SIT Inquiry: లిక్కర్ డాన్‌లు.. ముడుపుల డెన్‌లు
ABN , Publish Date - Jul 11 , 2025 | 03:04 AM
డెన్‌లు మార్చే క్రమంలో తాడేపల్లిలో నాటి సీఎం జగన్ ప్యాలెస్‌కు అత్యంత సమీపంలో ల్యాండ్ మార్క్ అపార్ట్‌మెంట్‌లో ఓ ఫ్లాట్‌ను అద్దెకు తీసుకున్నారు. ఇక్కడి నుంచే ప్రకాశం, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో వైసీపీ అభ్యర్థుల ఎన్నికల...
మద్యం ముడుపుల కోసం రహస్య స్థావరాలు
హైదరాబాద్‌లో 5
తాడేపల్లిలో 1
జగన్ ప్యాలెస్‌కు సమీపంలోనే డెన్
అక్కడి నుంచే ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు
ఎన్నికల ఖర్చుకు 250 కోట్లు తరలింపు
సిద్ధం సభలకు లిక్కర్ సొమ్ము ఖర్చు
కొంత హవాలా మార్గంలో విదేశాలకు
పకడ్బందీ వ్యూహంతో సేకరణ, పంపిణీ
ఏ-1 రాజ్ డైరెక్షన్‌లో కిరణ్, సైమన్ నిర్వహణ
డెన్‌లు మార్చేస్తూ చిక్కకుండా ఎత్తుగడ
సిట్ దర్యాప్తులో విస్తుపోయే అంశాలు
6 డెన్‌లు
దేశంలోనే అతి పెద్ద మద్యం కుంభకోణంలో విస్తుపోయే రహస్యాలు బయటపడుతున్నాయి. మద్యం తయారీదారుల నుంచి వేల కోట్ల రూపాయలు అందుకుని, ఆ సొమ్ములు దాచిన డెన్‌లు బయటపడ్డాయి. సిట్ అధికారులు హైదరాబాద్‌లో ఐదు, తాడేపల్లిలో ఒకటి గుర్తించారు.
కసిరెడ్డి అనుచరులే కీలకం
లిక్కర్ స్కామ్‌లో కీలక సూత్రధారి రాజ్ కసిరెడ్డి అనుచరులు ముడుపులు తీసుకోవడం, డెన్‌లలో దాచడం, ఆ తర్వాత తరలించడం.. వంటి వ్యవహారాలు నడిపించారు. గుట్టు బయటపడకుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు డెన్‌లు మార్చేవారు.
లిక్కర్ సొమ్ముతో ‘సిద్ధం’!
ఎన్నికల ముందు వైసీపీ అధ్యక్షుడు, అప్పటి సీఎం జగన్ నిర్వహించిన సిద్ధం సభలకు లిక్కర్ ముడుపుల నుంచి ఖర్చు చేసినట్టు సమాచారం. కొంత మొత్తం హవాలా మార్గంలో విదేశాలకు తరలించినట్టు తెలుస్తోంది.
జగన్ ప్యాలెస్‌కు సమీపంలో..
డెన్‌లు మార్చే క్రమంలో తాడేపల్లిలో నాటి సీఎం జగన్ ప్యాలెస్‌కు అత్యంత సమీపంలో ల్యాండ్ మార్క్ అపార్ట్‌మెంట్‌లో ఓ ఫ్లాట్‌ను అద్దెకు తీసుకున్నారు. ఇక్కడి నుంచే ప్రకాశం, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో వైసీపీ అభ్యర్థుల ఎన్నికల ఖర్చుకు 250 కోట్లు తరలించినట్టు సిట్ ఆధారాలు సేకరించినట్టు తెలుస్తోంది.
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
ఐఐటీ, ఇంజనీరింగ్, లా పట్టభద్రులు.. జగన్ ప్రభుత్వంలో జరిగిన మద్యం స్కామ్‌లోని కొందరు నిందితులు! వీరు చేసిన ‘నిర్వాకం’ ఏంటంటే.. మద్యం కంపెనీల నుంచి ముడుపులు తీసుకోవడం, డెన్‌లకు తరలించడం! వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం! లిక్కర్ స్కామ్‌లో ఇలాంటి ‘చిత్రవిచిత్రాలు’ ఎన్నో ఉన్నాయి. సిట్ విచారణలో తవ్వేకొద్దీ బయటపడుతున్నాయి.
దేశంలో ఎన్నో స్కామ్‌లు జరిగాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సీఎం, డిప్యూటీ సీఎం సైతం అలవోకగా దొరికిపోయారు. కానీ ఏపీ లిక్కర్ స్కామ్ జరిగిన తీరు వింటే.. ఘరానా దొంగలూ ఆశ్చర్యపోవాల్సిందే. మూడున్నర వేల కోట్ల లిక్కర్ స్కామ్‌లో ఎక్కడో తీగ లాగితే ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. మద్యం తయారీదారుల నుంచి వేల కోట్ల రూపాయలు అందుకుని, ఆ సొమ్ము దాచిన డెన్‌లు బయట పడ్డాయి.హైదరాబాద్‌లో ఐదు డెన్‌లు, తాడేపల్లిలో ఒకటి ఉన్నట్లు తేలింది. ఆయా డెన్‌లకు చేరిన నోట్ల కట్టల పెట్టెలు, అవి తరలి వెళ్లిన గమ్యాన్ని గుర్తించారు. సిట్ అధికారులు అధునాతన టెక్నాలజీ సాయంతో రహస్య స్థావరాలను పసిగట్టారు. ఆ డబ్బు ఎవరెవరి చేతుల మీదుగా ఎక్కడికి చేరిందో తేల్చారు. వైసీపీ సర్కారులో పెద్దలకు చేరిన వాటాల నుంచి సిద్ధం సభలకు చేసిన ఖర్చు రూ.వందల కోట్ల గుట్టు కనుక్కొన్నారు. మరికొంత మొత్తం హవాలా మార్గంలో విదేశాలకు చేరినట్టు గుర్తించారు. ఈ స్కామ్‌లో కీలక సూత్రధారి రాజ్ కసిరెడ్డి డైరెక్షన్‌లో ఆయన అనుచరులు చాణక్య, సైమన్, కిరణ్, సైఫ్, వసంత్ తదితరులు నడిపిన డెన్ల కథా కమామిషు వివరాలు పరిశీలిస్తే..
ల్యాండ్ మార్క్ అపార్ట్‌మెంట్, తాడేపల్లి, గుంటూరు జిల్లా
తాడేపల్లిలోని జగన్ ప్యాలె్‌సకు 150 మీటర్ల దూరంలో ఉండే ల్యాండ్ మార్క్ అపార్ట్‌మెంట్లో ఒక ఫ్లాట్‌ను 2023 నవంబరులో అద్దెకు తీసుకున్నారు. రాజ్ కసిరెడ్డి అనుచరుడు కిరణ్ స్నేహితుడు ప్రణయ్ ప్రకాశ్‌ను తీసుకొచ్చి అక్కడ పెట్టారు. తిరుపతి నుంచి ‘తుడా’ వాహనాలు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి చెందిన ప్రైవేటు కార్లు, నంబర్ ప్లేట్ లేని ఖరీదైన కార్లు హైదరాబాద్‌కు వెళ్లి డబ్బుల బాక్సులు తీసుకుని తాడేపల్లికి వచ్చేవి. హైదరాబాద్‌లో డెన్ ఉన్న ఓ 2 స్క్వేర్ పక్కనే ఉన్న లాన్సమ్ ఎటానియా సెక్యూరిటీ సిబ్బందితో ఒక ఒప్పందం చేసుకున్నారు. ‘ఓ 2 స్క్వేర్‌లోకి కార్లు రావడం, వెళ్లడం రికార్డు అవుతుంది. కాబట్టి మీ బేస్‌మెంట్లోకి మా కారు వచ్చి ఆగుతుంది. ఆ తర్వాత మరో కారు కూడా వస్తుంది. బాక్సులను కారులోకి మార్చేస్తాం. రెండింటి నంబర్లను మీ రిజిస్టర్‌లో నమోదు చేయవద్దు. అందుకు ప్రతిఫలంగా మీకు కొంత డబ్బులిస్తాం’ అంటూ మాట్లాడుకున్నారు. ఇలా పొరుగు అపార్ట్‌మెంట్ బేస్‌మెంట్లో వ్యవహారం నడిపించేశారు. తాడేపల్లి డెన్ నుంచి ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు వైసీపీ అభ్యర్థుల ఎన్నికల ఖర్చుల కోసం 250 కోట్ల రూపాయల వరకూ డబ్బులు తరలించినట్లు సిట్ అధికారులు ఆధారాలు సేకరించినట్లు తెలిసింది. గరికపాడు చెక్‌పోస్టు వద్ద తనిఖీల్లో భాగంగా చిల్లకల్లు పోలీసులకు పట్టుబడిన 8.37 కోట్ల రూపాయలు కూడా అక్కడి నుంచి వచ్చినవేనని టెక్నికల్‌గా రుజువైనట్లు తెలిసింది.
సాయి శ్రీనివాసమ్ అపార్ట్‌మెంట్, ఫిల్మ్‌నగర్, హైదరాబాద్
హైదరాబాద్‌లో జూబ్లిహిల్స్‌లోని ఫిల్మ్‌నగర్ రోడ్ నంబర్ 9లో అపోలో ఆసుపత్రి వెనుక వైపు సాయి శ్రీనివాసమ్ అనే అపార్ట్‌మెంట్లోకి సైమన్ డెన్ మార్చేశాడు. ఎక్కువ కాలం అక్కడికే ముడుపులు తెప్పించుకున్నాడు. సైమన్‌కు ఎన్ని పనులున్నా ప్రతి రోజూ డబ్బుల కట్టలతో ఉన్న బాక్సులు తెచ్చి పెట్టడం, రాజ్ కసిరెడ్డికి లెక్క చెప్పడం చేసేవాడు. 2022 చివర్లో అపార్ట్‌మెంట్ వాసులు.. ‘ఈ బాక్సులేంటి? మీరు ఎవరు? ఏ వ్యాపారం చేస్తున్నారు’ అంటూ ప్రశ్నించారు. దీంతో హైదరాబాద్ శివారులో అర్బన్ గేటెడ్ కమ్యూనిటీలోకి మకాం మార్చేస్తాడు.
నిర్మితీస్ ల్యాండ్ మార్క్, ఎమ్మెల్యే కాలనీ, హైదరాబాద్
లిక్కర్ స్కామ్‌లో కర్త, కర్మ, క్రియగా భావిస్తున్న రాజ్ కసిరెడ్డికి అప్పటికే హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్‌లో ఈడీ ఎంటర్‌టైన్మెంట్ పేరుతో సినీ ప్రొడక్షన్ ఆఫీసు ఉండేది. నిఖిల్ హీరోగా ‘స్పై’ అనే సినిమాను ఇదే బ్యానర్‌లో నిర్మించారు. ఉప కార్యాలయంగా బంజారాహిల్స్‌లోని ఎమ్మెల్యే కాలనీ రోడ్ నంబర్ 12లో ఆంధ్రా బ్యాంకు పక్కన భవనాన్ని సైమన్ అద్దెకు తీసుకున్నాడు. అప్పటికే ఒక చిన్న సినిమా తీసిన యువ డైరెక్టర్‌కు ప్రతి నెలా కొంత మొత్తం చెల్లిస్తూ మొదటి అంతస్తును సినిమా కార్యాలయంగా తీర్చిదిద్దారు. రెండో అంతస్తులో కథలు రాసుకోవడం, సినిమా ప్రొడక్షన్‌కు సంబంధించిన వ్యవహారాలు నడిపించారు. మూడు, నాలుగు అంతస్తుల్లోకి మద్యం ముడుపులు తెప్పించుకుని ఒక దాంట్లో బాక్సులు భద్రపరిచి, మరో అంతస్తులో సైమన్ తన కుటుంబంతో నివాసం ఉండేవాడు. కొన్ని రోజులకు లిక్కర్ కిక్ బ్యాక్స్ అందుకునే డెన్‌గా డిస్టిలరీ వర్గాల్లో ప్రచారం జరిగింది. దీంతో ఇక్కడ ఎక్కువ కాలం ఉండటం మంచిది కాదని భావించి డెన్‌ను మార్చేశాడు. విశాఖపట్నంలో ఉన్న తన భార్య సోదరుడు మోహన్‌ను రప్పించి ఆ ఇంట్లో పెట్టాడు.

ఉమా హిల్ క్రిస్ట్ అపార్ట్‌మెంట్, ఖాజాగూడ, హైదరాబాద్
వైసీపీ ప్రభుత్వంలో మద్యం ముడుపులు సేకరించేందుకు ఎప్పటికప్పుడు కొత్తగా యువకులను చేర్చుకున్నారు. ఎవరూ ఏ వివరాలూ అడగకుండా రావడం, పని చేయడం, వెళ్లిపోవడం వరకే ఉండాలనేది రాజ్ కసిరెడ్డి ఆలోచన. ఆ మేరకు తిరుపతికి చెందిన రాజ్ కసిరెడ్డి అనుచరుడు కిరణ్ కుమార్ రెడ్డి తన డికార్డ్ లాజిస్టిక్స్‌కు వచ్చే యువకులపై దృష్టి పెట్టాడు. నిరుద్యోగులైన ఉన్నత విద్యావంతుల్ని గుర్తించి సైమన్, వసంత్, అంజన్ తదితరులను హైదరాబాద్‌కు చేర్చాడు. అక్కడ వ్యవహారం నడిపించే క్రమంలో ఖాజాగూడ ప్రాంతంలో రోడ్ నంబర్ 63ఏలోని ఉమా హిల్ క్రిస్ట్ అపార్ట్‌మెంట్లో కిరణ్ మకాం వేశాడు. లిక్కర్ స్కామ్‌లో మరో నిందితుడైన బూనేటి చాణక్య తల్లి పేరుతో ఉన్న ఆ ఇంట్లో గంజాయి, హుక్కా, మద్యం వంటివి ఏర్పాటు చేసి చురుకైన యువకుల్ని తనవైపు తిప్పుకొన్నాడు. పెద్దమ్మ గుడి దగ్గర, జూబ్లిహిల్స్‌లో రోడ్డు పక్కన, వివిధ ప్రాంతాల్లో మద్యం ముడుపులు అందుకునేందుకు వారిని వాహనాల్లో పంపేవాడు. డబ్బుల బాక్సులు తెచ్చి జాగ్రత్తగా ఫ్లాట్‌లోని ఒక రూములో భద్రపరిచి తాళం వేసేవాడు. వారానికి ఒక రోజు రాజ్ కసిరెడ్డి సూచన మేరకు ఎక్కడికి చేర్చాలో అక్కడికి డబ్బు తరలించేవాడు. ముడుపులు తీసుకోవడం, అందజేయడంలో సైమన్‌తో సమన్వయం చేసుకొంటూ 2019 ద్వితీయార్ధం నుంచి కొన్ని నెలల పాటు వ్యవహారం నడిపించాడు. కార్లలో అక్కడికి డబ్బుల బాక్సులు తీసుకురావడం, వాటిని లోపలికి తీసుకెళ్లి భద్రపరచడం, తర్వాత మరో కారులో తరలించడం వంటి వాటిపై స్థానికులు ఆరా తీశారు. ఇక్కడుంటే ప్రమాదమని గ్రహించి వెంటనే మరో చోటకు మకాం మార్చేశాడు.

సిరిమల్లెనగర్‌లోని ఇల్లు, అత్తాపూర్, హైదరాబాద్
హైదరాబాద్‌లో ఉమా హిల్ క్రిస్ట్, నిర్మితీస్ అపార్ట్‌మెంట్లు ఖాళీ చేశాక ఓ 2 స్క్వేర్‌కు సమాంతరంగా అత్తాపూర్ ప్రాంతంలో హైదర్‌గూడలోని సిరిమల్లెనగర్‌లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని కొత్త డెన్ తెరిచారు. కసిరెడ్డి అనుచరుడు కిరణ్ బంధువు ప్రకాశ్ రెడ్డిని తీసుకొచ్చి అక్కడ పెట్టారు. ఎవరికీ అనుమానం రాకుండా కొన్ని నెలల పాటు అక్కడికి డబ్బులు తీసుకురావడం, తీసుకెళ్లడం చేశారు. బాక్సుల్లో డబ్బులు తీసుకొచ్చినప్పుడు పొరుగువారు ఎవరైనా అడిగితే మార్కెటింగ్ ఏజెన్సీ అని చెప్పేవారు. అక్కడి నుంచి జగన్ సిద్ధం సభల ఖర్చులకు తరలించినట్లు సిట్ గుర్తించింది.
