Share News

Andhra Heat Alert: రేపటి నుంచి ఎండ మంటలే

ABN , Publish Date - May 08 , 2025 | 04:59 AM

రాయలసీమ, కోస్తాల్లో వర్షాలు మరియు ఎండల మధ్య వాతావరణ అనిశ్చితి కొనసాగుతోంది. రేపటి నుంచి ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల సంస్థ హెచ్చరించింది

Andhra Heat Alert: రేపటి నుంచి ఎండ మంటలే

  • కొనసాగుతున్న వాతావరణ అనిశ్చితి

  • ఓవైపు వర్షాలు.. మరోవైపు ఎండ

అమరావతి, విశాఖపట్నం, మే 7(ఆంధ్రజ్యోతి): వాతావరణ అనిశ్చితితో రాయలసీమ, కోస్తాల్లో ఎండ తీవ్రత, వర్షాలు కొనసాగుతున్నాయి. కోస్తా, రాయలసీమల్లో బుధవారం పలుచోట్ల పిడుగులు, ఈదురుగాలులతో వర్షాలు, అక్కడక్కడా భారీవర్షాలు కురిశాయి. కోనసీమ జిల్లా రామచంద్రపురంలో 86.25మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. మిగిలిన ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం అంతకంటే ఒకటి నుంచి రెండు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. ఈ నెల తొమ్మిదో తేదీ నుంచి కోస్తా, రాయలసీమల్లో ఎండలు పెరుగుతాయని వాతావరణ నిపుణుడు ఒకరు తెలిపారు. కాగా, గురువారం 40-42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదుకానుండగా, శుక్రవారం నుంచి ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.


గురువారం పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడతాయని, ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. శుక్రవారం 15 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 28 మండలాల్లో మోస్తరు వడగాడ్పులు ఉంటాయని పేర్కొంది. బుధవారం కడప జిల్లా సింహాద్రిపురంలో 40.7, నంద్యాల జిల్లా గుల్లదుర్తి, కర్నూలు జిల్లా నేమకల్లులో 40.6, పల్నాడు జిల్లా కాకానిలో 40 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Updated Date - May 08 , 2025 | 04:59 AM