Share News

Highway : 6 లేన్లుగా హైదరాబాద్‌-విజయవాడ హైవే

ABN , Publish Date - Mar 04 , 2025 | 06:44 AM

హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌-65) ఆరు లేన్ల విస్తరణ ప్రక్రియలో కీలక అడుగు పడింది. ఆ మార్గంలో ప్రస్తుతం ఉన్న నాలుగు లేన్లను

Highway :  6 లేన్లుగా హైదరాబాద్‌-విజయవాడ హైవే

  • ఖరారైన డీపీఆర్‌ కన్సల్టెంట్‌ సంస్థ

  • అధ్యయనానికి రూ.9.86 కోట్ల ఖర్చు

  • త్వరలో సంస్థతో కేంద్రం ఒప్పందం

  • ఆరు నెలల్లో కేంద్రానికి నివేదిక

  • దండు మల్కాపూర్‌ నుంచి గొల్లపూడి వరకు విస్తరణ

హైదరాబాద్‌, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌-65) ఆరు లేన్ల విస్తరణ ప్రక్రియలో కీలక అడుగు పడింది. ఆ మార్గంలో ప్రస్తుతం ఉన్న నాలుగు లేన్లను ఆరు లేన్లుగా విస్తరించేందుకు అవసరమైన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) తయారీకి కన్సల్టెంట్‌ సంస్థ ఖరారైంది. ఎన్‌హెచ్‌-65ను ఆరు లేన్లుగా విస్తరించే అంశంపై అధ్యయనం చేసి సమగ్ర నివే దిక ఇచ్చేందుకు కేంద్ర రవాణా, రహదారుల శాఖ గతేడాది టెండర్లను ఆహ్వానించింది. టెండర్ల ప్రక్రియలో సాంకేతిక బిడ్‌లను 2025 జనవరి 20న తెరవగా, అందులో అర్హత సాధించిన ఫైనల్‌ టెండర్లను జనవరి 30న తెరిచారు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన ఓ కంపెనీ ఈ పనిని దక్కించుకుంది. ఈ సంస్థతో ఈ నెలాఖరు వరకు కేంద్రం ఒప్పందం కుదుర్చుకోనుంది. రహదారి అధ్యయనం, రోడ్డు భద్రత అంశాలు కలిపి డీపీఆర్‌ తయారీకి రూ.9.86 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ ఒప్పందం జరిగిన తరువాత ఆరు నెలల్లో సమగ్ర నివేదికను సదరు సంస్థ కేంద్రానికి అందించాల్సి ఉంటుంది. ఒప్పందంలో ఇదే విషయాన్ని పొందుపరచనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఎన్‌హెచ్‌-65 రోడ్డును హైదరాబాద్‌ అవతల.. అంటే దండు మల్కాపూర్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని గొల్లపూడి వరకు దాదాపు 265 కిలోమీటర్ల మేర ఆరు లేన్లుగా విస్తరించనున్నారు.

Updated Date - Mar 04 , 2025 | 06:44 AM