Loan Repayment Pressure: ఫైనాన్స్ కంపెనీ వేధింపులు భరించలేక కల్లుగీత కార్మికుని ఆత్మహత్య
ABN , Publish Date - Jun 03 , 2025 | 05:02 AM
నెల్లూరు జిల్లా కలిగిరి మండలంలోని కొమరా రత్తయ్య ఆర్థిక సమస్యలతో ఫైనాన్స్ కంపెనీ ప్రతినిధుల ఒత్తిడిని తట్టుకోలేక తీవ్ర మానసిక పీడనలో పడిపోయారు. వాయిదాలు చెల్లించకపోవడంతో వారిపై వేసిన ఒత్తిడి కారణంగా తీవ్ర స్థితిలో ఉన్నారు.
ఆర్థిక సమస్యలతో మనోవేదన
వాయిదాలు కట్టాలంటూ ఒత్తిడి
ఇంటిగోడపై అప్పు ఉన్నట్టు రాతలు
కలిగిరి, జూన్ 2 (ఆంధ్రజ్యోతి) : ఫైనాన్స్ కంపెనీ ప్రతినిధుల వేధింపులు తట్టుకోలేక నెల్లూరు జిల్లా కలిగిరి మండలం భట్టువారిపాలెంలో కొమరా రత్తయ్య (35) అనే వ్యక్తి సోమవారం బలవన్మరణానికి పాల్పడ్డాడు. బంధువుల కథనం మేరకు వివరాలు.... జలదంకి మండలం చామదల పంచాయతీ వేణుగోపాలపురానికి చెందిన కొమరా రత్తయ్య కుటుంబం 30 ఏళ్ల క్రితం భట్టువారిపాలెం చేరుకుని కల్లుగీత పనులు చేసుకుంటూ జీవిస్తోంది. మూడేళ్ల క్రితం ఓ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలో రత్తయ్య రూ.3.25 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. భార్య అనారోగ్యం, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులతో ఉన్న రత్తయ్య 8 నెలలుగా వాయిదాలు చెల్లించలేదు. దీంతో ఫైనాన్స్ సిబ్బంది ఒత్తిళ్లు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో రత్తయ్య అప్పు ఉన్నట్టు ఇంటి గోడపై ఫైనాన్స్ ప్రతినిధులు రాశారు. ఇంతటితో ఆగని వారు ఆదివారం రత్తయ్య ఇంటికి చేరుకుని డబ్బు కట్టాల్సిందేనంటూ పట్టుబట్టారు. దీంతో తన ఇంటి సమీపంలో ఉన్న బంధువైన ఓ వృద్ధురాలి రూ.4వేల పెన్షన్, ఆమె తనయుడి వద్ద రూ.2వేలు తీసుకుని ఫైనాన్స్ సిబ్బందికి చెల్లించాడు. మిగిలిన నగదు త్వరగా చెల్లించాలని హెచ్చరించి వెళ్లారు. ఒక్కసారిగా అన్ని సమస్యలు చుట్టుముట్టడంతో తీవ్ర మనోవేదనకు గురైన రత్తయ్య సోమవారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని రత్తయ్య స్వగ్రామమైన కోదండరామపురానికి కుటుంబ సభ్యులు, బంధువులు తీసుకెళ్లారు. ఈ ఘటనపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు.