Share News

High Court Denied: సాక్షి ఎడిటర్‌, చీఫ్‌ రిపోర్టర్‌కు హైకోర్టు షాక్‌

ABN , Publish Date - Nov 21 , 2025 | 04:14 AM

శాసనసభ పట్ల ప్రజల్లో తప్పుడు అభిప్రాయాన్ని కలిగించేలా కథనాన్ని ప్రచురించిన సాక్షి ఎడిటర్‌ ధనంజయరెడ్డి, చీఫ్‌ రిపోర్టర్‌ ఫణికుమార్‌కు...

High Court Denied: సాక్షి ఎడిటర్‌, చీఫ్‌ రిపోర్టర్‌కు హైకోర్టు షాక్‌

  • ప్రివిలేజ్‌ కమిటీ విచారణ నిలిపివేతకు హైకోర్టు నిరాకరణ

  • షోకాజ్‌ నోటీసు దశలో ఉత్తర్వులివ్వలేమని స్పష్టీకరణ

అమరావతి, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): శాసనసభ పట్ల ప్రజల్లో తప్పుడు అభిప్రాయాన్ని కలిగించేలా కథనాన్ని ప్రచురించిన ‘సాక్షి’ ఎడిటర్‌ ధనంజయరెడ్డి, చీఫ్‌ రిపోర్టర్‌ ఫణికుమార్‌కు హైకోర్టు గట్టిషాక్‌ ఇచ్చింది. ‘కోట్లు ఖర్చు-శిక్షణ తుస్సు’ అనే శీర్షికతో ప్రచురించిన కథనంపై శాసనసభ ప్రివిలేజ్‌ కమిటీ జరుపుతున్న విచారణ ప్రక్రియను నిలిపివేసేందుకు నిరాకరించింది. షోకాజ్‌ నోటీసు దశలో ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. అదనపు మెటీరియల్‌ సమర్పించేందుకు వీలుగా సమయం ఇచ్చేందుకు అభ్యంతరం లేదన్న సెక్రెటరీ జనరల్‌, ప్రివిలేజ్‌ కమిటీ తరఫు న్యాయవాది వాదనను నమోదు చేసింది. అదనపు మెటీరియల్‌ను ప్రివిలేజ్‌ కమిటీ ముందు ఉంచేందుకు జగన్‌ పత్రిక ఎడిటర్‌, చీఫ్‌ రిపోర్టర్‌కు రెండు వారాలు సమయం ఇచ్చింది. వార్తా కథనానికి సంబంధించి సాక్ష్యం ఇచ్చేందుకు ఈనెల 21న ప్రివిలేజ్‌ కమిటీ ముందు హాజరు కావాలని ఎడిటర్‌, చీఫ్‌ రిపోర్టర్‌లకు సెక్రెటరీ జనరల్‌ లేఖ పంపిన నేపథ్యంలో వారి ఇద్దరి హాజరును ధర్మాసనం వాయిదా వేసింది.

తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌, జస్టిస్‌ ఆర్‌.రఘునందనరావుతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు ఇచ్చింది. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలకు ముందు ఈ ఏడాది ఫిబ్రవరి 22, 23 తేదీలలో ఎమ్మెల్యేలకు శిక్షణ తరగతులు నిర్వహణ వాయిదా పడడంతో రూ.కోట్లు వృథా అయ్యాయని పేర్కొంటూ ‘కోట్లు ఖర్చు-శిక్షణ తుస్సు’ అనే శీర్షికతో సాక్షి పత్రిక కథనాన్ని ప్రచురించింది. ఈ కథనం ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉందని, ప్రచురణ వెనుక దురుద్దేశం ఉందంటూ ఎమ్మెల్యే జి.జయసూర్య ఫిబ్రవరి 25న శాసనసభ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు.

ఈ వ్యవహారాన్ని స్పీకర్‌ ప్రివిలేజ్‌ కమిటీకి రిఫర్‌ చేశారు. దీంతో కమిటీ సాక్షి పత్రికకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. కథనం ప్రచురణపై వివరణ కోరుతూ శాసనసభ సెక్రెటరీ జనరల్‌ జూన్‌ 3న సాక్షి యాజమాన్యం, ఎడిటర్‌, ప్రింటర్‌, పబ్లిషర్‌కు లేఖ రాశారు. వీటిని సవాల్‌ చేస్తూ ఆ పత్రిక ఎడిటర్‌ రక్కసి ధనంజయరెడ్డి, చీఫ్‌ రిపోర్టర్‌ బి.ఫణికుమార్‌ వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై ఇటీవల విచారణ జరిపిన సింగిల్‌ జడ్జి అపరిపక్వదశలో కోర్టును ఆశ్రయించారని పేర్కొంటూ వ్యాజ్యాలను కొట్టివేశారు. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ వారిద్దరూ ధర్మాసనం ముందు అప్పీళ్లు వేశారు. గురువారం అప్పీళ్లు విచారణకు రాగా వీరి తరఫున సీనియర్‌ న్యాయవాది ఓ.మనోహర్‌రెడ్డి వాదనలు వినిపించారు. శాసనసభ వ్యవహారాల ముఖ్య కార్యదర్శి తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపిస్తూ... సహజ న్యాయసూత్రాలు పాటించాలనే ఉద్దేశంతోనే ఈనెల 21న హాజరుకావాలని ఎడిటర్‌, చీఫ్‌ రిపోర్టర్లను కోరామన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

రూపాయి మారకానికి లక్ష్యమేమీ పెట్టుకోలేదు

రెండో రోజూ కొనసాగిన ర్యాలీ

Updated Date - Nov 21 , 2025 | 07:23 AM