Rain Related Accidents: నలుగురు మృతి
ABN , Publish Date - Aug 14 , 2025 | 04:24 AM
విజయవాడ నగరంలో కురిసిన భారీ వర్షానికి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కొత్తపేటలో ఇద్దరు మృతి చెందారు..
విజయవాడలో మ్యాన్‌హోల్‌లో పడి ఒకరు
వర్షం నీటిలో పడి మరొకరు, చెట్టును బైక్ ఢీకొని ఇంకొకరు
నంబూరులో వాగులో కొట్టుకుపోయి బాలుడి మృత్యువాత
విజయవాడ/ పెదకాకాని, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): విజయవాడ నగరంలో కురిసిన భారీ వర్షానికి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కొత్తపేటలో ఇద్దరు మృతి చెందారు. కొత్తపేట గులాం మొహిద్దీన్ వీధి రోడ్డులో మ్యాన్‌హోల్‌లో పడి 53వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు, మెడికల్ వ్యాపారి తిరువాయిపాటి మధుసూదన్‌రావు (52) మృతి చెందారు. అలాగే, జెండా చెట్టు సమీపంలో వర్షం నీటిలో పడి వించిపేటకు చెందిన షేక్ ముర్తాజ్ (46) చనిపోయారు. వీరిద్దరి మృతికి కార్పొరేషన్ డ్రైనేజీ విభాగం అధికారుల నిర్లక్ష్యమే కారణమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, లయోల కళాశాల ప్రఽధానగేటుకు దగ్గర్లో మంగళవారం రాత్రి ఓ భారీ చెట్టు కూలిపోయింది. అటుగా బైక్‌పై వస్తున్న గుణదల దళితవాడకు చెందిన తుల్లూరి మహేష్ బాబు (36) ఆ చెట్టును ఢీకొట్టి అక్కడికక్కడే మరణించారు. అలాగే, గుంటూరు జిల్లా నంబూరు గ్రామానికి చెందిన బాలుడు నేలపాటి భరత్(14) వాగులో కొట్టుకుపోయి మరణించారు. భారీ వర్షాలకు నంబూరు-కాజ ప్రధాన రహదారిపైన వర్షపు నీటి ప్రవాహం పెరిగి వాగు ఉధృతంగా ప్రవహించింది. స్థానిక జడ్పీ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న భరత్ బుధవారం మధ్యాహ్నం వాగును చూేసందుకు రాగా, చెప్పు జారీ నీటిలో కొట్టుకుపోయింది. చెప్పును అందుకునేందుకు ప్రయత్నించిన భరత్ కూడా నీటిలో కొట్టుకుపోయాడు. గమనించిన స్థానికులు నీటిలో దిగి గాలించగా మృతదేహం లభ్యమైంది.