొందరు రాజీనామా చేశారనీ, మరో ఇద్దరు ప్రభుత్వానికి ఫ్రీహ్యాండ్ ఇవ్వాలని రాజీనామా చేస్తున్నట్టు పేర్కొన్నారనీ, ఐదుగురు తమకు అందిన మౌఖిక ఆదేశాల మేరకు రాజీనామా చేస్తున్నామని తెలిపారన్నారు.
వైసీపీ ప్రభుత్వం ఆనాడు నియమించిన వీసీలకు ఆరో తరగతిలో ఉండే బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్ కూడా రాదని ఎద్దేవా చేశారు. రాజీనామా చేసిన ఒక వీసీ వైఎస్‌రాజారెడ్డి చెల్లెలి కోడలు అని, మరో వీసీ ప్రసాద్‌రెడ్డి వైసీపీ కార్యకర్తని, ఆయన వర్సిటీలో జగన్ బర్త్‌డే వేడుకలు నిర్వహించారని, వైసీపీ కోసం సర్వేలు చేయించిన ఘనత నాటి వీసీలకు ఉందని ధ్వజమెత్తారు. నాడు 117 జీవో తెచ్చి 12లక్షల మంది విద్యార్థులను బడికి దూరం చేశారని విమర్శించారు. వీటన్నింటిపై చర్చకు సిద్ధమా అని లోకేశ్ సవాల్ విసిరారు. వైసీపీ హయాంలో విద్యాశాఖను ఏటీఎంగా వాడుకున్నారని మండిపడ్డారు. వీసీల రాజీనామాలపై విచారణకు వైసీపీ సభ్యులు డిమాండ్ చేశారు. పోడియం వద్దకు వెళ్లి నిరసన తెలిపారు. టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య వాగ్వాదంతో మండలిని చైర్మన్ బుధవారానికి వాయిదా వేశారు.