Share News

Godavari youth: దుబాయిలో రోడ్డున పడ్డ గోదావరి యువకులు

ABN , Publish Date - Jun 25 , 2025 | 02:41 AM

50 సెల్సియస్‌ డిగ్రీలు దాటున్న తీవ్ర ఎండలో తినడానికి తిండి లేకుండా, ఉండేందుకు నీడ లేకుండా ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన 18 మంది యువకులు దుబాయిలో నరకయాతన అనుభవిస్తున్నారు.

Godavari youth: దుబాయిలో రోడ్డున పడ్డ  గోదావరి యువకులు

  • పెయింటింగ్‌ పనికని తీసుకెళ్లి మోసం చేసిన సంస్థ

  • నిలువ నీడ లేక.. తినేందుకు తిండి దొరక్క అలమటిస్తున్న యువత

  • పట్టించుకోని ఎంబసీ అధికారులు.. ఫిర్యాదు తీసుకోని పోలీసులు

(ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి): 50 సెల్సియస్‌ డిగ్రీలు దాటున్న తీవ్ర ఎండలో తినడానికి తిండి లేకుండా, ఉండేందుకు నీడ లేకుండా ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన 18 మంది యువకులు దుబాయిలో నరకయాతన అనుభవిస్తున్నారు. మధ్యవర్తులను నమ్మి మోసపోయామని, తమను మాతృభూమికి పంపించాలని వారు అధికారులను ప్రాధేయపడుతున్నారు. దుబాయిలో భవనాలకు రంగులు వేసే ఒక సంస్థ లో పెయింటర్లుగా పనిచేయడానికి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన 14 మంది, తూర్పు గోదావరి జిల్లాకు మరో నలుగురు యువకులు నెల క్రితం వచ్చారు. నెలకు రూ.42 వేలు (1600 దిర్హాంలు) వేతనంతో పెయింటర్‌ ఉద్యోగమని చెప్పి తీసుకొచ్చి వేతనం తగ్గించి పనికి కుదిర్చారు.


రెండు నెలల జీతం తమ వద్ద డిపాజిట్‌ చేసుకుంటామని యాజమాన్యం చెప్పడంతో వీరు అవాక్కయ్యారు. అయితే వీరికి ఉద్యోగాలిచ్చిన సంస్థ వాదన భిన్నంగా ఉంది. వీసాలకు ఒక్కొక్కరికీ 6 వేల దిర్హాంలు ఖర్చయ్యాయని, దాన్ని చెల్లిస్తే తిరిగి భారతదేశానికి పంపిస్తామని సంస్థ చెబుతోందని యువకులు వెల్లడించారు. దీనిపై భారతీయ అధికారులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేదని వాపోతున్నారు. దుబాయి పోలీసుల వద్దకు వెళ్లగా, వారు లేబర్‌ కోర్టుకు వెళ్లాలని సూచించారని చెప్పారు. 80 వేల నుంచి రూ.లక్ష వరకు చెల్లించి దుబాయి వచ్చిన వీరు ఆకలితో అలమటిస్తూ.. తలదాచుకునేందుకు నీడ కూడా కరువై చెట్ల కింద కాలం వెళ్లదీస్తున్నారు. వీరి పరిస్థితి తెలుసుకున్న దుబాయిలోని తెలుగు సామాజిక సేవకుడు మోహన్‌ మంగళవారం వారిని తాత్కాలిక నివాసానికి తరలించి భోజనం ఏర్పాట్లు చేసారు.

Updated Date - Jun 25 , 2025 | 02:41 AM