Farming Tips: రైతులకు అలర్ట్.. అగ్గి తెగులును ఇలా తరిమికొట్టండి..
ABN , Publish Date - Sep 28 , 2025 | 09:24 AM
వరి పొలాల్లో అగ్గి తెగులుపై అప్రమత్తంగా ఉండాలని స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త పి. జోగారావు అన్నారు. కొమ్మంగి పంచాయతీ ముల్లుమెట్ట, బురిసింగి, కొత్తూరు గ్రామాల్లో వ్యవసాయ అధికారులతో కలిసి శాస్త్రవేత్తలు పొలాలను పరిశీలించారు.
చింతపల్లి, సెప్టెంబర్ 28: వరి పొలాల్లో అగ్గి తెగులుపై అప్రమత్తంగా ఉండాలని స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త పి. జోగారావు అన్నారు. కొమ్మంగి పంచాయతీ ముల్లుమెట్ట, బురిసింగి, కొత్తూరు గ్రామాల్లో వ్యవసాయ అధికారులతో కలిసి శాస్త్రవేత్తలు పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా సీనియర్ శాస్త్రవేత్త మాట్లాడుతూ వరిలో అగ్గి తెగులు, ఆకుముడుత పురుగు, పొటాష్ లోపం కనిపిస్తోందన్నారు. అగ్గి తెగులు సోకిన పంటలకు ట్రైసైక్లేజోలు 0.6గ్రాములు లీటరు నీటిలో కలిపి (ఎకరానికి 120 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి) పిచికారీ చేయాలన్నారు. ఆకుముడత పురుగు నివారణకు క్లోరైపైరిఫోస్ 25 మిల్లీ లీటర్లు లీటరునీటికి (ఎకరానికి 500 మిల్లీలీటర్లు) పిచికారీ చేసుకోవాలన్నారు. ఆకులు ఎరుపు రంగులోకి మారినట్టు గమనిస్తే పొటాష్ పోషక లోపంగా గుర్తించి ఎంవోపీ (10-12 కేజీ ఎకరానికి) వేసుకోవాలన్నారు. అగ్గి తెగులు వ్యాప్తి ఉధృతి పెరగకుండగా ఉండేందుకు యూరియా వాడకాన్ని తగ్గించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్త వెంకటేశ్, వ్యవసాయ అధికారి టి మధుసూదనరావు పాల్గొన్నారు.