AP Budget Illusions: ఏం బాగున్నామని!?
ABN , Publish Date - Dec 16 , 2025 | 03:56 AM
ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా వెనుకబడి ఉండటం నిజం! జగన్ హయాంలో రాష్ట్రం బ్రాండ్ పాతాళానికి దిగజారింది. అప్పుడు పరిస్థితి వేరు. ‘బటన్ నొక్కితే చాలు...
‘ఎక్కడ తగ్గాలో’ తెలియకుండా గణాంకాలు
జీఎ్‌సడీపీ, తలసరి ఆదాయంలో ‘తగ్గేదేలే’
అసలు కష్టాలను దాచి కాగితాలపై గొప్పలు
దీంతో కేంద్ర పన్నుల్లో వాటాలో భారీగా కోత
రెవెన్యూ లోటు గ్రాంట్లలోనూ నష్టమే
కేవలం అప్పుల కోసం జీఎ్‌సడీపీకి రెక్కలు
జగన్ హయాంలో అప్పులే ఆలంబన
నేడు.. అప్పులతోపాటు ‘ఇమేజ్’ కోసం ఆరాటం
ఆర్థిక సంఘం నిబంధనల్లో సవరణకై యత్నాలు
ఢిల్లీ చుట్టూ రాష్ట్ర అధికారుల చక్కర్లు
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా వెనుకబడి ఉండటం నిజం! జగన్ హయాంలో రాష్ట్రం బ్రాండ్ పాతాళానికి దిగజారింది. అప్పుడు పరిస్థితి వేరు. ‘బటన్ నొక్కితే చాలు... అప్పులు చేసి సొమ్ములు పంచితే చాలు’! ఇప్పుడు పరిస్థితి వేరు! సంక్షేమం జరగాలి. అభివృద్ధి కావాలి. పెట్టుబడులు రావాలి! అన్నీ జరగాలంటే... బోలెడన్ని నిధులు కావాలి. ఇప్పుడు కొత్త పెట్టుబడులు రావాలన్నా, విదేశీ ఇన్వెస్టర్లను ఆకర్షించాలన్నా... రాష్ట్రం ఆర్థికంగా బాగుండాలి. కనీసం... బాగున్నట్లు కనిపించాలి. దీనికోసం... జీఎస్‌డీపీ, తలసరి ఆదాయం, ఇతర గణాంకాలను చకచకా నిచ్చెన ఎక్కిస్తున్నారు. గ్రాఫ్‌లో గీత పైపైకి పోతోంది. ‘వృద్ధిరేటు’పై ముఖ్యమంత్రి చంద్రబాబు ఇస్తున్న లక్ష్యాలూ అలాగే ఉన్నాయి. కానీ... ఈ గొప్పల లెక్కల వల్ల భారీ నష్టం జరుగుతోందని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. రాష్ట్రానికి రావాల్సిన గ్రాంట్లకు గండి పడుతోందని పేర్కొంటున్నారు. ఉదాహరణకు... ఈ ఏడాది కేంద్ర పన్నుల్లో వాటాగా రాష్ట్రానికి రూ.7,500 కోట్లు వచ్చాయి. అదే సమయంలో బిహార్‌కు రూ.17,500 కోట్లు వెళ్లాయి. అంటే... సంవత్సరానికి పదివేల కోట్లు ఎక్కువ. రాష్ట్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం... మన జీఎస్డీపీ, వృద్ధి రేటు వెలిగిపోతోంది కాబట్టి, కేంద్ర పన్నుల్లో వాటా కూడా తక్కువగా వస్తోంది. నిజానికి... ఏపీ అప్పులు, ఖర్చులు బిహార్‌కంటే తక్కువేమీ లేవు. రాష్ట్రానికి ఆదాయం తక్కువే అయినప్పటికీ పన్నుల్లో వాటా ఉత్తరాది రాష్ట్రాలకు వచ్చిన స్థాయిలో రావడం లేదు. దీనికి కారణం కాగితాలపై మాత్రమే పెరుగుతున్న ఏపీ జీఎ్‌సడీపీ, తలసరి ఆదాయమే!
