Operation Sindoor: భారత్, పాక్ యుద్ధం.. తెలుగు జవాన్ మురళీ నాయక్ వీరమరణం
ABN , Publish Date - May 09 , 2025 | 12:43 PM
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ తర్వాతి నుంచి పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. రెండు దేశాలు హోరాహోరీగా బాంబుల వర్షం కురిపించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఓ తెలుగు జవాన్ యుద్ధంలో వీర మరణం పొందాడు.
భారత్, పాకిస్తాన్‌ల మధ్య జరుగుతున్న యుద్ధంలో ఓ తెలుగు జవాన్ వీర మరణం పొందాడు. శ్రీ సత్య సాయి జిల్లా గోరంట్ల మండలం, కల్లితాండ పంచాయతీకి చెందిన మురళీ నాయక్ యుద్ధ భూమిలో కన్నుమూశాడు. మురళీ నాయక్ మరణంతో స్వగ్రామంలో విషాదం నెలకొంది. తల్లిదండ్రులు శ్రీరాం నాయక్, జ్యోతీ బాయిలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ వీర జవాన్ ఈ దంపతుల ఏకైక సంతానం కావటం గమనార్హం.
వీర జవాన్ మురళీ నాయక్ మరణంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈ మేరకు శుక్రవారం తన ట్విటర్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో.. ‘ దేశ రక్షణలో శ్రీ సత్యసాయి జిల్లా, పెనుకొండ శాసన సభ నియోజకవర్గం, గోరంట్ల మండలానికి చెందిన మురళీ నాయక్ అనే సైనికుడు ప్రాణాలు కోల్పోవడం విషాదకరం. దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుడు మురళీ నాయక్‌కు నివాళులు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అని పేర్కొన్నారు.
నన్ను తీవ్ర ఆవేదనకు గురిచేసింది: మంత్రి లోకేష్
ఆపరేషన్ సిందూర్లో భాగంగా జమ్మూ కాశ్మీర్ యుద్ధ భూమిలో పోరాడుతూ.. రాష్ట్రానికి చెందిన మురళీ నాయక్ వీరమరణం పొందడం తనను తీవ్ర ఆవేదనకు గురిచేసిందని రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. మురళీ నాయక్ చూపిన ధైర్య,సాహసాలు రాష్ట్రానికే గర్వకారణమని పేర్కొన్నారు. మురళీ నాయక్ పార్థివ దేహానికి రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిపిస్తామని తెలిపారు. ఆయన కుటుంబానికి అన్నివిధాలా అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి
Operation Sindoor: దేశంలోకి చొరబాటుకు యత్నం.. 7గురు టెర్రరిస్టులు హతం
PIB Fact Check: 3 రోజుల పాటు ATMలు బంద్.. వైరల్ పోస్టుపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్..