Justice Dheeraj Singh Thakur: హైకోర్టులో ఘనంగా పంద్రాగస్టు వేడుకలు
ABN , Publish Date - Aug 16 , 2025 | 04:08 AM
రాష్ట్ర హైకోర్టులో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ మువ్వన్నెల పతాకాన్ని ఆవిష్కరించి..
జాతీయ జెండాను ఆవిష్కరించిన సీజే జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్
అమరావతి, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర హైకోర్టులో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ మువ్వన్నెల పతాకాన్ని ఆవిష్కరించి, వందనం చేశారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో సీజే మాట్లాడుతూ... ‘ప్రజాస్వామ్యానికి జ్యుడీషియరీ ఓ బలమైన స్తంభం. ఎన్నో సంక్లిష్ట సమస్యలను పరిష్కరించడమేకాక, రాజ్యాంగం ప్రసాదించిన ప్రజాస్వామ్య స్ఫూర్తిని న్యాయవ్యవస్థ కాపాడుతోంది. దేశాభివృద్ధికి ప్రజలందరూ పునరంకితం కావాలి’ అని పిలుపునిచ్చారు. హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కె.చిదంబరం, బార్ కౌన్సిల్ ఛైర్మన్ ఎన్.ద్వారకానాథ్‌రెడ్డి, అడ్వకేట్‌జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, అడిషనల్ సొలిసిటర్ జనరల్ చల్లా ధనంజయ మాట్లాడుతూ.. స్వాతంత్య్ర ఉద్యమంలో న్యాయవాదులు కీలకపాత్ర పోషించారన్నారు. ప్రస్తుత సమాజంలో న్యాయవాదులపై దాడులు పెరిగిన నేపఽథ్యంలో అడ్వొకేట్ రక్షణ చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ వేడుకలకు హైకోర్టు న్యాయమూర్తులు, వారి కుటుంబ సభ్యులు, విశ్రాంత న్యాయమూర్తులు జస్టిస్ శ్యాంప్రసాద్, జస్టిస్ ఏవీ శేషసాయి, జస్టిస్ దుప్పల వెంకటరమణ, అడిషనల్ అడ్వొకేట్ జనరల్ సాంబశివప్రతాప్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ, రిజిస్ట్రార్‌లు, న్యాయవాదులు పాల్గొన్నారు.

న్యాయసేవాధికార సంస్థలో..
సచివాలయం సమీప ఏపీ న్యాయసేవాధికార సంస్థ కార్యాలయంలో జరిగిన స్వాతంత్య్రదినోత్సవ వేడుకల్లో జస్టిస్ రవినాథ్ తిల్హరి జాతీయ జెండాను ఎగురవేసి, వందనం సమర్పించారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో..
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం విజయవాడలోని పశుసంవర్ధకశాఖ ప్రధాన కార్యాలయంలో డైరెక్టర్ దామోదర్‌నాయుడు, తాడేపల్లిలోని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్‌జైన్, గుంటూరు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వీసీ శారదా జయలక్ష్మి, మంగళగిరిలోని అటవీ శాఖ ప్రధాన కార్యాలయంలో పీసీసీఎఫ్ ఏకే నాయక్ మువ్వెన్నల జెండాను ఎగుర వేశారు.