Garuda Mart: లేపాక్షిలో గరుడ గృహోపకరణాల తయారీ యూనిట్
ABN , Publish Date - Aug 07 , 2025 | 05:04 AM
అనంతపురం జిల్లా లేపాక్షిలో గరుడ మార్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ గృహోపకరణాల తయారీ
గరుడ మార్ట్ చైర్మన్ వెంకటరమణ
విజయవాడ, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): అనంతపురం జిల్లా లేపాక్షిలో గరుడ మార్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ గృహోపకరణాల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు సంస్థ చైర్మన్ ఆర్.వెంకట రమణ తెలిపారు. విజయవాడలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం కర్ణాటకలోని చిక్‌బళ్లాపుర జిల్లా కైవారాలో ఈ తయారీ కేంద్రం ఉందని, 2017లో ఈ యూనిట్‌ను నెలకొల్పామని చెప్పారు. పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు కర్ణాటక ప్రభుత్వం రెండెకరాల భూమి కేటాయించగా, మరో యూనిట్‌ను నిర్మిస్తున్నామని, ప్రస్తుతం నిర్మాణ పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని లేపాక్షిలో కూడా ఆరు ఎకరాల విస్తీర్ణంలో యూనిట్ ఏర్పాటు చేయబోతున్నట్టు వెల్లడించారు. సుమారు రూ.100 కోట్లతో ఈ పరిశ్రమను ఏర్పాటు చేస్తామని, 500 మందికి ఉపాధి లభిస్తుందన్నారు. గరుడలో తయారైన గృహోపకరణాలకు రాష్ట్రంలో 400 మంది డీలర్లు ఉన్నారని వెంకట రమణ తెలిపారు. ఇక్కడ ఏర్పాటు చేయబోయే యూనిట్‌కు ప్రభుత్వం సహకరించాలని కోరారు.