Share News

Andhra Pradesh weather: ఎండ వాన

ABN , Publish Date - Apr 19 , 2025 | 04:58 AM

రాష్ట్రంలో వాతావరణం తారుమారు అవుతోంది. ఉత్తరాంధ్రలో వర్షాలు, పెనుగాలులు; రాయలసీమలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి

Andhra Pradesh weather: ఎండ వాన

  • రాష్ట్రంలో విచిత్ర వాతావరణం.. అల్లూరి జిల్లాలో పెనుగాలుల బీభత్సం

  • కూలిన చెట్లు, విద్యుత్‌ స్తంభాలు.. అంధకారంలో ఏజెన్సీ గ్రామాలు

  • నేడు, రేపు ఈదురుగాలులతో వర్షం

అమరావతి, విశాఖపట్నం, పాడేరు, ఏప్రిల్‌ 18(ఆంధ్రజ్యోతి): వాతావరణ అనిశ్చితో రాష్ట్రంలో విచిత్ర వాతావరణం నెలకొంది. రాయలసీమ మరికొన్ని ప్రాంతాల్లో ఎండలు మండిపోతుంటే, ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో శని, ఆదివారాల్లో చాలా ప్రాంతాల్లో ఎండలు, వడగాడ్పులు ఉన్నా.. మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అల్లూరి, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో ఒకటీ రెండు చోట్ల భారీ వర్షాలు, అక్కడక్కడా మోస్తరు వర్షాలు, శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, రాయలసీమ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. వాతావరణ అనిశ్చితితో ఉత్తరాంధ్ర జిల్లాలతోపాటు రాయలసీమలో శుక్రవారం అక్కడక్కడా క్యుములోనింబస్‌ మేఘాలు ఏర్పడి వర్షాలు కురిశాయి. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో 36.2, అల్లూరి జిల్లా అరకులో 32.5, శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరులో 30.2, అన్నమయ్య జిల్లా నగరిమడుగులో 28 మిల్లీమీటర్ల వాన పడింది. 21 ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది.


అల్లూరి జిల్లాలోని పాడేరు డివిజన్‌ పరిధిలో పెనుగాలులు బీభత్సం సృష్టించాయి. చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. డి.గొందూరు సమీపంలో హైవేపై భారీ వృక్షం కూలిపోయింది. కొయ్యూరు మండలం పి.మాకవరం, నడింపాలెం మార్గంలో చెట్లు కూలిపోవడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అల్లూరి ఏజెన్సీలో అంధకారం నెలకొనడంతో విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణకు యంత్రాంగం రంగంలోకి దిగింది. మరోవైపు నంద్యాల జిల్లా దొర్నిపాడులో 41.7, కడప జిల్లా కొంగలవీడులో 41.6, అన్నమయ్య జిల్లా కంభాలకుంటలో 40.9, తిరుపతి జిల్లా యాతలూరులో 40.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శనివారం ఎన్టీఆర్‌ జిల్లా కంచికచర్ల, ఇబ్రహీంపట్నం, పల్నాడు జిల్లా అమరావతి, పెదకూరపాడు మండలాల్లో తీవ్రంగా, విజయనగరం, మన్యం, అల్లూరి, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లోని 73 మండలాల్లో మోస్తరు వడగాడ్పులకు అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

Updated Date - Apr 19 , 2025 | 04:58 AM