NEET: ఆ విద్యార్థులకు ఏం న్యాయం చేశారు
ABN , Publish Date - Jun 05 , 2025 | 06:41 AM
ఇలాంటి సందర్భాలలో విద్యార్థులకు న్యాయం చేసేందుకు ఏ చర్యలు తీసుకున్నారో వివరాలు సేకరించి తమ ముందు ఉంచాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) డైరెక్టర్ జనరల్, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ తరఫు న్యాయవాదులను ఆదేశించింది.
నీట్ కేంద్రంలో విద్యుత్ అంతరాయంపై ప్రభుత్వ న్యాయవాదులకు హైకోర్టు ప్రశ్న
అమరావతి, జూన్ 4(ఆంధ్రజ్యోతి): నెల్లూరు దర్గామిట్టలోని ఓ కేంద్రంలో నీట్ పరీక్ష రాసే సమయంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడటంతో సమయం వృథా అయిందని పేర్కొంటూ బత్తిన శ్రీవల్లి అనే విద్యార్థిని వేసిన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరిపింది. ఇలాంటి సందర్భాలలో విద్యార్థులకు న్యాయం చేసేందుకు ఏ చర్యలు తీసుకున్నారో వివరాలు సేకరించి తమ ముందు ఉంచాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) డైరెక్టర్ జనరల్, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ తరఫు న్యాయవాదులను ఆదేశించింది. విచారణను గురువారానికి వాయిదా చేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎన్.హరినాథ్, జస్టిస్ వై.లక్ష్మణరావుతో కూడిన ధర్మాసనం ఇటీవల ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. నెల్లూరు దర్గామిట్టలోని డీసీఆర్ జెడ్‌పీపీ బాలిక ఉన్నత పాఠశాల కేంద్రంలో మొత్తం 96 మంది విద్యార్థులు నీట్ పరీక్ష రాసేందుకు హాజరయ్యారన్నారు. మళ్లీ పరీక్ష నిర్వహించేలా ఆదేశాలివ్వాలని కోరారు. ఎన్టీఏ తరఫు న్యాయవాది విద్యుత్ సరఫరాలో అంతరాయం విద్యార్థులపై స్వల్ప ప్రభావమే చూపుతుందన్నారు. కాగా, నీట్ పీజీ-2025 పరీక్షకు దరఖాస్తు చేసే సమయంలో ఎన్‌బీఈఎంఎస్ పోర్టల్‌లో సాంకేతిక సమస్య ఏర్పడిందని పేర్కొంటూ వైద్య విద్యార్థిని శీలం జస్వంతి వేసిన పిటిషన్‌పై హైకోర్టు ధర్మాసనం స్పందించింది. విండోను తిరిగి తెరిచి దరఖాస్తు చేసుకొనేందుకు పిటిషనర్‌కు అనుమతివ్వాలని ఎన్‌బీఈఎంఎస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శిని ఆదేశిస్తూ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎన్.హరినాథ్, జస్టిస్ వై.లక్ష్మణరావు ధర్మాసనం ఇటీవల ఉత్తర్వులు ఇచ్చింది.
ఈ వార్తలు కూడా చదవండి..
For AndhraPradesh News And Telugu News