Share News

Road Reconstruction: రోడ్లకు మహర్దశ!

ABN , Publish Date - Mar 13 , 2025 | 03:20 AM

జగన్‌ జమానాలో పూర్తిగా చిన్నాభిన్నమైపోయిన రహదారులను పునర్నిర్మించాలని కూటమి సర్కారు నిర్ణయించింది. గ్రామీణ, జిల్లా, రాష్ట్ర ప్రధాన(ఎ్‌సహెచ్‌) రహదారులను తిరిగి 2014 నాటి స్థితికి తీసుకొచ్చేందుకు ఆర్‌అండ్‌ బీకి భారీగా నిధులు ఆఫర్‌చేసింది.

Road Reconstruction: రోడ్లకు మహర్దశ!

  • మరో 2వేల కి.మీ. పునర్నిర్మాణానికి ఓకే

  • రూ.1860 కోట్ల నిధులతో పనులు

  • నియోజకవర్గాల వారీగా ప్రతిపాదనలు

  • తక్షణమే చేపడతామన్న మంత్రి జనార్దన్‌రెడ్డి

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

జగన్‌ జమానాలో పూర్తిగా చిన్నాభిన్నమైపోయిన రహదారులను పునర్నిర్మించాలని కూటమి సర్కారు నిర్ణయించింది. గ్రామీణ, జిల్లా, రాష్ట్ర ప్రధాన(ఎ్‌సహెచ్‌) రహదారులను తిరిగి 2014 నాటి స్థితికి తీసుకొచ్చేందుకు ఆర్‌అండ్‌ బీకి భారీగా నిధులు ఆఫర్‌చేసింది. అదనంగా మరో రూ.1,860 కోట్ల నిధులు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసింది. దీంతో వివిధ పద్దుల కింద రహదారుల నిర్మాణానికి నిధులు ఇవ్వాలని కోరుతూ ఆర్థికశాఖకు ఇప్పటికే ఆర్‌అండ్‌బీశాఖ ప్రతిపాదనలు పంపించింది. మరోవైపు ఎమ్మెల్యేలు, ఇతరప్రజాప్రతినిధుల కోరిక మేరకు రూ.600 కోట్లతో నియోజకవర్గాల వారీగా రహదారుల నిర్మాణానికి ఆర్‌అండ్‌బీ కార్యాచరణ సిద్ధం చేసింది. ఆ ప్రతిపాదనలు కూడా అందినట్లు రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్‌రెడ్డి తెలిపారు. ప్రసుత్తం రాష్ట్రంలో 17వేల కి..మీ. పరిధిలోని అన్ని రకాల రహదారుల్లో గుంతలు పూడ్చేకార్యక్రమం నడుస్తోంది. ఈ నెలాఖరు నాటికి ఆ పనులు పూర్తికానున్నాయి. గుంతలు పూడ్చినా ఏమాత్రం బాగుపడని రోడ్లు, అంటే పూర్తిస్థాయిలో చిన్నాభిన్నమై, నిర్వహణకు నోచుకోని వాటిని పునర్నిర్మించాలని ఆర్‌అండ్‌బీశాఖ ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద జరిగిన సమావేశంలో ప్రస్తావించింది.


అందుకు కనీసం వెయ్యికోట్లపైనే ఖర్చుకానుందని తెలిపింది. దీనికి ఆర్థికశాఖతో చర్చించిన తర్వాత నిధులు ఇచ్చేందుకు సీఎం అంగీకారం తె లిపినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో 2వేల కి.మీ. పరిధిలోని 300 రోడ్లను పునర్నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు మంత్రి బీసీ జనార్ధన్‌రెడ్డి ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. రూ.400 కోట్లను నాబార్డు కింద జిల్లా ప్రధాన రహదారుల (ఎండీఆర్‌) నిర్మాణం కోసం కేటాయించేందుకు ప్రభుత్వం అంగీకరించిందన్నారు. గ్రామీణ, జిల్లా రహదారులపై ఇటీవల జిల్లాల వారీగా ఎమ్మెల్యేలతో మంత్రి మాట్లాడారు. ఏ ఏ రహదారులను తక్షణమే అభివృద్ధి చేయాలి? వేటిని పునర్నిర్మించాలనేది ప్రతిపాదనలు తీసుకున్నారు. తొలుత 230 రోడ్లను పునర్నిర్మించాలని నిర్ణయించారు. ప్లాన్‌ కింద 600 కోట్ల నిధులు ఇస్తామని ఆర్‌అండ్‌బీకి ఆర్థికశాఖ సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. దీంతో ఎమ్మెల్యేలు ప్రతిపాదించిన నియోజకవర్గ రహదారులను ఈ నిధులతో చేపట్టేలా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. గతంలో ఎన్‌డీబీ కింద చేపట్టి మధ్యలో వదిలేసిన రహదారులు, సీఆర్‌ఎ్‌ఫలో వదిలేసినవి, ఇంకా, మధ్యలో పనిఆపేసిన పనులను కూడా ఈ జాబితాలోకి తీసుకురావాలని మంత్రి జనార్ధన్‌రెడ్డి ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు.

Updated Date - Mar 13 , 2025 | 03:20 AM