Share News

Flood Alert: బెజవాడ, గుంటూరు జలమయం

ABN , Publish Date - Aug 14 , 2025 | 04:12 AM

భారీ వర్షంతో గుంటూరు, విజయవాడ నగరాలు జలమయమయ్యాయి. ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా మంగళవారం..

Flood Alert: బెజవాడ, గుంటూరు జలమయం

  • కొండవీటి వాగులో కొట్టుకుపోయిన కారు

  • గుంటూరు వ్యవసాయ కమిషనరేట్‌, తాడేపల్లిలోని పలు కాలనీల్లో ఇళ్లలోకి నీరు

  • బాపట్ల, ఎన్టీఆర్‌, గుంటూరు జిల్లాల్లో 44 వేల హెక్టార్లలో పంటల మునక

గుంటూరు, బాపట్ల, విజయవాడ, మచిలీపట్నం, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి): భారీ వర్షంతో గుంటూరు, విజయవాడ నగరాలు జలమయమయ్యాయి. ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా మంగళవారం రాత్రి కుండపోత వర్షం కురిసింది. బుధవారం సాయంత్రం కూడా భారీ వర్షం కురిసింది. విజయవాడ నగరం జలదిగ్భందమైంది. ఎన్టీఆర్‌ జిల్లాలో వైరా, మున్నేరు, కట్టలేరు, పాలేరు ఉపనదులు ఉధృతంగా ప్రవహించాయి. విజయవాడలో కురిసిన వర్షం అంతా నగరంలోని స్ర్టామ్‌వాటర్‌ డ్రెయిన్స్‌, అవుట్‌ఫాల్‌ డ్రైయిన్‌ల ద్వారా ఈ ప్రధాన కాల్వలలోకి కలుస్తుంది. ప్రధాన కాల్వలలోకి విడుదల చేసిన వరద నీటిని తగ్గించకపోవడంతో విజయవాడలో కురిసిన వర్షం నీరు ఎక్కడికక్కడ నిలిచిపోయింది. విజయవాడ పాతబస్తీ, కృష్ణలంక, గాంధీనగర్‌, మొగల్రాజపురం, బెంజిసర్కిల్‌, పటమట తదితర ప్రాంతాలు నీటమునిగాయి. జాతీయ రహదారులు, ప్రధాన రహదారులపై నీరు నిలిచింది. డ్రెయిన్‌లు, రోడ్లు కనిపించకుండా పూర్తిగా మోకాళ్ల లోతు నీరు నిలిచిపోయింది. మ్యాన్‌హోల్స్‌, డ్రెయిన్‌లు ఎక్కడున్నాయో తెలియని పరిస్థితి నెలకొంది. గుంటూరు జిల్లా అంతటా వరదనీరు పోటెత్తింది. మేజర్‌ డ్రెయిన్లతో పాటు వాగులు పొంగి నివాస ప్రాంతాలు, పంట పొలాలను ముంచెత్తాయి. మంగళవారం రాత్రి 10 గంటల నుంచి బుధవారం వేకువజామున 4 గంటల వరకు ఎడతెరపి లేకుండా వర్షం కురవడంతో వాగులు ప్రమాదకర స్థాయికి చేరుకొన్నాయి. గుంటూరు నుంచి అమరావతి రాజధానిలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే అమరావతి రోడ్డులో లాం చప్టా వద్ద కొండవీటి వాగు ఉధృతంగా ప్రవహించడంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలు స్తంభించాయి. పెదపరిమి వద్ద కొట్టేళ్ల వాగు ఉధృతంగా ప్రవహించడంతో రాజధానికి రాకపోకలు నిలిచాయి. కాజ టోల్‌ప్లాజా వద్ద జాతీయ రహదారిపైకి భారీగా వరదనీరు చేరడంతో వాహనాల రాకపోకలకు ఆటంకం కలిగింది. గుంటూరు-తెనాలి, సత్తెనపల్లి-పిడుగురాళ్ల మధ్య రైల్వేట్రాక్‌ కింద వాగులు ప్రమాదకరంగా ప్రవహిస్తుండటంతో రైల్వే శాఖ కాషన్‌ ఆర్డర్‌ జారీ చేసింది. గంటకు 30 కిలోమీటర్ల వేగానికి మించి ఆయా సెక్షన్లలో రైళ్లను ప్రయాణించకుండా చర్యలు చేపట్టింది. గుంటూరు నగరంలోని చుట్టుగుంట వద్ద ఉన్న వ్యవసాయ, మార్కెటింగ్‌ కమిషనరేట్లలోకి వరదనీరు చేరడంతో ఉద్యోగులు చాలామంది విధులకు హాజరు కాలేకపోయారు. పెదకాకానిలోని నంబూరులో తాగునీటి చెరువు కట్ట తెగిపోవడంతో ఆ గ్రామానికి రాకపోకలు నిలిచిపోయా యి.


తాడేపల్లిలోని పుష్కర కాలనీ, ఎల్‌ఎల్‌ కాలనీల్లోకి వరదనీరు చేరడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. మేడికొండూరు మండలంలోని విశదల వద్ద కొండవాగు ఉధృతికి ఎన్‌ఆర్‌ఐ కళాశాల వద్ద పార్కింగ్‌ చేసి ఉన్న కారు కొట్టుకుపోయింది. పాలడుగు వద్ద వాగు కూడా రహదారిపై ప్రవహిస్తున్నది. గుంటూరు నగరంలో శంకర్‌విలాస్‌ ఆర్‌వోబీని కూల్చివేయడంతో ప్రత్యామ్నాయ మార్గాల్లో వరదనీరు నిలిచిన కారణంగా గంటల తరబడి రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచిపోయింది. బుధవారం రాత్రికి ప్రకాశం బ్యారేజీ నుంచి 5 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదిలే అవకాశం ఉన్న నేపథంలో కృష్ణా జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ గీతాంజలిశర్మ అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. నదీతీరప్రాంతంలోని మండలాల్లోని 62 గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. బుడమేరుకు 10 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారని బుడమేరు ప్రాంతాల్లోని గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. కృష్ణాజిల్లా ఉయ్యూరు మండలం ఐనంపూడిలో పిడుగు పడటంతో పశువులచావిడి దగ్ధమై రెండు పశువులు మృతి చెందాయి. ఉంగుటూరు మండలం నందమూరు వద్ద ఆటోపై తాడిచెట్టు విరిగిపడటంతో ఆటోడ్రైవర్‌కు గాయాలయ్యాయి. బాపట్ల జిల్లా చుండూరు మండలంలో 27 సెం.మీల వాన కురిసింది. దాదాపు 25,000 ఎకరాల్లో వరి పైరుకు నష్టం వాటిల్లినట్లు క్షేత్రస్థాయి పరిస్థితులు చెబుతున్నాయి. కొల్లూరు మండల పరిధిలోని లంక గ్రామాల్లోని ఇళ్లల్లోకి వరదనీరు చేరింది. వరద నీరు 7లక్షల క్యూసెక్కులకు చేరుకుంటే లంక గ్రామాల ప్రజలు ముంపుబారిన పడే ప్రమాదముందని అధికారులు అంచనా వేస్తున్నారు. పరిస్థితిని బట్టి ముంపు గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తామని యంత్రాంగం చెబుతోంది.

DFGH.jpg

44,657 హెక్టార్లలో పంటలు మునక

భారీ వర్షాల కారణంగా గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్‌ జిల్లాల్లో 44,657 హెక్టార్లలో పంటలు ముంపుబారిన పడినట్లు వ్యవసాయశాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. మూడు జిల్లాల్లోని 21 మండలాల్లో 161 గ్రామాల్లో 52,924 మంది రైతుల పొలాల్లో నీరు నిలిచినట్లు గుర్తించారు. దీంతో వరి 40,782, పత్తి 3,420, మినుము 332, వేరుశనగ 123 హెక్టార్లలో నీటి ముంపులో ఉన్నట్లు క్షేత్రస్థాయి అధికారులు తేల్చారు. ప్రస్తుతం ఈ పంటలు ఏపుగా పెరిగే దశలో ఉన్నట్లు వ్యవసాయశాఖ డైరెక్టర్‌ డిల్లీరావు తెలిపారు.

Updated Date - Aug 14 , 2025 | 04:12 AM