AP High Court: దేవదాయశాఖ కమిషనర్‌గా రామచంద్రమోహన్ అర్హులే
ABN , Publish Date - Mar 04 , 2025 | 06:30 AM
దేవదాయ శాఖ కమిషనర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు చేపట్టేందుకు అడిషనల్ కమిషనర్ రామచంద్రమోహన్ అర్హులేనని హైకోర్టు తేల్చిచెప్పింది.
హైకోర్టు స్పష్టీకరణ
పిటిషన్ కొట్టివేత.. 25 వేలు ఖర్చులు విధింపు
అమరావతి, మార్చి 3(ఆంధ్రజ్యోతి): దేవదాయ శాఖ కమిషనర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు చేపట్టేందుకు అడిషనల్ కమిషనర్ రామచంద్రమోహన్ అర్హులేనని హైకోర్టు తేల్చిచెప్పింది. మూడో వ్యక్తి ప్రోద్బలంతో పిటిషనర్ ప్రస్తుత వ్యాజ్యాన్ని దాఖలు చేశారని పేర్కొంది. కోర్టు విచారణ ప్రక్రియను దుర్వినియోగం చేస్తున్నారనేందుకు ఈ కేసు మంచి ఉదాహరణ అని తెలిపింది. వ్యాజ్యాన్ని కొట్టివేస్తూ పిటిషనర్ రమణమూర్తికి రూ.25వేలు ఖర్చులు విధించింది. ఈ సొమ్మును నాలుగు వారాల్లో ఏపీ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీకి చెల్లించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి ఫిబ్రవరి 28న తీర్పు ఇచ్చారు. సోమవారం తీర్పు ప్రతి అందుబాటులోకి వచ్చింది. దేవదాయశాఖ అడిషనల్ కమిషనర్ రామచంద్రమోహన్ అక్రమాలపై రాష్ట్ర విజిలెన్స్ విచారణ పూర్తయ్యేవరకు ఆయనను దేవదాయశాఖలో కొనసాగించకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ మచిలీపట్నానికి చెందిన వీవీ రమణమూర్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దేవదాయశాఖ కమిషనర్‌గా రామచంద్రమోహన్‌కు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ సీఎస్ ఇచ్చిన ఉత్తర్వుల అమలును నిలుపుదల చేయాలని పిటిషన్‌లో కోరారు. ఈ వ్యాజ్యంపై ఇటీవల తుది విచారణ జరిపిన న్యాయమూర్తి నిర్ణయాన్ని వెల్లడించారు. ‘దేవదాయ శాఖ చట్టంలోని సెక్షన్ 3, 4 ప్రకారం అడిషనల్ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న వ్యక్తి కమిషనర్‌గా నియమితులయ్యేందుకు అర్హులు. చట్టంలోని సెక్షన్ 3(2) ప్రకారం హిందూ మతాన్ని ఆచరించనప్పుడు మాత్రమే కమిషనర్ పోస్టుకు అనర్హులు. వరాహలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, మన్సాస్ ట్రస్ ఈవోగా అక్రమాలకు పాల్పడ్డారంటూ త్రిసభ్య కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా రామచంద్రమోహన్‌ను గతంలో సస్పెండ్ చేశారని, హైకోర్టును ఆశ్రయించి మధ్యంతర ఉత్తర్వులు పొందడం ద్వారా తిరిగి విధుల్లో చేరారని పిటిషనర్ రమణమూర్తి వ్యాజ్యంలో పేర్కొన్నారు. ‘ఇన్‌చార్జి కమిషనర్‌గా రామచంద్రమోహన్ ఏవిధంగా అనర్హుడో అఫిడవిట్‌లో పేర్కొనలేదు. మూడో వ్యక్తి ప్రోద్బలంతో పిటిషనర్ ప్రస్తుత వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. కోర్టు విచారణ ప్రక్రియను దుర్వినియోగం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పిటిషన్‌ను కొట్టివేస్తున్నాం’ అని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు.