Share News

Bobbili: హెడ్మాస్టర్‌ ‘స్వీయ శిక్ష’!

ABN , Publish Date - Mar 14 , 2025 | 04:21 AM

విద్యార్థుల ముందు గుంజిళ్లు తీశారు. తల్లిదండ్రులకు సాష్టాంగ నమస్కారం చేశారు. ‘మేం బడిలో చదివిస్తాం. మీరూ మీ పిల్లలపై శ్రద్ధ చూపండి’ అని విన్నవించుకున్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పెంట గ్రామంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో జరిగిన సంఘటన ఇది.

Bobbili: హెడ్మాస్టర్‌ ‘స్వీయ శిక్ష’!

పిల్లలు సరిగా చదవడంలేదని ఆవేదన

  • గుంజీలు తీసి, సాష్టాంగ నమస్కారం

  • పశ్చాత్తాపం కలగాలని ప్రయత్నం

  • పిల్లల చదువులపై శ్రద్ధచూపాలని తల్లిదండ్రులకూ సందేశం

బొబ్బిలి/ రూరల్‌, మార్చి 13(ఆంధ్రజ్యోతి): ఆ స్కూల్లో విద్యార్థులు సక్రమంగా చదవడంలేదు! రోజురోజుకూ విద్యాప్రమాణాలు కొరవడుతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే వారి భవిష్యత్తు ఏమైపోతుందోనని ఆ పాఠశాల హెచ్‌ఎం ‘చింత’న! పోనీ ఒక దెబ్బ వేసి బుద్ధి చెబుతామంటే అస్సలు కుదరదు! అందుకే... ఆ ప్రధానోపాధ్యాయుడు తనను తాను శిక్షించుకున్నారు. విద్యార్థుల ముందు గుంజిళ్లు తీశారు. తల్లిదండ్రులకు సాష్టాంగ నమస్కారం చేశారు. ‘మేం బడిలో చదివిస్తాం. మీరూ మీ పిల్లలపై శ్రద్ధ చూపండి’ అని విన్నవించుకున్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పెంట గ్రామంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో జరిగిన సంఘటన ఇది. మంగళవారం తరగతుల ప్రారంభానికి ముందు, ప్రార్థనా సమయంలో ప్రధానోపాధ్యాయుడు చింతా రమణ విద్యార్థుల పరిస్థితిపై తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ‘మీలో మార్పురావాలన్న సదాశయంతో నాకుగా నేనే శిక్ష విధించుకుంటాను. ఇప్పటికైనా మారండి’ అంటూ గుంజీలు తీశారు. దీంతో ఒక్కసారిగా విద్యార్థులు ఖిన్నులయ్యారు. ‘వద్దు సార్‌.. వద్దు సార్‌’ అని పిల్లలు వారించినా ఆయన ఆగలేదు. ఆ తర్వాత విద్యార్థుల తల్లిదండ్రులకూ ఒక సందేశాన్ని వినిపించారు. ‘డియర్‌ పేరెంట్స్‌.. మీ పిల్లలను విద్య కోసం కొట్టలేం, తిట్టలేం. మీరు వారిని కంట్రోల్‌లో ఉంచడం లేదు. ఫలితంగా వారికి చదువు లేదు, క్రమశిక్షణ లేదు. రైటింగ్‌, రీడింగ్‌ స్కిల్స్‌ కూడా కరువయ్యాయి. నాతో పాటు మా ఉపాఽధ్యాయ బృందమంతా ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం పొద్దుపోయేదాకా ఎంతో కష్టపడుతున్నాం. అయినా ఎలాంటి పురోగతీ లేదు. ప్రభుత్వ పరంగా విద్యాభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు అమలవుతున్నాయి. విద్యార్థుల్లో క్రమశిక్షణ కొరవడి, విద్యాబుద్ధులు పెరగపోవడంతో మేమంతాచేతకాని వారిలా నిలబడాల్సి వస్తోంది. మీ పిల్లలందరినీ చదువు కోసమే పంపించాలనుకుంటే స్కూలుకు పంపించండి. లేకుంటే ఇంకెందుకు స్కూలుకు పంపడం దండగ’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.


మంత్రి లోకేశ్‌ ఆరా.. హెచ్‌ఎంకు ప్రశంసలు

ఈ నెల 11న జరిగిన ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరలై విద్యాశాఖ మంత్రి లోకేశ్‌ దృష్టికి వెళ్లింది. ఆయన హెచ్‌ఎంను ప్రశంసిస్తూ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ‘హెచ్‌ఎం గారూ.. పిల్లలను దండించకుండా అర్థం చేసుకునేలా మీ స్వీయక్రమశిక్షణచర్య ఆలోచన బాగుంది. అభినందనలు. అందరం కలిసి విద్యాప్రమాణాలు పెంచుదాం. పిల్లల బంగారు భవిష్యత్‌కు బాటలువేద్దాం’ అని పేర్కొన్నారు. హెచ్‌ఎం రమణను ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే ఆర్‌వీఎ్‌సకెకె రంగరావు (బేబీనాయన) అభినందించారు.

Updated Date - Mar 14 , 2025 | 04:21 AM