Share News

Bhargavastra: శత్రు డ్రోన్ల దండుపై భార్గవాస్త్రం

ABN , Publish Date - May 15 , 2025 | 03:08 AM

భార్గవాస్త్రం, స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన కౌంటర్‌ డ్రోన్‌ వ్యవస్థ, విజయవంతంగా పరీక్ష చేయబడింది. ఇది 6-10 కిలోమీటర్ల దూరంలో ఉన్న డ్రోన్లను అడ్డుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంది.

Bhargavastra: శత్రు డ్రోన్ల దండుపై భార్గవాస్త్రం

స్వదేశీ కౌంటర్‌ డ్రోన్‌ వ్యవస్థ పరీక్ష సక్సెస్‌

న్యూఢిల్లీ, మే 14: భారత గగనతల రక్షణ వ్యవస్థ మరింత బలోపేతమయ్యే దిశగా మరో ముందడుగు పడింది. గుంపుగా వచ్చిపడే శత్రు డ్రోన్ల సమూహాన్ని పక్కాగా ఛేదించే స్వదేశీ కౌంటర్‌ డ్రోన్‌ వ్యవస్థ ‘భార్గవాస్త్ర’ను భారత్‌ విజయవంతంగా పరీక్షించింది. సోలార్‌ డిఫెన్స్‌ అండ్‌ ఏరోస్పేస్‌ లిమిటెడ్‌ (ఎస్‌డీఏఎల్‌) స్వదేశీ పరిజ్ఞానంతో, తక్కువ ఖర్చుతో అభివృద్ధి చేసిన భార్గవాస్త్ర... ఒకేసారి అనేక డ్రోన్లతో దాడి చేసినప్పటికీ వాటిని సమర్థవంతంగా అడ్డుకుంటుంది. ఈ వ్యవస్థలో ఉపయోగించిన రాకెట్లకు ఒడిసాలోని గోపాల్‌పూర్‌లో ఉన్న సీవార్డ్‌ ఫైరింగ్‌ రేంజ్‌లో మంగళవారం నిర్వహించిన పరీక్ష విజయవంతమైంది. ఈ సందర్భంగా ఇది అన్ని లక్ష్యాలను విజయవంతంగా ఛేదించినట్టు ఆర్మీ ఎయిర్‌ డిఫెన్స్‌ (ఏడీడీ) అధికారులు తెలిపారు. దీనికి మొత్తం మూడు ట్రయల్స్‌ నిర్వహించారు. రెండు సార్లు ఒక్కో రాకెట్‌ను విడివిడిగా పరీక్షించగా.. మూడో ట్రయల్‌లో రెండు సెకన్ల వ్యవధిలో రెండు రాకెట్లను పరీక్షించారు. పరీక్షల సందర్భంగా ఈ నాలుగు రాకెట్లు సమర్థవంతంగా పనిచేశాయని, నిర్దేశిత పారామితులను సాధించాయని అధికారులు చెప్పారు.


6-10 కి.మీ. దూరంలోనే గుర్తింపు

భార్గవాస్త్రను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేశారు. ఇది 2.5 కిలోమీటర్ల దూరం నుంచి వస్తున్న డ్రోన్లను గుర్తించి మైక్రో రాకెట్ల సాయంతో నిర్వీర్యం చేయగలదు. తొలి లేయర్‌లో అన్‌గైడెడ్‌ మైక్రో రాకెట్ల సాయంతో 20 మీటర్ల పరిధిలో ఉన్న డ్రోన్ల దండును నాశనం చేయగలదు. రెండో లేయర్‌లో ఉన్న గైడెడ్‌ మైక్రో మిస్సైల్స్‌ లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో గుర్తించి నిర్వీర్యం చేస్తాయి. ఇందులో ఏర్పాటు చేసిన రాడార్‌ వ్యవస్థ గగనతలంలో 6 నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముప్పును కూడా పసిగట్టగలదు. దీనిలోని ఎలకో్ట్ర-ఆప్టికల్‌/ఇన్‌ఫ్రారెడ్‌ సెన్సర్‌ సూట్‌ తక్కువ ఎత్తులో వచ్చే డ్రోన్లను కూడా అత్యంత కచ్చితత్వంతో గుర్తించగలదు. సముద్ర మట్టానికి 5వేల మీటర్ల ఎత్తులో ఉండే భూభాగాల్లో, కొండ ప్రాంతాల్లోనూ వీటిని సమర్థవంతంగా ఉపయోగించవచ్చు.


ఈ వార్తలు కూడా చదవండి..

Operation Sindoor: మసూద్ అజార్‌కు రూ. 14 కోట్లు చెల్లించనున్న పాక్

Donald Trump: అమెరికాకు సౌదీ బహుమతి.. స్పందించిన ట్రంప్

Teachers in Class Room: క్లాస్ రూమ్‌లోనే దుకాణం పెట్టిన హెడ్ మాస్టర్లు.. వీడియో వైరల్

For AndhraPradesh News And Telugu News

Updated Date - May 15 , 2025 | 03:08 AM