ఇదేం చిత్రమో...
రాష్ట్ర ఆదాయంలో... కేంద్ర పన్నుల్లో వాటా చాలా కీలకం. గతంలో రాష్ట్రం నుంచి వసూలైన కేంద్ర పన్నుల్లో నేరుగా 42 శాతాన్ని తిరిగి ఇచ్చేవారు. 2005 నుంచి ఈ పద్ధతి మార్చారు. మోదీ వచ్చాక దీనిని మరిన్ని మార్పులతో పకడ్బందీగా అమలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన కేంద్ర పన్నుల్లో 42 శాతం వాటా పరిగణనలోకి తీసుకుని... ఆయా రాష్ట్రాల ఆర్థిక వెనుకబాటు (ఇన్‌కమ్ డిస్టెన్స్) ఆధారంగా ఆ మొత్తాన్ని పంచుతున్నారు. అంటే.. ఆర్థికంగా బాగున్న రాష్ట్రాలకు తక్కువ వాటా! వెనుకబడిన రాష్ట్రాలకు ఎక్కువ వాటా! ఏపీ చెప్పుకొంటున్న లెక్కల ప్రకారం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వెలిగిపోతోంది. అందుకే... కేంద్ర పన్నుల్లో తక్కువ వాటా వస్తోంది. ఆర్థిక సంఘం విధి విధానాల ప్రకారమే ఈ వాటాలను నిర్ణయిస్తారు. జనాభా, అటవీ విస్తీర్ణం, ఆర్థిక అసమానతలు... ఇలా పలు ప్రాతిపదికల ఆధారంగా కేంద్ర పన్నుల్లో వాటాలను ఆర్థిక సంఘం నిర్ణయిస్తుంది. ఇందులో... ఆర్థిక అసమానతలు అనే ప్రాతిపదికకు 45ు వాటా ఇస్తోంది. ‘వెనుకబడి ఉన్నాం’ అని గణాంకాల్లో చెప్పుకోకపోవడంతో కేంద్ర పన్నుల్లో వాటాకు భారీగా కోత పడుతోంది. ఇప్పటికైనా గణాంకాల్లో అసలు పరిస్థితిని వివరిస్తున్నారా అంటే అదీ లేదు. ఆర్థిక సంఘం విధి విధానాలనే మార్చేందుకు తీవ్రస్థాయిలో ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రానికి అదనపు వాటాలు సాధించేందుకు 16వ ఆర్థిక సంఘం చుట్టూ తిరుగుతున్నారు. 2026 ఏప్రిల్ నుంచి 16వ ఆర్థిక సంఘం మార్గదర్శకాలు అమల్లోకి వస్తాయి. 2026-27 బడ్జెట్‌ను కేంద్రం ఫిబ్రవరి 1న ప్రవేశపెడుతుంది. దీంతో... 16వ ఆర్థిక సంఘం మార్గదర్శకాలు మనకు అనుకూలంగా ఉండేలా, రాష్ట్రానికి ఎక్కువ నిధులు వచ్చేలా చేసేందుకు నానా తిప్పలు పడుతున్నారు. జనాభా నియంత్రణ, అటవీ విస్తీర్ణంలో ఏపీ పరిస్థితి మెరుగ్గా ఉంది కాబట్టి... ఆ కోటాలో ఎక్కువ వాటా ఇవ్వాలని, ‘ఇన్‌కమ్ డిస్టెన్స్’కు ఇస్తున్న 45 శాతం వాటాను 30 శాతానికి తగ్గించాలని కోరుతున్నారు. ఇందుకు 16వ ఆర్థిక సంఘం స్పందన ఏమిటో తెలియదు. ఉత్తరాది రాష్ట్రాలకు నష్టం చేసే నిర్ణయాలు తీసుకుంటారన్నది అనుమానమే!
క్యూ2లో దేశ సగటును దాటేశాం..
