Four Judges Take Oath: హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా నలుగురు జడ్జీల ప్రమాణ స్వీకారం
ABN , Publish Date - Aug 14 , 2025 | 04:43 AM
రాష్ట్ర హైకోర్టులో నలుగురు జడ్జీలు శాశ్వత న్యాయమూర్తులగా బుధవారం ప్రమాణం చేశారు. హైకోర్టులోని మొదటి కోర్టు..
జస్టిస్ హరినాథ్, జస్టిస్ న్యాపతి విజయ్,జస్టిస్ మండవ కిరణ్మయి, జస్టిస్ సుమతితో ప్రమాణం చేయించిన చీఫ్ జస్టిస్ ఠాకూర్
ప్రమాణం చేయించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్
అమరావతి, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర హైకోర్టులో నలుగురు జడ్జీలు శాశ్వత న్యాయమూర్తులగా బుధవారం ప్రమాణం చేశారు. హైకోర్టులోని మొదటి కోర్టు హాల్‌లో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ న్యాయమూర్తులు జస్టిస్ నూనెపల్లి హరినాథ్, జస్టిస్ మండవ కిరణ్మయి, జస్టిస్ జగడం సుమతి, జస్టిస్ న్యాపతి విజయ్‌లతో ప్రమాణం చేయించారు. అంతకుముందు శాశ్వత న్యాయమూర్తులుగా వీరి నియామకానికి సంబంధించి రాష్ట్రపతి ద్రౌపదిముర్ము జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ వైవీఎ్‌సబీజీ పార్థసారథి చదివి వినిపించారు. ఈ నలుగురు అదనపు న్యాయమూర్తులుగా 2023 అక్టోబరు 21న ప్రమాణం చేశారు. వీరి పదవీకాలం అక్టోబరు 20తో ముగుస్తున్న నేపథ్యంలో వీరిని శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలని కోరుతూ సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని కొలీజియం కేంద్రానికి సిఫారసు చేసింది. దీంతో ఈ నలుగురినీ శాశ్వత న్యాయమూర్తులుగా నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ఆమోదముద్ర వేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, అదనపు ఏజీ సాంబశివ ప్రతాప్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ, అదనపు సొలిసిటర్ జనరల్ చల్లా ధనంజయ, ఏపీ బార్ కౌన్సిల్ అధ్యక్షులు ద్వారకానాథ రెడ్డి, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షులు కె.చిదంబరం, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ పార్థసారథి, రిజిస్ట్రార్‌లు, ఏపీ హైకోర్టు న్యాయవాదులు, కోర్టు సిబ్బంది హాజరయ్యారు.