Employment Scheme: ఉపాధి తో వ్యవసాయం
ABN , Publish Date - May 23 , 2025 | 05:34 AM
పశుసంపద పెంపుకు ఉపాధి పథకాన్ని అనుసంధానం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ‘హరిత గోపాలం’ పథకం ద్వారా రైతులు పశుగ్రాసం సాగించి ఉపాధి వేతనం పొందగలుగుతారు, తద్వారా వారి ఆదాయం సుస్థిరమవుతుంది.
పాడి పరిశ్రమాభివృద్ధికి ప్రణాళిక
అమరావతి, మే 22(ఆంధ్రజ్యోతి): వ్యవసాయానికి ఉపాధి పథకాన్ని అనుసంధానం చేయాలన్న డిమాండ్‌ను నెరవేర్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ఉపాధి నిధులతో పశుసంపదను పెంచి, గణనీయంగా పాల దిగుబడి సాధించేందుకు కేంద్ర పథకాన్ని వినియోగించుకోనున్నారు. ఇప్పటికే ఉపాధి హామీ పథకంలో పలు వ్యవసాయ, వ్యవసాయేతర పనులు చేస్తున్నారు. దీన్ని మరింత ముందుకు తీసుకువెళుతూ.. పాడిరైతులకు చేయూతనందిస్తే వారు సుస్థిర ఆదాయం సాధించే అవకాశం ఉంటుందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు నిర్ణయించారు. ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ ఆదేశాలతో పశుగ్రాసం అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు రూపొందించారు. ఇప్పటికే ఉపాధి ద్వారా మినీ గోకులాలు నిర్మించిన ప్రభుత్వం, గ్రామాల్లో నీటి తొట్టెలు నిర్మించి పశువులకు తాగునీటి ఇక్కట్లు తీర్చింది. ఇప్పుడు పశుగ్రాసం అభివృద్ధికి ‘హరిత గోపాలం’ పథకాన్ని తీసుకువస్తున్నారు. పశుసంవర్థక, గ్రామీణాభివృద్ధి శాఖలు సంయుక్తంగా ఈ పథకాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. దీని ద్వారా ఒక్కో రైతు ఎకరాకు రూ.40వేల నుంచి రూ.50 వేల దాకా లబ్ధి పొందే అవకాశముంది. ఈ పథకం ద్వారా రైతులు తమ పొలాల్లో పశుగ్రాసం పెంచుకుని, ఉపాధి పథకంలో వేతనం తీసుకోవచ్చు. రెండు పాడి పశువులు కలిగిన రైతులకు 25 సెంట్లు, 3-5 పశువులకు 50 సెంట్లు, 5కంటే ఎక్కువ పశువులు ఉన్న రైతులు ఒక ఎకరాలో పశుగ్రాసం ఉత్పత్తి చేసుకోవచ్చు. స్వయం సహాయక బృందాలు, ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్(ఎ్‌ఫపీఓ)లకు యూనిట్‌కు (10 ఎకరాల వరకు) శాశ్వత పశుగ్రాస పంటలు వేసేందుకు అవకాశం కల్పిస్తారు. ఆయా కుటుంబాలు సొంత పొలంలోనే పని చేసుకుని ఉపాధి వేతనం పొందవచ్చు. హరిత గోపాలం ద్వారా రెడ్ నేపియర్, సీఓ-4, సీఓ-3, సీఓ-5, డీహెచ్‌ఎన్-6 సూపర్ హైబ్రిడ్ నేపియర్ గ్రాస్, సూపర్ నేపియర్ గ్రాస్(పాక్‌చాంగ్ గ్రాస్), ఎన్‌బీ 21 రకాలు పెంచుకునేందుకు ఉపాధి నిధులు అందిస్తారు. 2025-26లో లక్ష ఎకరాల్లో పశుగ్రాసం అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
భారత రాయబార కార్యాలయ సిబ్బందిని బహిష్కరించిన పాక్
For National News And Telugu News