AP FiberNet Case: చంద్రబాబుపై ఫైబర్ కేసు క్లోజ్
ABN , Publish Date - Nov 27 , 2025 | 05:36 AM
ఫైబర్‌నెట్‌లో అక్రమాలు జరిగాయంటూ జగన్ హయాంలో నాటి ప్రతిపక్షనేత చంద్రబాబు సహా 16 మందిపై పెట్టిన సీఐడీ కేసు ముగిసిపోయింది...
అక్రమాలు జరగలేదని సీఐడీ నిర్ధారణ
ఆర్థిక నష్టాల్లేవని తేల్చిన సంస్థ
ఏకీభవించిన నాటి, నేటి ఎండీలు
కేసు మూసివేతకు కోర్టులో అంగీకారం
అమరావతి, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): ఫైబర్‌నెట్‌లో అక్రమాలు జరిగాయంటూ జగన్ హయాంలో నాటి ప్రతిపక్షనేత చంద్రబాబు సహా 16 మందిపై పెట్టిన సీఐడీ కేసు ముగిసిపోయింది. ఫైబర్‌నెట్‌లో అక్రమాలేవీ చోటు చేసుకోలేదని, సంస్థకు ఎలాంటి ఆర్థిక నష్టం జరగలేదని సీఐడీ నివేదిక ఇచ్చింది. ఈ నివేదికతో తాము పూర్తిగా ఏకీభవిస్తున్నామని ఫైబర్‌నెట్ పూర్వ మేనేజింగ్ డైరెక్టర్ ఎం. మధుసూదన రెడ్డి, ప్రస్తుత మేనేజింగ్ డైరెక్టర్ గీతాంజలి శర్మ విజయవాడలోని ఏసీబీ కోర్టుకు లిఖిత పూర్వకంగా తెలియజేశారు. వీరు బుధవారం ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. కేసును మూసేస్తున్నట్లు రాతపూర్వకంగానూ, మౌఖికంగానూ వెల్లడించారు.
రాజకీయ కక్షతోనే కేసు
2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే... జగన్ కక్ష సాధింపు రాజకీయాలు మొదలుపెట్టారు. ఫైబర్‌నెట్‌పై సొంత పత్రికలో వచ్చిన కథనాల ఆధారంగా చర్యలు తీసుకోవడం గమనార్హం. టెర్రాసాఫ్ట్ సంస్థకు ఆయాచితంగా రూ.321 కోట్ల లబ్ధిని చేకూర్చారంటూ సీఐడీకి 2021 సెప్టెంబరు 11న నాటి ఫైబర్‌నెట్ ఎండీ ఎం.మధుసూదన రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ కేసు పెట్టిన రెండేళ్ల తర్వాత... 2023 అక్టోబరు 11న చంద్రబాబు పేరునూ చేర్చారు. అయితే.. భారత్ నెట్ పథకం కింద కేంద్రం నుంచి విడుదలైన రూ.3840 కోట్లలో రూ.321 కోట్లు టెర్రాసా్‌ఫ్టకు బదలాయించినట్లుగా సీఐడీ నిర్ధారించలేకపోయింది.
సార్వత్రిక ఎన్నికలు ముగిసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఫైబర్‌నెట్ కేసులో అక్రమాలు జరగలేదని, ఆర్థిక అక్రమాలు లేవంటూ సీఐడీ ధ్రువీకరించింది. రాజకీయ కక్షతో కావాలనే చంద్రబాబును జగన్ ఇరికించారని చెప్పకనే చెప్పింది. అప్పుడు చంద్రబాబుపై ఫిర్యాదు చేసిన మధుసూదన రెడ్డే... ఇప్పుడు కేసును క్లోజ్ చేసేందుకు అభ్యంతరం లేదని చెప్పారు. అక్రమాలు జరగలేదన్న సీఐడీ నివేదికతో పూర్తిగా ఏకీభవించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రాజ్యాంగ విలువలను కాపాడుకుంటాం:సీఎం చంద్రబాబు
ఏపీలో భారీ అగ్నిప్రమాదం.. బ్యాంకులో ఒక్కసారిగా మంటలు..
For More AP News And Telugu News