Share News

AP Govt launches special cab app: ఉబర్, ఓలాలకు దీటుగా సర్కారీ క్యాబ్‌ యాప్..

ABN , Publish Date - Oct 05 , 2025 | 04:40 AM

రాష్ట్రంలో ఆటోడ్రైవర్లకు బిజినెస్‌ ఇచ్చి, వారిని ఆదుకునే బాధ్యత తీసుకుంటానని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు...

AP Govt launches special cab app:  ఉబర్, ఓలాలకు దీటుగా సర్కారీ క్యాబ్‌ యాప్..

  • ఉబర్‌, ఓలాలకు దీటుగా తెస్తాం.. ఆటో డ్రైవర్లకు బిజినెస్‌ ఇస్తాం

  • ఇక ఆటోస్టాండ్ల వద్ద పడిగాపులు పడక్కర్లేదు

  • సంక్షేమం కోసం వారే సభ్యులుగా ప్రత్యేక బోర్డు

  • ప్రభుత్వ పథకాలకు ప్రచారకర్తలుగా మారండి

  • పర్యాటకపరంగానూ సహకరించండి

  • ఆటో ఎక్కినవారికి ప్రభుత్వ మంచిని తెలపండి

  • గత ప్రభుత్వంలో ఎన్నో కష్టాలు పడ్డారు..

  • దుష్టులను రానీయొద్దు.. వైకుంఠపాళీ ఆడొద్దు

  • కొత్తవారు వస్తే ఏదో ఇస్తారని చూడొద్దు

  • ఆటోడ్రైవర్ల సేవలో.. పథకం ప్రారంభించిన సీఎం

  • 2,90,669 మంది ఆటోవాలాలకు రూ.436 కోట్ల ఆర్థిక సహాయం జమ

విజయవాడ, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఆటోడ్రైవర్లకు బిజినెస్‌ ఇచ్చి, వారిని ఆదుకునే బాధ్యత తీసుకుంటానని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ‘‘ఉబర్‌, ఓలా, ర్యాపిడో వంటి ఆన్‌లైన్‌ యాప్స్‌ను తీసివేయలేం. కానీ ఆటోవాలాలు, క్యాబ్‌వాలాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా ‘సర్కారీ క్యాబ్‌’ బుకింగ్‌ యాప్‌ను రూపొందిస్తాం. ఈ యాప్‌ ఆర్థికంగా ఊరట కలిగిస్తుంది. ఆటోస్టాండ్ల వద్ద రోజంతా పడిగాపులు పడాల్సిన అవసరం ఇకపై ఉండదు. ఈ యాప్‌ నిర్వహణ కోసం కంట్రోల్‌రూమ్‌ ఏర్పాటుచేస్తాం. అందు లో ఆటో, క్యాబ్‌ డ్రైవర్లే సభ్యులుగా ఉంటారు’’ అని సీఎం తెలిపారు. ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం వారినే సభ్యులుగా చేసి త్వరలో ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. శనివారం విజయవాడలోని సింగ్‌నగర్‌ మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ‘ఆటో డ్రైవర్ల సేవలో...’ పథకాన్ని ఆయన ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 2,90,669 మంది లబ్ధిదారులకు రూ.436కోట్ల చెక్‌ను ఈ పథకం కింద అందించారు. సమావేశంలో చంద్రబాబు ప్రసంగించే సమయానికి ఒక్కొక్కరి బ్యాంకు ఖాతాలో రూ.15వేలు జమ అయినట్టు మెసేజ్‌లు వచ్చాయి. ‘డబ్బులు పడ్డాయా...’ అని అడిగినపుడు ఈ మెసేజ్‌లను ఆటోడ్రైవర్లు సంతోషంగా చంద్రబాబుకు చూపించారు. గత ప్రభుత్వంలో మాదిరిగా ఆటో డ్రైవర్లకు వేధింపులు ఉండవని, జరిమానాలు రద్దుచేసే అంశాన్ని కూడా పరిశీలిస్తానని సీఎం తెలిపారు. అలాగని రోడ్ల మీద ట్రాఫిక్‌ నియమాలను ఉల్లంఘించవద్దని,ఎక్కడిపడితే అక్కడ సీసీ కెమెరాలు ఉంటాయని, అనవసరంగా ఇబ్బందులు తెచ్చుకోవద్దని హితవు పలికారు. విజయవాడలో పూర్తిగా సీఎన్‌జీ ఆటోలు నడుస్తున్నాయని, ఇది చాలా మంచి విషయమని, ఇక ఈవీలను ఎక్కువగా ప్రోత్సహిస్తామని సీఎం తెలిపారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..


cm.jpg

ఈసారి కూటమి సీట్లు పెరగాలా? వద్దా?

‘‘గత ఎన్నికలలో మాకు 94 శాతం స్ర్టైక్‌ రేట్‌తో పట్టం కట్టారు. రాబోయే రోజుల్లో ఈ సీట్లు పెరగాలా ? వద్దా ?పదహారు నెలల ముందు రాష్ట్రం పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. వ్యవస్థలన్నీ నిర్వీర్యమై, అభివృద్ధి పూర్తిగా ఆగిపోయింది. నాల్గవసారి ముఖ్యమంత్రిని అయినా.. నాకే చాలా రోజులు పరిస్థితులు అర్థం కాలేదు. ఏం చేయాలని రాత్రుళ్లు ఆలోచించేవాడిని. నిద్ర కూడా పట్టేది కాదు. నా మీద ఉంచిన విశ్వాసం కారణంగా ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయకూడదన్న ఉద్దేశంతో పని ప్రారంభించాను. కూటమి పాలన మొదలై 15 నెలలు గడిచింది. చరిత్రలోనే ఇన్ని సంక్షేమ కార్యక్రమాలను అందించటం ఎప్పుడైనా చూశారా? సూపర్‌సిక్స్‌ హామీలను చేసి చూపిస్తున్నాం. దేశంలోనే ఎక్కడా జరగని సంక్షేమం ఏపీలో జరుగుతోంది. పెన్షన్లను రూ. 4 వేలు, రూ 6 వేలు, రూ 10 వేలు, రూ 15 వేలకు పెంచాం. తల్లికి వందనం కింద ఒక కుటుంబంలో ఎంతమంది ఉంటే అంత మందికీ సహాయం అందిస్తున్నాం. ఆడబిడ్డల కోసం మూడు ఉచిత సిలిండర్లను ప్రభుత్వం అందిస్తోంది. అన్ని వర్గాల సంక్షేమాన్ని చూస్తున్నాం. పేదవాడి ఆకలి తీర్చటానికి అన్న క్యాంటీన్లను నిర్వహిస్తున్నాం. రాష్ట్రంలో ప్రజలందరి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని యూనివర్సల్‌ హెల్త్‌ పాలసీని తీసుకువస్తున్నాం. ఈ పథకంలో భాగంగా రూ. 25 లక్షలు ఖర్చుపెట్టి మీ ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. ఽజీఎస్టీ తగ్గింపుల కారణంగా ధరలు అదుపులోకి వస్తున్నాయి. ఎలక్ర్టానిక్స్‌, ఆటో మొబైల్స్‌, నిత్యాసవర వస్తువుల ధరలు తగ్గుతున్నాయి. మహిళల కోసం స్ర్తీశక్తి పథకాన్ని ప్రారంభించాం. దీనికింద పెట్టిన ఉచిత బస్సులు ఎక్కి శ్రీకాకుళం, విజయనగరం వంటి ప్రాంతాల నుంచీ దసరా ఉత్సవాల కోసం మహిళలు భారీ సంఖ్యలో విజయవాడకు తరలివచ్చారు.’’

