Floodwater Fills Srisailam Dam: శ్రీశైలం కళకళ
ABN , Publish Date - Aug 14 , 2025 | 04:26 AM
ఎగువ పరీవాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి భారీగా వరద వచ్చి చేరుతోంది. దీంతో శ్రీశైలం డ్యాం నీటితో..
ఏడు గేట్లు ఎత్తి నీరు దిగువకు విడుదల
నంద్యాల, విజయవాడ, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): ఎగువ పరీవాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి భారీగా వరద వచ్చి చేరుతోంది. దీంతో శ్రీశైలం డ్యాం నీటితో కళకళలాడుతోంది. అధికారులు బుధవారం ఏడు క్రస్ట్‌గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 1,89,655 క్యూసెక్కుల నీటిని దిగువన నాగార్జునసాగర్‌కు విడుదల చేశారు. కుడి, ఎడమ గట్టు జల విద్యుత్ ఉత్పాదన నిమిత్తం మరో 65,647 క్యూసెక్కులు విడుదల చేశారు. జూరాల, సుంకేసుల జలాశయాలతో పాటు హంద్రీ నుంచి మొత్తంగా 1,17,600 క్యూసెక్కుల మేర వరద శ్రీశైలం డ్యాంలోకి వస్తోంది. డ్యాం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా... బుధవారం రాత్రి 9 గంటలకు 882.50 అడుగులకు చేరింది. నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 201.5822 టీఎంసీలుగా ఉంది.
ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద..
ప్రకాశం బ్యారేజీకి ఎగువ ప్రాంతాల నుంచి 2,96,177 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. దీంతో 70 గేట్లను పూర్తిస్థాయిలో ఎత్తి 3,97,250 క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. అవుట్‌ఫ్లో 3 లక్షల క్యూసెక్కులు దాటడంతో బ్యారేజీ వద్ద ఒకటో నంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మరోవైపు నాగార్జునసాగర్ నుంచి పులిచింతల ప్రాజెక్టుకు 2.75 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. దీంతో తొమ్మిది గేట్లను నాలుగు మీటర్ల మేర ఎత్తి నీటిని దిగువన ప్రకాశం బ్యారేజీకి విడుదల చేస్తున్నారు.