Share News

CM Chandrababu: వేగంగా రోడ్ల నిర్మాణం

ABN , Publish Date - Jun 10 , 2025 | 05:04 AM

రాష్ట్రంలో ఇకపై ఏ రహదారి నిర్మాణమూ ఆలస్యం కాకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. రహదారుల నిర్మాణ పనులకు సంబంధించి నిర్ణీత కాల వ్యవధికి మించి ఆలస్యమైన ప్రాజెక్టుల కాంట్రాక్ట్‌ సంస్థలపై అసంతృప్తి వ్యక్తం చేశారు

CM Chandrababu: వేగంగా రోడ్ల నిర్మాణం

  • ఇక ఏ ప్రాజెక్టూ ఆలస్యం కాకూడదు

  • జూలైలోగా అవసరమైన క్లియరెన్సులు

  • ఈ ఏడాది రూ.20,067 కోట్ల విలువైన 1,040 కి.మీ. జాతీయ రహదారుల నిర్మాణం

  • రోడ్ల నిర్మాణ పురోగతిపై చంద్రబాబు సమీక్ష

  • ఆలస్యమైన ప్రాజెక్టుల కాంట్రాక్టు సంస్థలపై ముఖ్యమంత్రి అసంతృప్తి

అమరావతి, జూన్‌ 9(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఇకపై ఏ రహదారి నిర్మాణమూ ఆలస్యం కాకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. రహదారుల నిర్మాణ పనులకు సంబంధించి నిర్ణీత కాల వ్యవధికి మించి ఆలస్యమైన ప్రాజెక్టుల కాంట్రాక్ట్‌ సంస్థలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సోమవారం అమరావతి సచివాలయంలో రహదారుల అభివృద్ధిపై అధికారులు, కాంట్రాక్టర్లతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రహదారుల ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న, త్వరలో నిర్మించతలపెట్టిన అన్ని రాష్ట్ర, జాతీయ రహదారుల ప్రాజెక్టులకు భూసేకరణ, అటవీ, వన్యప్రాణి విభాగం క్లియరెన్స్‌ సమస్యలను జూలై నెలాఖరులోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా రాష్ట్రంలో రహదారుల నిర్మాణం వేగవంతంగా జరిగేలా చూడాలన్నారు. మరోవైపు ఎన్‌హెచ్‌ఏఐ, ఎంఓఆర్టీహెచ్‌ కింద రూ.11,325 కోట్లతో 770 కిలోమీటర్ల రహదారుల నిర్మాణాన్ని గత ఆర్థిక సంవత్సరంలో పూర్తి చేసినట్లు అధికారులు సీఎంకు వివరించారు. కాగా రాష్ట్రంలో మొత్తం 8,744 కి.మీ. రహదారులు ఉన్నాయి. వీటిలో 4,406 కి.మీ. మేర ఎన్‌హెచ్‌ఏఐ రహదారులు, పీఐయూ, ఎంఓఆర్టీహెచ్‌ పరిధిలో 641 కి.మీ. రహదారులు, ఎన్‌హెచ్‌(ఆర్‌అండ్‌బీ) కింద 3,697 కి.మీ. రహదారులు ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్‌హెచ్‌ఏఐ, ఎంఓఆర్టీహెచ్‌ కింద రూ.76,856 కోట్లతో 144 ప్రాజెక్టులకు చెందిన 3,483 కి.మీ.


మేర రహదారులు నిర్మాణంలో ఉన్నాయి. మరికొన్నింటిని త్వరలో చేపట్టనుండగా, వీటిలో ఎన్‌హెచ్‌ఏఐ కింద 1,392 కి.మీ. రహదారులు, ఎంఓఆర్టీహెచ్‌ కింద 2,091 కి.మీ. రహదారులున్నాయని అధికారులు వివరించారు. ఇందులో ఈ ఏడాది రూ.20,067 కోట్ల విలువైన 1,040 కి.మీ. జాతీయ రహదారి పనులు పూర్తి కావాలని సీఎం నిర్దేశించారు. గుంతలు లేని రహదారుల కోసం మిషన్‌ పాత్‌ హోల్‌ ఫ్రీ రోడ్స్‌ కింద గతేడాది నవంబరులో రూ.860.81 కోట్లతో సీఎం ప్రారంభించిన పనుల్లో 97ు ఈ నెల 6 నాటికి పూర్తయ్యాయి. 19,475 కి.మీ. మేర రహదారుల్లో గుంతలన్నీ పూడ్చి, మరమ్మతులు చేశారు. మిగిలిన రహదారుల మరమ్మతులు జూలై 31 నాటికి పూర్తి కానున్నాయని అధికారులు తెలిపారు. సమీక్షలో ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దనరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jun 10 , 2025 | 05:07 AM