YS Vivekananda Reddy: రంగన్న మృతదేహానికి రీపోస్టుమార్టం
ABN , Publish Date - Mar 09 , 2025 | 03:36 AM
ఉదయం పులివెందులలోని భాకరాపురం శ్మశాన వాటికలో మృతదేహాన్ని వెలికితీసి తిరుపతి నుంచి వచ్చిన ఫోరెన్సిక్ నిపుణులు, కడప రిమ్స్ మెడికల్ కళాశాల వైద్య నిపుణుల ఆధ్వర్యంలో 3-4 గంటల పాటు శవపరీక్ష చేశారు.

గాయాలున్నాయా అనే కోణంలోనూ
3-4 గంటల పాటు వైద్యుల పరిశీలన
సేకరించిన అవయవాలు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు
మృతుడి ఇంటి వద్ద క్లూస్ టీం తనిఖీలు
వివేకా హత్య కేసు సాక్షి రంగన్న మరణంపై
అనుమానాల నేపథ్యంలో సిట్ ఏర్పాటు
కడప/పులివెందుల, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి రంగన్న మృతదేహానికి శనివారం రీపోస్టుమార్టం నిర్వహించారు. ఉదయం పులివెందులలోని భాకరాపురం శ్మశాన వాటికలో మృతదేహాన్ని వెలికితీసి తిరుపతి నుంచి వచ్చిన ఫోరెన్సిక్ నిపుణులు, కడప రిమ్స్ మెడికల్ కళాశాల వైద్య నిపుణుల ఆధ్వర్యంలో 3-4 గంటల పాటు శవపరీక్ష చేశారు. శరీరంపై ఎక్కడైనా గాయాలున్నాయా అనే అంశాన్ని పరిశీలించారు మృతదేహం నుంచి తలవెంట్రుకలు, కాలి, చేతి గోళ్లు, మరికొన్ని అవయవాలను సేకరించి, ప్రత్యేక బాక్స్‌లో ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. రీపోస్టుమార్టం సమయంలో రంగన్న భార్య సుశీల, కుమారుడిని అక్కడకు తీసుకెళ్లారు. వారి అనుమతితోనే శవపరీక్ష నిర్వహించారు. రంగన్న కడప రిమ్స్‌లో చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందిన విషయం తెలిసిందే. రంగన్న భార్య సుశీల ఫిర్యాదు మేరకు పులివెందుల అర్బన్ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసుగా నమోదు చేశారు.
మృతిపై దర్యాప్తునకు సిట్ ... వివేకా హత్య కేసులో సాక్షులు, అనుమానితులు ఒక్కొక్కరు చనిపోతుండడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాచ్‌మన్ రంగన్న మృతిపై విచారణకు కడప ఎస్పీ అశోక్‌కుమార్ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. పులివెందుల డీఎస్పీ మురళీనాయక్, జమ్మలమడుగు డీఎస్పీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఆర్కే వ్యాలీ సీఐ ఉలసయ్య, పులివెందుల అర్బన్ సీఐ నరసింహులు, కడప సైబర్ క్రైం సీఐ మధుమల్లేశ్వర్‌రెడ్డి, మరో ముగ్గురు ఎస్‌ఐలతో సిట్ ఏర్పాటైంది. ఇదిలా ఉండగా ఉద యం 8 గంటల ప్రాం తంలో కడప నుంచి ఐదుగురితో కూడిన ప్రత్యేక క్లూస్ టీం రంగన్న ఇంటికి చేరుకుంది. గంటకు పైగా ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించింది. మంచం, మందులు, ఆసుపత్రి రిపోర్టులు, పరుపును పరిశీలించి.. పలు వస్తువులను స్వాధీనం చేసుకుంది.
వరుస మరణాలు
వివేకా హత్య కేసులో అనుమానితుడైన సింహాద్రిపురం మండలం కసూమూరుకు చెందిన శ్రీనివాసులరెడ్డి 2019 సెప్టెంబరు 29న ఆత్మహత్య చేసుకున్నాడు. 8 జగన్ మామ ఈసీ గంగిరెడ్డి 2020 అక్టోబరు 3న అనారోగ్యంతో చనిపోయారు.
ఈ కేసులో మరో కీలకసాక్షి గంగాధర్‌రెడ్డి 2022 జూన్ 9న తన ఇంట్లో నిద్రలోనే మృతిచెందారు.
ఇక వైఎస్ అభిషేక్‌రెడ్డి ఈ ఏడాది జనవరి 10న మృతిచెందారు. వివేకాది హత్యే అని ఈయన సీబీఐకి వాంగ్మూలం ఇచ్చారు.
జగన్ డ్రైవర్ నారాయణయాదవ్ 2019 డిసెంబరు 6న అనారోగ్యంతో మృతిచెందారు. వివేకా హత్యకు గురైనప్పుడు జగన్ దంపతులు రోడ్డుమార్గాన హైదరాబాదు నుంచి పులివెందులకు కారులో వచ్చారు. అప్పుడు ఈయనే డ్రైవరు. జగన్ సీఎం అయిన ఆర్నెల్లకే ఇతను చనిపోవడం గమనార్హం.
వివేకా హత్య కేసు సాక్షుల మృతిపై అనుమానాలు
ఆరుగురి మరణంపై దర్యాప్తు చేయాలి: మంత్రి నాదెండ్ల
కలెక్టరేట్(కాకినాడ), మార్చి 8(ఆంధ్రజ్యోతి): వివేకా హత్య కేసులో వరుసగా జరుగుతున్న సాక్షుల మరణాలపై చాలా అనుమానాలు ఉన్నాయని పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. పిఠాపురం మండలం చిత్రాడలో జరగనున్న జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ ఏర్పాట్ల పరిశీలన నిమిత్తం ఆయన శనివారం కాకినాడ వచ్చారు. అక్కడ మీడియాతో మాట్లాడుతూ వివేకా హత్య కేసులో మూడేళ్ల వ్యవధిలో ఆరుగురు సాక్షులు ఎలా మృతిచెందారని ప్రశ్నించారు. దీనిపై లోతుగా దర్యాప్తు చేసి, ఈ మరణాల వెనుక ఎవరు ఉన్నారో కనిపెట్టాలని వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి
PM Modi: ఈ ప్రపంచంలో అత్యంత సంపన్నుడను నేనే.. మహిళా దినోత్సవంలో మోదీ
PM Modi: మోడీ అకౌంట్ ఈమె చేతుల్లోనే.. ఎవరీ వైశాలి..
Israeli tourist: భారత్ పరువు తీశారు కదరా.. కర్ణాటకలో ఇజ్రాయెల్ మహిళపై సామూహిక అత్యాచారం..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.