High Court Orders: నాడు ఇతర రాష్ట్రాలకు ఎంతకిచ్చారు
ABN , Publish Date - Aug 07 , 2025 | 05:20 AM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో యూనిట్ ధర రూ.2.49 చొప్పున 7 వేల మెగావాట్ల విద్యుత్ సరఫరా ఒప్పందం
ఏపీతో విద్యుత్ ఒప్పందంపై పూర్తి వివరాలు ఇవ్వండి
అఫిడవిట్ దాఖలు చేయండి
సెకీకి హైకోర్టు ఆదేశం.. విచారణ వాయిదా
అమరావతి, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో యూనిట్ ధర రూ.2.49 చొప్పున 7 వేల మెగావాట్ల విద్యుత్ సరఫరా ఒప్పందం చేసుకునేనాటికి.. ఇతర రాష్ట్రాలకు ఎంత ధరకు ఇస్తున్నారో చెప్పాలని సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సెకీ)ని హైకోర్టు ఽఆదేశించింది. పూర్తి వివరాలతో అఫిడవిట్ వేయాలని స్పష్టం చేసింది. యూనిట్ విద్యుత్ ధరను ఆమోదిస్తూ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) ఇచ్చిన ఉత్తర్వులను కూడా తమ ముందుంచాలని పేర్కొంది. తదుపరి విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. సెకీ నుంచి యూనిట్ రూ.2.49 చొప్పున 7 వేల మెగావాట్ల కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి(సీఈఆర్‌సీ) ధ్రువీకరించడాన్ని సవాల్ చేస్తూ అప్పటి టీడీపీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ హైకోర్టులో వేర్వేరుగా ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం బుధవారం మరోసారి విచారణకు రాగా పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. సెకీ నుంచి యూనిట్ రూ.2.49కి కొనుగోలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని.. అదే సెకీ గుజరాత్ ప్రభుత్వానికి యూనిట్ రూ1.99కే సరఫరా చేస్తోందని తెలిపారు. విద్యుత్ చట్టంలోని సెక్షన్లు 62, 63 ప్రకారం విద్యుత్ కొనుగోలు ధరను టెండర్ ప్రక్రియ ద్వారా ఖరారు చేయాల్సి ఉంటుందన్నారు. సెకీ ఆధ్వర్యంలో రాజస్థాన్‌లో ఏర్పాటు చేసిన సోలార్ ప్లాంట్ నుంచి రాష్ట్రం విద్యుత్ కొనుగోలు చేస్తోందని.. అంతదూరం నుంచి విద్యుత్ సరఫరాతో నష్టంతో పాటు వినియోగదారులపై ట్రాన్స్‌మిషన్ చార్జీల భారం పడుతోందని తెలిపారు. అదే ప్లాంటును రాష్ట్రంలో ఏర్పాటు చేసినట్లైతే ఇక్కడి నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లభించడమే గాక.. వినియోగదారులకు తక్కువ ఖర్చుతో విద్యుత్ సరఫరా చేసే అవకాశం ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. యూనిట్ ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారనే కారణంతో పిటిషన్లు వేశారని.. అంతిమంగా ధర ఆమోదించే విషయంలో ఏపీఈఆర్‌సీకి హైకోర్టు వెసులుబాటు ఇచ్చిందని.. సెకీ నిర్ణయించిన రూ.2.42 ధరను ఏపీఈఆర్‌సీ ఆమోదించిందని.. ఆ ఉత్తర్వులపై అభ్యంతరం ఉంటే పిటిషనర్లు సవాల్ చేసుకోవచ్చని తెలిపారు. సెకీ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం నాటికి ఇతర రాష్ట్రాలకు యూనిట్‌కు రూ.2.52 నుంచి 2.61 వరకు సరఫరా చేశామని తెలిపారు. పూర్తి వివరాలు కోర్టు ముందు ఉంచేందుకు సమయం కోరారు.