Train Robbery: గుత్తి వద్ద రైలు దోపిడీ
ABN , Publish Date - Apr 30 , 2025 | 05:55 AM
గుత్తి వద్ద నిలిపిన రాయలసీమ ఎక్స్‌ప్రె్‌సలో అర్ధరాత్రి దొంగలు ఆరుగురు ప్రయాణికుల నుంచి బంగారు నగలు దోచుకున్నారు. స్లీపర్ బోగీల్లో ప్రయాణిస్తున్న మహిళల వద్ద నుంచి 231 గ్రాముల బంగారు ఆభరణాలు, నగదు అపహరించారు
ఆరుగురి నుంచి నగలు లాక్కెళ్లిన దుండగులు
అర్ధరాత్రి వేళ.. రాయలసీమ ఎక్స్‌ప్రె్‌సలో ఘటన
గుత్తి/రూరల్, తిరుపతి(నేరవిభాగం), ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి): అనంతపురం జిల్లా గుత్తి రైల్వేస్టేషన్ ఔటర్‌లో నిలిచి ఉన్న నిజామాబాద్- తిరుపతి (రాయలసీమ) ఎక్స్‌ప్రెస్ (నంబర్ 12794)లో సోమవారం అర్ధరాత్రి దొంగలు దోపిడీకి పాల్పడ్డారు. ఎస్-2, ఎస్-3, ఎస్-5 బోగీల్లో భయోత్పాతాన్ని సృష్టించారు. తిరుపతి రైల్వే సీఐ ఆశీర్వాదం తెలిపిన ప్రకారం.. సోమవారం అర్ధరాత్రి దాటాక 1.30 గంటల ప్రాంతంలో అమరావతి ఎక్స్‌ప్రె్‌సకు లైన్ క్లియర్ చేయడం కోసం రాయలసీమ ఎక్స్‌ప్రె్‌సను గుత్తి శివారులో నిలిపారు. సరిగ్గా ఆ సమయంలో దుండగులు స్లీపర్ కోచ్‌లో కిటికీల పక్కన నిద్రిస్తున్న మహిళా ప్రయాణికుల మెడల్లో నుంచి బంగారు నగలు లాగేశారు. ఇలా ఆరుగురి నుంచి 231 గ్రాముల బంగారు నగలు, కొంత నగదు, ఇతర విలువైన వస్తువులు అపహరించుకుని వెళ్లారు. బాధితులు గమ్యస్థానం చేరిన తర్వాత తిరుపతిలో ఉదయం జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడ జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి కేసును గుత్తికి బదలాయించారు.