జగన్ సర్కారు దిగిపోయేనాటికి రాష్ట్ర జీఎ్‌సడీపీ సుమారు రూ.14 లక్షల కోట్లు! ఇప్పుడు ఏడాదికి రూ.2 లక్షల కోట్ల చొప్పున జీఎ్‌సడీపీని పెంచి చూపిస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే తలసరి ఆదాయమూ పెంచుతున్నారు. అన్నీ ‘బాగున్నాక’ ఆర్థిక సంఘం ఎందుకు పట్టించుకుంటుంది? జగన్ హయాంలో అప్పులకోసం ప్రతి ఏటా జీఎ్‌సడీపీని పేపర్లపై పెంచుతూ వస్తున్నారు. ఇప్పుడు అప్పులతోపాటు ఏపీ బ్రాండ్ ఇమేజ్ కోసం అదే పని చేస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం (క్యూ2)లో ఏపీ జీఎ్‌సడీపీ 11.28 శాతానికి చేరుకుంది. అదే సమయంలో దేశ జీడీపీ 8.7 శాతం మాత్రమే. దేశ సగటు కంటే తక్కువగా ఉన్న రాష్ట్రాలకే ఆర్థిక సంఘాలు ఎక్కువ నిధులు కేటాయిస్తాయి. ఏపీ మాత్రం దేశ సగటును దాటేసి ఎంతో ముందుకుపోయింది. ఇక... తలసరి ఆదాయం కూడా అంతే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.3,47,871గా చూపించారు. జాతీయ తలసరి ఆదాయం 2024-25లో రూ.2,05,324 మాత్రమే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జాతీయ తలసరి ఆదాయం రూ.2.85 లక్షల వరకు ఉండొచ్చని అంచనా. ‘లెక్కల ప్రకారం’ ఏపీ తలసరి ఆదాయం జాతీయ స్థాయి కంటే ముందంజలో ఉంది. ఇలా, రెండు కీలకమైన సూచీల్లో జాతీయ సగటు కంటే ఎంతో ముందున్నామని మనమే చెప్పుకొంటున్నాం! ఇక... కేంద్ర పన్నుల్లో వాటా పెరగడం ఎలా?

ఈ అంచనాలతో ఎవరికి ఉపయోగం?
రాష్ట్ర బడ్జెట్ రూ.3.22 లక్షల కోట్లు. కనీసం ఇందులో సగమైనా రాష్ట్ర సొంత ఆదాయం ఉండాలి. కానీ అలా లేదు. కాగ్ లెక్కల ప్రకారం, ఈ ఆర్థిక సంవత్సరంలో గడచిన 8 నెలల్లో వచ్చిన పన్ను ఆదాయం రూ.68,102 కోట్లు మాత్రమే. కానీ... బడ్జెట్‌లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పన్ను ఆదాయం రూ.1,09,007 కోట్లు, పన్నేతర ఆదాయం రూ.19,119 కోట్లు వస్తుందని అంచనా వేశారు. మొత్తం రూ.1,28,126 కోట్ల ఆదాయం రాష్ట్రం సొంతంగా సమకూర్చుకోగలదని అర్థం. ఇవే గణాంకాలను 16వ ఆర్థిక సంఘానికి సమర్పించారు. పన్నేతర ఆదాయం రూ.19,119 కోట్లు వస్తుందనడం గాలిలో మేడలు కట్టడమే. అది రూ.5,000 కోట్లు దాటితే అదే గొప్ప. ఏప్రిల్ నుంచి నవంబరు వరకు కేవలం రూ.3671 కోట్ల పన్నేతర ఆదాయం మాత్రమే వచ్చింది. ప్రభుత్వంలో అందరికీ ఇది తెలిసినా అంచనాలు విపరీతంగా పెంచి చూపిస్తున్నారు. పన్ను ఆదాయం నవంబరు నాటికే రూ.94,033.98 కోట్లు వచ్చినట్టు కాగ్ తన నివేదికలో వెల్లడించింది. కానీ, ఇందులో కేంద్ర పన్నుల్లో నుంచి రూ.25,931 కోట్లు వాటాగా వచ్చింది. అంటే ఈ 8 నెలల్లో రూ.68,102 కోట్లు మాత్రమే రాష్ట్ర పన్నుల ద్వారా వచ్చాయి. ఇది కాకుండా కేంద్రం నుంచి ఇప్పటి వరకు రూ.7692 కోట్ల గ్రాంట్లు వచ్చాయి. ఇప్పుడు ప్రభుత్వ ఖర్చులు చూస్తే.. నవంబరు నాటికి రెవెన్యూ లోటు 163 శాతానికి చేరుకుంది. నవంబరు నాటికి ప్రభుత్వం రూ.1,59,753 కోట్లు ఖర్చు చేసింది. క్యాపిటల్ వ్యయం రూ.16,910 కోట్లు.

