Share News

Eluru: నిద్రలోనే మృత్యుఒడికి..

ABN , Publish Date - Mar 07 , 2025 | 06:59 AM

ఏలూరు సమీపంలోని 16వ నంబర్‌ జాతీయ రహదారిపై చొదిమెళ్ల వద్ద గురువారం వేకువ జామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రైవేటు ట్రావెల్‌ బస్సు టైరు పంక్చర్‌ పడడంతో రోడ్డు పక్కన నిలిపి ఉంచిన లారీని ఢీకొట్టింది.

 Eluru: నిద్రలోనే మృత్యుఒడికి..

  • ఆగి ఉన్న లారీని ఢీకొట్టి ప్రైవేటు బస్సు బోల్తా

  • బస్సు డ్రైవర్‌తోపాటు ముగ్గురు ప్రయాణికుల దుర్మరణం

  • 21 మందికి తీవ్ర గాయాలు..ఏలూరు జిల్లాలో ఘోర ప్రమాదం

ఏలూరు క్రైం, మార్చి 6(ఆంధ్రజ్యోతి): ఏలూరు సమీపంలోని 16వ నంబర్‌ జాతీయ రహదారిపై చొదిమెళ్ల వద్ద గురువారం వేకువ జామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రైవేటు ట్రావెల్‌ బస్సు టైరు పంక్చర్‌ పడడంతో రోడ్డు పక్కన నిలిపి ఉంచిన లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్‌తో పాటు ముగ్గురు ప్రయాణికులు దుర్మరణంపాలయ్యారు. మరో 21 మంది తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్‌ నుంచి కాకినాడ బయలుదేరిన బస్సులోని ప్రయాణికులంతా గాఢనిద్రలో ఉండగా ఈ ఘోరం జరిగింది. ఆర్తనాదాలతో దద్దరిల్లిన ఆ ప్రాంతానికి స్థానికులు, హైవే పెట్రోలింగ్‌ పోలీసులు హుటాహుటిన చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు, క్షతగాత్రుల కథనం మేరకు.. హైదరాబాద్‌ నుంచి కాకినాడకు రమణ ట్రావెల్‌ బస్సు బుధవారం రాత్రి బయలుదేరింది. గురువారం తెల్లవారుజాము 5.30 గంటల సమయంలో ఏలూరు సమీపంలోని చొదిమెళ్ల వద్ద బస్సు వేగంగా వెళ్తుండగా, టైరు పంక్చర్‌ కావడంతో అదుపుతప్పి రోడ్డు పక్కన నిలిపి ఉంచిన లారీని అతివేగంగా ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సు ఎడమభాగం నుజ్జునుజ్జుకాగా, ఏలూరు జిల్లా భీమడోలు మండలం గుర్రాల చెరువుకు చెందిన బొంతు భీమేశ్వరరావు(43), కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం కాట్రావులపల్లికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ మటపర్తి భవాని(23), కాజులూరు మండలం కోలావారిపేట, పల్లిపాలేనికి చెందిన జుత్తిగ భవాని(38) అక్కడికక్కడే మరణించారు. కాకినాడకు చెందిన బస్సు డ్రైవర్‌ ముంగంటి మధుసూదన్‌(38) ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ కొద్దిసేపటికే మృతి చెందాడు. తీవ్ర గాయాలైన 21 మందిని ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. స్వల్పంగా గాయపడినవారంతా వేరే బస్సులో తమ గ్రామాలకు వెళ్లిపోయారు. కాగా, ప్రమాదం జరిగిన వెంటనే బస్సు రెండో డ్రైవర్‌ అక్కడి నుంచి పరారయ్యాడు. ఏలూరు రూరల్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Mar 07 , 2025 | 06:59 AM