Health Department Transfers: భాగస్వాముల్లో ఒకరికి ఐదేళ్ల సర్వీస్ లేకున్నా బదిలీ లేదు..
ABN , Publish Date - Jun 05 , 2025 | 06:38 AM
అనంతరం బదిలీలపై రూపొందించిన మార్గదర్శకాల్లో చేసిన స్వల్ప మార్పులకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆమోదం తెలిపారు. బదిలీల్లో భాగంగా దంపతుల్లో ఎవరైనా ఒకరు ఒకేచోట ఐదేళ్లకన్నా తక్కువే పనిచేసి ఉంటే వారిద్దరినీ అదేచోట కొనసాగించాలని ఈ మార్గదర్శకాల్లో సూచించారు.
మార్గదర్శకాల్లో స్వల్ప మార్పులు.. మంత్రి సత్యకుమార్ ఆమోదం
అమరావతి, జూన్ 4 (ఆంధ్రజ్యోతి): బదిలీల ప్రక్రియపై ఆరోగ్యశాఖ దృష్టి పెట్టింది. దీనిపై ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు హెచ్‌వోడీలతో బుధవారం రెండు గంటలపాటు చర్చించారు. అనంతరం బదిలీలపై రూపొందించిన మార్గదర్శకాల్లో చేసిన స్వల్ప మార్పులకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆమోదం తెలిపారు. బదిలీల్లో భాగంగా దంపతుల్లో ఎవరైనా ఒకరు ఒకేచోట ఐదేళ్లకన్నా తక్కువే పనిచేసి ఉంటే వారిద్దరినీ అదేచోట కొనసాగించాలని ఈ మార్గదర్శకాల్లో సూచించారు. ఒకేచోట ఐదేళ్ల పదవీకాలం పూర్తిచేసిన వారికి బదిలీల్లో తొలి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఆ తర్వాత ఒకేచోట రెండు నుంచి ఐదేళ్లలోపు పనిచేసిన వారికి వాళ్లు ఇచ్చిన ఆప్షన్ ఆధారంగా కొత్త స్థానాలు కేటాయిస్తారు. కాంట్రాక్టు నియామకాలతో రెగ్యులర్ పోస్టుల్లో పనిచేస్తున్న వారు మాత్రం యథావిధిగా కొనసాగుతారు. ఆ రెగ్యులర్ స్థానాలను ఖాళీలుగా పరిగణించకూడదని ఆరోగ్యశాఖ నిర్ణయించింది. మరోవైపు వివిధ స్థాయిల్లో ప్రస్తుత సాధారణ బదిలీల నిమిత్తం ప్రకటించని ఖాళీల గురించి ఎంటీ కృష్ణబాబు వాకబు చేశారు. వైద్యకళాశాలల్లో జాతీయ వైద్య సంఘం నిబంధనలు మేరకు వైద్య అధ్యాపకులను కొనసాగించేందుకు కొన్ని ఖాళీలను చూపలేదని, పీపీపీ విధానంలో నిర్వహించాల్సిన వైద్య కళాశాలల్లో గతంలో నియమించిన వారిని రీడిప్లాయ్‌మెంట్ చేయాల్సిన అవసరాల దృష్ట్యా మరికొన్ని ఖాళీలను ప్రకటించలేదని హెచ్‌వోడీలు ఆయనకు తెలిపారు. కాగా, ప్రభుత్వ వైద్యుల సంఘం కూడా ఖాళీలన్నీ చూపించాలని, బదిలీల మార్గదర్శకాల్లో కొన్ని మార్పులు చేయాలని ప్రభుత్వానికి, డీఎంఈకి లేఖ రాసింది. ప్రభుత్వ వైద్యుల సంఘం నేత డాక్టర్ జయధీర్ బదిలీల్లో ఖాళీలు మొత్తం చూపించి, కౌన్సిలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
For AndhraPradesh News And Telugu News