High Court: మృతదేహాల కోసం ఛత్తీస్‌గఢ్ పోలీసులను అడగండి
ABN , Publish Date - May 25 , 2025 | 06:08 AM
ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన మావోయిస్టు నేతలు నంబాల కేశవరావు, సజ్జా నాగేశ్వరరావుల మృతదేహాల కోసం ఛత్తీస్‌గఢ్ పోలీసులను ఆశ్రయించాలంటూ హైకోర్టు కుటుంబ సభ్యులకు సూచించింది. మృతదేహాల అప్పగింతపై నిర్ణయం స్థానిక పోలీసులకే వదిలింది.

మావోయిస్టుల కుటుంబ సభ్యులకు హైకోర్టు సూచన
అమరావతి, మే 24(ఆంధ్రజ్యోతి): ఎన్‌కౌంటర్‌లో మరణించిన మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు, అగ్రనేత సజ్జా వెంకట నాగేశ్వరరావు మృతదేహాలను అప్పగించాలని ఛత్తీస్‌గఢ్ పోలీసులను కోరాలని వారి కుటుంబ సభ్యులకు హైకోర్టు ధర్మాసనం సూచించింది. ఛత్తీస్‌గఢ్పోలీసులను ఆశ్రయించే వ్యవహారాన్ని పిటిషనర్లకే వదిలేసింది. వ్యాజ్యాలను పరిష్కరించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎన్.హరినాథ్, జస్టిస్ వై.లక్ష్మణరావుతో కూడిన ధర్మాసనం శనివారం ఉత్తర్వులు ఇచ్చింది. తమ వారి మృతదేహాలను అప్పగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ కేశవరావు, నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు శుక్రవారం పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై శనివారం ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది సత్యప్రసాద్ వాదనలు వినిపించారు. ఛత్తీస్‌గఢ్ అడ్వొకేట్ జనరల్(ఏజీ) ప్రఫుల్ భరత్ స్పందిస్తూ.. ఎన్‌కౌంటర్‌లో మొత్తం 27 మంది చనిపోగా, కేశవరావు, నాగేశ్వరరావులతో పాటు 21 మందికి పోస్టుమార్టం ముగిసిందని, మరో ఆరుగురికి శనివారం సాయంత్రంలోగా పూర్తిచేస్తామని చెప్పారు. ఆ తరువాత కుటుంబ సభ్యులకు మృతదేహాలను అప్పగించడమే మిగిలి ఉంటుందన్నారు. రాష్ట్ర ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్లు ఛత్తీస్‌గఢ్ హైకోర్టును ఆశ్రయించి ఉండాల్సిందన్నారు. కేంద్ర హోంశాఖ తరఫున డిప్యూటీ సొలిసిటర్ జనరల్(డీఎస్‌జీ) పసల పొన్నారావు వాదనలు వినిపిస్తూ.. అంతిమ సంస్కారాల సందర్భంగా ర్యాలీలు నిర్వహిస్తే లా అండ్ ఆర్డర్ సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం ఉందనే కారణంతో మృతదేహాలను అప్పగించడానికి నిరాకరించి ఉండవచ్చు అని తెలిపారు. అందరి వాదనలు పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం..ఛత్తీస్‌గఢ్ పోలీస్ అధికారులను ఆశ్రయించే వ్యవహారాన్ని పిటిషనర్లకే వదిలేసింది.