AP New Bar Policy: అర్ధరాత్రి వరకూ బార్లు
ABN , Publish Date - Aug 14 , 2025 | 03:37 AM
నూతన బార్ పాలసీని ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. సెప్టెంబరు 1 నుంచి కొత్త బార్ పాలసీ అమల్లోకి వస్తుందని తెలిపింది. ..
ఉదయం 10 నుంచి రాత్రి 12 వరకూ.. ఉదయం, రాత్రి గంట చొప్పున పెంపు
నాలుగు దరఖాస్తులు వస్తేనే లాటరీ.. గీత కులాలకు 84 బార్లు
బార్లకు రూ.99 మద్యం లేదు.. బార్ పాలసీ విడుదల చేసిన ఎక్సైజ్
అమరావతి, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి): నూతన బార్ పాలసీని ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. సెప్టెంబరు 1 నుంచి కొత్త బార్ పాలసీ అమల్లోకి వస్తుందని తెలిపింది. మూడేళ్ల పాటు ఈ పాలసీ అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. బుధవారం రాత్రి ఎక్సైజ్ శాఖ పాలసీ, రూల్స్‌పై వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసింది. గత పాలసీలో వేలం విధానంలో బార్లు కేటాయించగా, ఇప్పుడు లాటరీ విధానంలో కేటాయించనుంది. 840 బార్లకు ప్రస్తుతం నోటిఫికేషన్ జారీ చేస్తుంది. గీత కులాల వారికి మరో 10 శాతం అంటే.. 84 బార్లకు తర్వాత విడిగా నోటిఫికేషన్ ఇస్తుంది. దీంతో రాష్ట్రంలో కొత్తగా 84 బార్లు పెరగనున్నాయి. అలాగే బార్ల పనివేళలను రెండు గంటలు పెంచింది. ప్రస్తుతం ఉదయం 11 నుంచి రాత్రి 11 గంటల వరకు బార్లు పనిచేస్తున్నాయి. కొత్త పాలసీలో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకూ పనిచేస్తాయి. అయితే లాటరీ విధానంలో దరఖాస్తుల పరిమితిపై నిబంధన పెట్టింది. ఒక్కో బార్‌కు కనీసం నాలుగు దరఖాస్తులు వస్తేనే లాటరీ తీస్తారు. ఒక దరఖాస్తుకు రూ.5 లక్షలు నాన్ రిఫండబుల్ ఫీజుగా నిర్ణయించింది. అదనంగా మరో రూ.10 వేలు చెల్లించాలి. లైసెన్స్ ఫీజును మూడు కేటగిరీల్లో నిర్ణయించింది. నగర పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, పర్యాటక శాఖ గుర్తించిన పర్యాటక ప్రాంతాల్లో మాత్రమే లైసెన్సీలు బార్లు ఏర్పాటు చేయాలి. 50 వేల వరకు జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.35 లక్షలు, 50 వేల నుంచి 5 లక్షల వరకు జనాభా ఉంటే రూ.55 లక్షలు, 5 లక్షల దాటిన చోట్ల రూ.75 లక్షలుగా ఖరారు చేసింది. కాగా గీత కులాలకు కేటాయించే బార్లకు అందులో 50 శాతం మాత్రమే లైసెన్స్ ఫీజుగా ఉంటుంది. ఏటా 10 శాతం ఫీజు పెరుగుతుంది. కూటమి ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన క్వార్టర్ రూ.99 మద్యం బార్లకు ఇవ్వరు. అలాగే బార్లు ప్రభుత్వం నుంచి మద్యం కొనుగోలు చేసుకునేందుకు అదనంగా ఏఆర్‌ఈటీ చెల్లించాలి. విమానాశ్రయాల్లోనూ బార్లు ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే తిరుపతి విమానాశ్రయం ఇందుకు మినహాయింపు. విమానాశ్రయాల్లో బార్లపై ప్రత్యేకంగా మార్గదర్శకాలు జారీచేస్తారు. బార్లకు దరఖాస్తులను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రెండు రూపాల్లోనూ స్వీకరిస్తారు.