Gajuwaka Event: నేడు గాజువాకలో ‘అక్షరమే అండగా...’ సభ
ABN , Publish Date - Jun 02 , 2025 | 03:35 AM
గాజువాకలో ‘అక్షరం అండగా... పరిష్కారమే అజెండాగా’ సభ నిర్వహించబడింది. ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, ఆంధ్రజ్యోతి డైరెక్టర్ వేమూరి ఆదిత్య, స్థానిక అధికారులతో కలిసి ప్రాంత అభివృద్ధి పనులను పరిశీలించారు.
హాజరు కానున్న ‘ఆంధ్రజ్యోతి’ డైరెక్టర్ వేమూరి ఆదిత్య
ఎమ్మెల్యే పల్లాతో కలసి అభివృద్ధి పనుల పరిశీలన
విశాఖపట్నం, జూన్ 1(ఆంధ్రజ్యోతి): ‘అక్షరం అండగా... పరిష్కారమే అజెండాగా’ సభను విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గ పరిధిలోని తిరుమల నగర్‌లో సోమవారం నిర్వహించనున్నారు. స్థానిక ఆర్యవైశ్య సామాజిక భవనంలో ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, ‘ఆంధ్రజ్యోతి’ డైరెక్టర్ వేమూరి ఆదిత్య, స్థానిక కార్పొరేటర్ బొండా జగన్‌తో పాటు ఆర్టీసీ, జీవీఎంసీ, ఈపీడీసీఎల్ సిబ్బంది హాజరు కానున్నారు. జనవరి 28న ‘ఆంధ్రజ్యోతి’ చేపట్టిన ‘అక్షరం అండగా...’ కార్యక్రమంతో తిరుమలనగర్ వాసులు ఎదుర్కొంటున్న పలు సమస్యలు పరిష్కారమయ్యాయి. ఈ ప్రాంతానికి ఆనుకొని ఉన్న ఆటోనగర్ ఈ-బ్లాక్‌లో పలు కర్మాగారాల నుంచి వెలువడే వ్యర్థాలను ఏపీఐఐసీకి చెంది న ఖాళీ స్థలంలో పడేసి సాయంత్రం వేళ నిప్పు పెట్టేవారు. రసాయనాలతో కూడిన పొగ స్థానికులను ఉక్కిరిబిక్కిరి చేసేది. కాలనీలోని పలుచోట్ల రాత్రిళ్లు వీధి దీపాలు వెలిగేవి కావు. లోఓల్టేజీ సమస్య కూడా ఉంది. పార్కుల్లో ఆకతాయిల ఆగడాలు ఎక్కువగా ఉండేవి. ఈ ప్రాంతం మీదుగా ఆర్‌టీసీ బస్సులు నడిచేవి కాదు. స్థానిక కార్పొరేటర్ బొండా జగన్, జీవీఎంసీ, ఏపీఐఐసీ, పోలీసు అధికారులు ‘ఆంధ్రజ్యోతి’ సదస్సుకు హాజరై సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కూడా వాటి పరిష్కారానికి చొరవ చూ పారు. దీంతో డంపింగ్ యార్డుగా మారిన ఏపీఐఐసీ స్థలం చుట్టూ రూ.13.5 లక్షలతో ప్రహరీ నిర్మించారు. అక్కడి వ్యర్థాలన్నీ తరలించి ఆ ప్రాంతాన్ని శుభ్రం చేశారు. అదనపు ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటుచేసి కాలనీలో వెలుగులు పంచారు. పోలీసులు గస్తీ ఏర్పాటుచేసి ఆకతాయిల బెడదను నివారించారు. వడ్లపూడి మీదుగా బస్సు ప్రారంభానికి ఆర్టీసీ అధికారులు చర్యలు చేపట్టారు. తొలుత కణితి మీ-సేవా కేంద్రం వద్ద ఆర్టీసీ బస్సును అతిథులు ప్రారంభిస్తారు. అనంతరం ఏపీఐఐసీ స్థలం ప్రహరీని పరిశీలిస్తారు. అనంతరం సభలో పాల్గొంటారు.