Share News

YSRCP: వద్దన్నా జనాన్ని ఎందుకు తెచ్చారు

ABN , Publish Date - May 13 , 2025 | 04:23 AM

మాజీ సీఎం జగన్ హెలిప్యాడ్ ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డిని రామగిరి పోలీసులు ప్రశ్నల వర్షంతో విచారించారు. పిలైట్, కోపైలట్‌ వాంగ్మూలాల ఆధారంగా విచారణ కొనసాగుతుండగా, పోలీసులు కుట్ర కోణం ఉన్నట్టు అనుమానాలు వ్యక్తం చేశారు.

YSRCP: వద్దన్నా జనాన్ని ఎందుకు తెచ్చారు

హెలిప్యాడ్‌లోకి ఎందుకు పోనిచ్చారు?

ఇందులో ఏదో కుట్ర దాగి ఉందనిపిస్తోంది...

మీ ప్రమేయంపై మావద్ద ఆధారాలున్నాయి

వైసీపీ ఇన్‌చార్జిగా జగన్‌ బాధ్యత మీది కాదా?

తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డిపై పోలీసుల ప్రశ్నలవర్షం

చాలా ప్రశ్నలకు తెలియదు అంటూ దాటవేత

నేడు విచారణకు పైలట్‌ అనిల్‌కుమార్‌

ధర్మవరం/చెన్నేకొత్తపల్లి, మే 12(ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం జగన్‌ హెలిప్యాడ్‌ కేసులో ప్రధాన నిందితుడు, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి సోమవారం న్యాయవాదితో కలిసి శ్రీసత్యసాయి జిల్లా రామగిరి పోలీసు సర్కిల్‌ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. కో-పైలట్‌ నుంచి సేకరించిన విషయాలను ముందుపెట్టి తోపుదుర్తిని ప్రశ్నించినా.. తెలియదు, గుర్తు లేదు అంటూ ఆయన చాలా ప్రశ్నలను దాటవేశారు. లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్‌ చేసిన పర్యటనతో భారీగా జన సమీకరణ వద్దని ముందే సూచించినా.. ఎందుకు పెడచెవిన పెట్టారంటూ ప్రకాశ్‌రెడ్డిని రామగిరి సీఐ శ్రీధర్‌ నేరుగా ప్రశ్నించారు. వీటన్నింటి వెనుక ఏదో కుట్రకోణం ఉందన్న అనుమానం కలుగుతోందంటూ స్పష్టం చేశారు. ‘‘వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి అయిన మీకు జగన్‌ రక్షణ బాధ్యత లేదా? గతనెల 8న కుంటిమద్దిలో హెలికాప్టర్‌ ల్యాండ్‌ అయ్యే సమయంలో మీ పార్టీ శ్రేణులు హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్తున్నా ఎందుకు నిలువరించలేకపోయారు? హెలిప్యాడ్‌ విండ్‌షీల్డ్‌ దెబ్బతిన్న విషయం మీకు ఎప్పుడు తెలిసింది? జగన్‌ తిరుగు ప్రయాణానికి మరో హెలికాప్టర్‌ను ఎందుకు ఏర్పాటుచేయలేదు? రోడ్డుమార్గాన ఆయన ఎందుకు వెళ్లారు?’’ అంటూ ప్రకాశ్‌రెడ్డిపై పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.10 గంటలదాకా విచారణ కొనసాగింది.


పోలీసులు దాదాపు 102 ప్రశ్నలదాకా సంధించి, సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేశారు. మాజీ సీఎం పర్యటనకు సంబంధించి తన బాధ్యత ఏమీలేదనీ, అంతా వైసీపీ జిల్లా యంత్రాంగమే చూసుకుందని ప్రకాశ్‌రెడ్డి తెలిపినట్టు సమాచారం. హెలిప్యాడ్‌ వద్దకు జనం దూసుకెళ్తుంటే మైకు ద్వారా తానే వెళ్లవద్దని వారించాననీ, తమ నాయకుడికి అత్యవసర ప్రయాణం ఉండటంతో రోడ్డుమార్గంలో వెళ్లారని చెప్పినట్టు తెలిసింది. ‘హెలిప్యాడ్‌ వద్ద జరిగిన ఘటనలో మీకు, మీ వైసీపీ శ్రేణులకు ప్రమేయం ఉన్నట్లు మావద్ద ఆధారాలున్నాయ’’ని ప్రకాశ్‌రెడ్డికి పోలీసులు గట్టిగా చెప్పినట్లు తెలిసింది. కాగా, హెలిప్యాడ్‌ ఘటనలో విచారణకు పైలట్‌ అనిల్‌కుమార్‌ మంగళవారం హాజరవనున్నారు. ఇప్పటికే రెండు సార్లు ఆయన విచారణకు గైర్హాజరయ్యారు. వయసు, అనారోగ్యం కారణంగా నేరుగా హాజరుకాలేనని వర్చువల్‌గా అవకాశం ఇవ్వాలని పోలీసులకు అనిల్‌కుమార్‌ విన్నవించారు. అలా కుదరదనీ, భౌతికంగా హాజరు కావాల్సిందేనంటూ పోలీసులు మూడోసారి నోటీసు పంపించారు. ఈనెల 13న రామగిరి సర్కిల్‌ కార్యాలయంలో హాజరుకావాలని అందులో స్పష్టం చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే కోపైలట్‌ శ్రేయస్‌ జైన్‌ను విచారించారు.


మీడియాపై తోపుదుర్తి అక్కసు

కుంటిమద్ది హెలిప్యాడ్‌ ఘటనకు పోలీసుల వైఫల్యమే కారణమని రాప్తాడు వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి ఆరోపించారు. విచారణ అనంతరం బయటకు వచ్చిన ఆయన.. ప్రశ్నించబోయిన మీడియాపై అక్కసు వెళ్లగక్కారు. లింగమయ్య హత్యను మరుగుపరిచేందుకు కొన్ని మీడియా సంస్థలు ప్రయత్నిస్తున్నాయంటూ నోరు పారేసుకున్నారు. మీడియా బాధ్యత లేకుండా వ్యవహరిస్తోందన్నారు. జగన్‌ పర్యటన సందర్బంగా జన సమీకరణలో తానే రెచ్చగొట్టేలా వ్యవహరించానని పోలీసులు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. కాగా, ఇదే కేసులో తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి సోదరుడు రాజశేఖర్‌రెడ్డికి; వైసీపీ నాయకులు నరేంద్రరెడ్డి, బాలనాగిరెడ్డికి బీఎన్‌ఎ్‌సఎ్‌స సెక్షన్‌ 35(3) కింద నోటీసులు ఇచ్చామని, వారికి త్వరలోనే విచారణకు పిలుస్తామని పోలీసులు తెలిపారు.


ఇవి కూడా చదవండి..

Operation Sindoor: మళ్లీ అడ్డంగా దొరికిన పాక్..

Operation Sindoor: పాక్ ఎయిర్ బేస్‌ల ధ్వంసం.. వీడియోలు విడుదల

Operation Sindoor: పాక్ దాడులను సమర్థంగా తిప్పికొట్టాం: ఎయిర్ మార్షల్ ఎ.కె. భార్తీ

For AndhraPradesh News And Telugu News

Updated Date - May 13 , 2025 | 04:23 AM