Share News

VK Saraswat: పరిశోధనలతో ఆర్థిక వ్యవస్థ ఉత్తేజితం

ABN , Publish Date - Jun 29 , 2025 | 06:02 AM

పరిశోధనల ద్వారా ఆర్థిక వ్యవస్థ ఉత్తేజితమవుతుందని, తద్వారా దేశం గ్లోబల్‌ లీడర్‌గా మార్పు చెందుతుందని నీతి ఆయోగ్‌ సభ్యుడు, ప్రఖ్యాత మిస్సైల్‌ శాస్త్రవేత్త, పద్మభూషణ్‌ అవార్డు గ్రహీత వీకే సారస్వత్‌ అన్నారు.

VK Saraswat: పరిశోధనలతో ఆర్థిక వ్యవస్థ ఉత్తేజితం

  • మనది మూడో అతిపెద్ద అంకుర వ్యవస్థ

  • నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే సారస్వత్‌

రాజానగరం, జూన్‌ 28(ఆంధ్రజ్యోతి): పరిశోధనల ద్వారా ఆర్థిక వ్యవస్థ ఉత్తేజితమవుతుందని, తద్వారా దేశం గ్లోబల్‌ లీడర్‌గా మార్పు చెందుతుందని నీతి ఆయోగ్‌ సభ్యుడు, ప్రఖ్యాత మిస్సైల్‌ శాస్త్రవేత్త, పద్మభూషణ్‌ అవార్డు గ్రహీత వీకే సారస్వత్‌ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం వెలుగుబందలోని గోదావరి గ్లోబల్‌ విశ్వవిద్యాలయం(జీజీయూ)లో వికసిత్‌ భారత్‌-2047 లక్ష్యానికి అనుగుణంగా భారత ప్రభుత్వం.. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ‘వికసిత్‌ భారత్‌ ఎట్‌ 2047 కోసం పరిశోధన, ఆవిష్కరణను ఉపయోగించడం’ అనే అంశంపై రెండు రోజుల పాటు జరిగే జాతీయ సదస్సు శనివారం ప్రారంభించారు.


జీజీయూ చాన్సలర్‌ కేవీవీ సత్యనారాయణరాజు (చైతన్యరాజు)అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో సారస్వత్‌ ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. 30 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా రూపొందడం, రక్షణ, శాస్త్ర సాంకేతిక రంగాల్లో స్వయం సమృద్ధి సాధించడం, సుస్థిరతను కార్బన్‌ న్యూట్రాలిటీని సాధించడం వంటి లక్ష్యాలను వికసిత్‌ భారత్‌లో ప్రధాని మోది నిర్దేశించినట్లు సారస్వత్‌ తెలిపారు. వీటి సాధనకు పరిశోధనలు అవసరమన్నారు. మనం డిజిటల్‌ ఎకానమీపై దృష్టి సారించాలని, 2030 నాటికి ఒక ట్రిలియన్‌ డిజిటల్‌ ఎకానమీ లక్ష్యాన్ని చేరుకోవాలని అభిలషించారు. ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్ల 2014లో ప్రపంచ ఇన్నోవేషన్‌ ఇండెక్స్‌ (జీఐఐ)లో 76వ స్థానంలో ఉన్న దేశం ప్రస్తుతం 39వ స్థానానికి చేరుకుందని తెలిపారు. ప్రస్తుతం మనది మూడో అతిపెద్ద అంకుర వ్యవస్థ అని, 2023లో గంటకు మూడు చొప్పున స్టార్టప్స్‌ నమోదయ్యాయని, ప్రస్తుతం 118 యూనికార్న్‌ స్టార్ట్‌పలు ఉన్నాయని వెల్లడించారు. కార్యక్రమంలో జీజీయూ ప్రో చాన్సలర్‌ కె.శశికిరణ్‌ వర్మ, వైస్‌ చాన్సలర్‌ యు.చంద్రశేఖర్‌, ప్రో వైస్‌ చాన్సలర్‌ కేవీబీ రాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 29 , 2025 | 06:02 AM