వైకుంఠపాళీ ఆడొద్దు

‘‘ప్రజాకంఠకుడు మహిషాసురుడిని కనకదుర్గమ్మ సంహరించిన రోజును దసరాగా జరుపుకొంటాం. మరో ప్రజా కంఠకుడు నరకాసురుడిని సత్యభామతో కలిసి శ్రీ కృష్ణుడు సంహరించిన రోజున దీపావళి చేసుకుంటాం. రాష్ట్రంలో గత ఐదేళ్లలో ప్రజా కంఠక పాలన ఏవిధంగా జరిగిందో మీరంతా చూశారు. నాసిరకం మద్యం ఇచ్చి ఎన్నో కుటుంబాల ఉసురుతీసుకున్నారు. పేదవాళ్లకు ఇవ్వాల్సిన ఇసుక ను బొక్కేశారు. పేదల ఇంటి జాగాలను లాగేశారు. ఇలాంటి దుర్మార్గులు రాజకీయాలకు పనికిరారు. ప్రజలు కూడా వైకుంఠపాళీ ఆడొద్దు. అన్నీ ఇస్తున్నా ఇంకొకరు ఏదో ఇస్తారని చూడవద్దు. ఏమీ ఇవ్వరు. గుజరాత్‌లో మూడు దఫాలుగా బీజేపీ ప్రభుత్వం ఉంది. అందువల్ల అక్కడ అభివృద్ధి సాధ్యమైంది. ఏపీలో కష్టకాలంలో నేను, పవన్‌ కల్యాణ్‌, బీజేపీ...ఎన్‌డీఏగా కలిశాం. మీ కష్టాలు తీరుస్తామని ఆనాడు ఇచ్చిన మాటను మేం నిలుపుకొన్నాం.’’ అని చంద్రబాబు తెలిపారు.


స్ఫూర్తిని నింపిన ఆటోడ్రైవర్‌

‘‘ఆటోలో ఎక్కించుకుని నన్ను సభావేదిక దగ్గరకు తెచ్చిన అఫ్సర్‌ఖాన్‌ తండ్రి డ్రైవర్‌. అందువల్ల అఫ్సర్‌ఖాన్‌ కూడా ఆటో వృత్తినే నమ్ముకుని జీవిస్తున్నారు. కానీ, తన కుమారులు మాత్రం తనలా కాకూడదని ఆయన గట్టి నిర్ణయం తీసుకున్నారు. అందులోభాగంగా పెద్దబ్బాయిని ఎలక్ర్టికల్‌ ఇంజనీరింగ్‌ చదివిస్తున్నారు. చిన్నబ్బాయి ఇంటర్మీడియట్‌ చదువుతున్నాడు. ఆ అబ్బాయి పదో తరగతిలో రాష్ట్రంలో నాల్గో ర్యాంక్‌ సాధించాడు. అందరూ అఫ్సర్‌ఖాన్‌ కుటుంబం నుంచి స్ఫూర్తిని పొందాలి.’’

ఇది మీ నాన్న ఇచ్చిన ఆటో

  • ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్తున్నా.. లోకేశ్‌కు మహిళా డ్రైవర్‌

‘ఆటో నడపడం వల్ల ఏ ఇబ్బందులు ఉన్నాయమ్మా’ అంటూ మహిళా ఆటో డ్రైవర్‌ స్వర్ణలతను మంత్రి లోకేశ్‌ అడిగారు. పెద్దగా ఇబ్బందులు లేవన్నా... అని ఆమె బదులిచ్చారు. ‘2014-15 మఽఽధ్య ఆటో నడపడం నేర్చుకున్నాను. నాకు అప్పట్లో ఆటో తాళం చంద్రబాబు ఇచ్చారు. ఇప్పడు మీరు నా ఆటో ఎక్కారు. నాకు చాలా సంతోషంగా ఉంది’ అని ఆమె తెలిపారు. కూటమి నేతలకు మద్దతుగా తరలివచ్చిన వేలాది మంది నాయకులు ప్రజలతో ప్రకాశం బ్యారేజీ పరిసరాలు కిక్కిరిశాయి. బాణాసంచా కాలుస్తూ తీన్మార్‌ డప్పులతో నేతలకు వారంతా ఘనస్వాగతం పలికారు.

5.jpg2.jpg4.jpg3.jpg

Updated Date - Oct 05 , 2025 | 06:26 AM