Share News

AP High Court : పిటిషన్‌ విస్తృత ధర్మాసనానికి వద్దు

ABN , Publish Date - Feb 08 , 2025 | 03:48 AM

దాడి కేసులో వైసీపీ నేత వల్లభనేని వంశీ ముం దస్తు బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు ముగిశాయి.

AP High Court : పిటిషన్‌ విస్తృత ధర్మాసనానికి వద్దు

  • హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యానికి సుప్రీం నిరాకరించింది

  • గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో

  • సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ్‌ లూథ్రా వినతి

  • వంశీ ముందస్తు బెయిల్‌పై వాదనలు పూర్తి

అమరావతి, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): కృష్ణాజిల్లా గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో వైసీపీ నేత వల్లభనేని వంశీ ముం దస్తు బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. దీంతో ఈ నెల 20న నిర్ణయం వెల్లడిస్తామని న్యాయమూర్తి జస్టిస్‌ వీఆర్‌కే కృపాసాగర్‌ శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చారు. వైసీపీ హయాంలో టీడీపీ కార్యాలయంపై మూకదాడి జరిగింది. దీనిపై ఆ పార్టీ నేతల ఫిర్యాదు మేరకు 2023లో గన్నవరం పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి ఎమ్మెల్యే వంశీ పాత్ర కూడా ఉందని గుర్తించి ఆయనను కూడా నిందితుడిగా చేర్చారు. ఈ నేపథ్యంలో తనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ వైసీపీనేత వల్లభనేని వంశీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యం శుక్రవారం విచారణకు రాగా ప్రాసిక్యూషన్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ్‌ లూథ్రా వాదన లు వినిపించారు. ‘‘ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద కేసులు నమోదైన నేపథ్యంలో చట్ట నిబంధనల ప్రకారం దిగువకోర్టులోనే బెయిల్‌ పిటిషన్లు దాఖలు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని నిర్ధారిస్తూ ఇదే కేసులో పలువురు నిందితులు దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్లను ఇదే కోర్టు గతంలో కొట్టివేసింది. ఆ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ నిందితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.


అయితే, హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. పిటిషనర్‌కు కూడా అవే ఉత్తర్వులు వర్తిస్తాయి. కేసును విస్తృత ధర్మాసనానికి పంపాలన్న పిటిషనర్‌ వాదన చెల్లుబాటు కాదు’’ అని పేర్కొన్నారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది సత్యశ్రీ వాదనలు వినిపిస్తూ.. అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదైనప్పుడు ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు వద్ద ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ వేసుకోవాలని ఓ బెంచ్‌, చట్టం వర్తింపునకు సంబంధించి ప్రాధమిక ఆధారాలు లేనప్పుడు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టు నేరుగా విచారించవచ్చని మరో బెంచ్‌ భిన్న ఉత్తర్వులు ఇచ్చిందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ కేసును విస్తృత ధర్మాసనానికి పంపాలని అనుబంధ పిటిషన్‌ వేశామన్నారు.

Updated Date - Feb 08 , 2025 | 03:48 AM