లోటుకూ ‘సూటూ బూటు’ వేసి!
కేంద్ర పన్నుల్లో వాటా లో నష్టం ఒక ఎత్తైతే... రెవెన్యూ లోటు గ్రాంటులో దెబ్బ ఒక ఎత్తు! నిబంధనల ప్రకారం... ఆర్థిక సంఘానికి రాబోయే ఐదేళ్ల బడ్జెట్ అంచనాలు సమర్పించాలి. అందులో రెవెన్యూ లోటు ఆధారంగా.. దానికి సంబంధించిన గ్రాంటును నిర్ణయిస్తారు. కానీ... మన బడ్జెట్ ఏటేటా పెరిగిపోతూనే ఉంది. లేని ఆదాయాన్ని చూపించడం కొన్నేళ్లుగా అలవాటుగా మారింది. దీంతో... రెవెన్యూ లోటును కూడా తక్కువ చేసి చూపిస్తున్నారు. వెరసి... కేంద్రం నుంచి రావాల్సిన సంబంధిత గ్రాంటుకు కోత పడుతోంది. ఉదాహరణకు... ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ వ్యయం రూ.2.56 లక్షల కోట్లు ఉంటుందని 16వ ఆర్థిక సంఘానికి రాష్ట్రం వివరాలు సమర్పించింది. ఇందులో... జీతాలు, పెన్షన్లు, రాయితీలు, పథకాలు, రేషన్ బియ్యం... ఇలాంటివన్నీ ఉన్నాయి. అంటే కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే పన్నుల వాటాను కలపకుండా లెక్కిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెవెన్యూ లోటు 1,28,146 కోట్లు. నిజమైన లెక్కలు సమర్పిస్తే... ఈ లోటు మరో 20వేల కోట్లకు పైగానే ఉంటుంది. ఆ లెక్కలు చూపిస్తే గ్రాంటు మరింత పెరిగే అవకాశముంది. కానీ... లోటు లెక్కలకూ ‘సూటూ బూటూ’ వేసి కవర్ చేస్తుండటంవల్ల గ్రాంటు తగ్గుతోంది.

జీతాలకూ కటకటే!
డిసెంబరులో ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం ఇబ్బందిపడింది. డిసెంబరు 2న ఆర్‌బీఐలో రాష్ట్ర సెక్యూరిటీలు వేలం వేసి రూ.3,000 కోట్లు అప్పు తెచ్చారు. మూడో తేదీ నుంచి జీతాలు, పెన్షన్ల చెల్లింపులు మొదలుపెట్టారు. పదో తేదీ వరకు వేస్తూనే ఉన్నారు. ఇప్పుడు మళ్లీ డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలకు కావాల్సిన అప్పుల కోసం కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ నాలుగు నెలలకు కనీసం రూ.25,000 - రూ.30,000 కోట్ల అప్పులు అవసరమవుతాయని అంచనా. ఈ అప్పులకు అనుమతితోపాటు... 16 ఆర్థిక సంఘానికి వినతుల కోసం రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు ఢిల్లీలో తిరుగుతున్నారు.