NCC: ఎన్‌సీసీ క్యాడెట్లకు అడ్మిషన్లలో గ్రేస్ మార్కులు
ABN , Publish Date - Jul 17 , 2025 | 04:38 AM
ఎన్‌సీసీ క్యాడెట్లకు పలు కోర్సుల్లో ప్రవేశాలకు 15శాతం వరకు గ్రేస్ మార్కులు ఇస్తూ ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది.
15 శాతం వరకు అమలు
వైద్య, సాంకేతిక, ఇతర కోర్సులకు వర్తింపు
అమరావతి, జూలై 16(ఆంధ్రజ్యోతి): ఎన్‌సీసీ క్యాడెట్లకు పలు కోర్సుల్లో ప్రవేశాలకు 15శాతం వరకు గ్రేస్ మార్కులు ఇస్తూ ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది. వివిధ కోర్సుల్లో ఎన్‌సీసీ విభాగానికి 1శాతం సీట్లు ఉంటాయి. వాటిని పొందేందుకు ఆ క్యాడెట్లకు గరిష్ఠంగా 15శాతం గ్రేస్ మార్కులు ఇస్తారు. అర్హత పరీక్షలో అర్హత సాధించిన లేదా కటాఫ్ మార్కులు సాధించిన వారికి ఇది వర్తిస్తుంది. ఉన్నత విద్య, సాంకేతిక విద్య, వ్యవసాయ, పశు సంవర్థక, డైయిరీ విభాగాలకు సంబంధించిన డిప్లమో, అండర్ గ్రాడ్యుయేట్, పీజీ కోర్సుల్లో ఈ గ్రేస్ మార్కుల విధానం అమలుకు ప్రభుత్వం జీవో 43ని జారీచేసింది. ఎ సర్టిఫికెట్‌కు 1శాతం, ఎ, బి సర్టిఫికెట్లకు 3శాతం, ఎ, బి, సి సర్టిఫికెట్లు ఉన్నవారికి 10శాతం గ్రేస్ మార్కులు ఇస్తారు. ఎ, బి సర్టిఫికెట్లు కలిగి ఉండి టీఎస్‌సీ, వీఎస్‌సీ, ఎన్‌ఎస్‌సీ ఈవెంట్లలో పాల్గొన్నవారికి 8శాతం గ్రేస్ మార్కులు లభిస్తాయి. ఎ, బి సర్టిఫికెట్లు కలిగి ఉండి టీఎస్‌సీ, వీఎస్‌సీ, ఎన్‌ఎస్‌సీ, ఆర్‌డీసీల్లో పాల్గొన్నవారికి 15శాతం మార్కులు వస్తాయి. మూడు సర్టిఫికెట్లు ఉండి టీఎస్‌సీ, వీఎస్‌సీ, ఎన్‌ఎ్‌ససీ, ఆర్‌డీసీల్లో పాల్గొన్నవారికి కూడా 15శాతం మార్కులే ఇస్తారు. ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ కోర్సుల్లో ప్రవేశాలకు ఎన్‌సీసీ కోటా గ్రేస్ మార్కుల అమలుపై ఉన్నత విద్యాశాఖ జీవో 44 విడుదల చేసింది.