Child Trafficking: ఏలూరులో నవజాత శిశువు
ABN , Publish Date - Oct 29 , 2025 | 05:30 AM
కడుపున పుట్టిన ఆడపిల్లను కన్నవారే విక్రయించిన ఘటనలో చిన్నారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరుకు చెందిన దంపతుల వద్ద పోలీసులు గుర్తించారు.
శిశు విక్రయం కేసులో పురోగతి
గుర్తించి తీసుకువచ్చిన నల్లగొండ పోలీసులు
శిశువు తండ్రి, కొనుగోలు చేసిన దంపతుల విచారణ
నల్లగొండ, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : కడుపున పుట్టిన ఆడపిల్లను కన్నవారే విక్రయించిన ఘటనలో చిన్నారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరుకు చెందిన దంపతుల వద్ద పోలీసులు గుర్తించారు. శిశువు సహా ఆ దంపతులను నల్లగొండకు తీసుకువచ్చి విచారిస్తున్నట్లు తెలిసింది. నల్లగొండ జిల్లా తిరుమలగిరి(సాగర్) మండలం ఎల్లాపురం తండాకు చెందిన కొర్ర బాబు, పార్వతి దంపతుల సంతానమైన ఆడ శిశువును రూ.3 లక్షలకు విక్రయించారనే విషయం బయటకు పొక్కడంతో ఐసీడీఎస్ అధికారులు, నల్లగొండ పోలీసులు వెంటనే స్పందించారు. ఈ ఘటనపై సోమవారం మధ్యాహ్నమే ఐసీడీఎస్ అధికారుల ఫిర్యాదు మేరకు చిన్నారి తల్లిదండ్రులపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ మొదలుపెట్టారు. ఏలూరు జిల్లా కేంద్రానికి చెందిన సాంబమూర్తి, రజిత దంపతుల వద్ద శిశువు ఉన్నట్లు గుర్తించి అక్కడికి వెళ్లి వారిని బిడ్డ సహా నల్లగొండకు తీసుకువచ్చారు. శిశువు తండ్రి కొర్ర బాబును, ఏలూరుకు చెందిన దంపతులను పోలీసులు ఐసీడీఎస్ అధికారులతో కలిసి విచారణ చేస్తున్నట్లు తెలిసింది. గుంటూరుకు చెందిన ఆటోడ్రైవర్ కొండలు మధ్యవర్తిత్వంతో సాంబమూర్తి దంపతులను కొర్ర బాబు దంపతులు కలిసి శిశువును అప్పగించే విషయం ఫోన్‌లో మాట్లాడుకున్నట్లు తెలిసింది. ఈ నెల 25వ తేదీ రాత్రి 8 గంటల సమయంలో సాగర్ సమీపంలోని సమ్మక్క సారక్క ఆలయం వద్ద కొర్ర బాబు తమ బిడ్డను ఏలూరు దంపతులకు అప్పగించినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు.
తమకు పిల్లలు లేకపోవడంతో ఈ శిశువును పెంచుకునేందుకు దత్తత కోసం అడిగి తీసుకున్నామే తప్ప తాము కొనుగోలు చేయలేదని సాంబమూర్తి దంపతులు పోలీసులకు చెబుతున్నట్లు తెలుస్తోంది.చట్టవిరుద్ధంగా శిశువును తీసుకోవడం నేరమని ఐసీడీఎస్ అధికారులు పేర్కొంటున్నారు. కొర్ర బాబును, ఏలూరుకు చెందిన దంపతులను పోలీసులు పూర్తిస్థాయిలో విచారిస్తున్నారని, వారి మధ్య జరిగిన ఫోన్ సంభాషణలు, ఆర్థికపరమైన లావాదేవీలు జరిగాయా లేదా అనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు తెలిసింది. కేసు వివరాలు బుధవారం వెల్లడించే అవకాశం ఉంది.
లోకాయుక్త సుమోటో విచారణ
హైదరాబాద్, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): చిన్నారి విక్రయం ఘటనపై లోకాయుక్త సుమోటోగా విచారణ చేపట్టింది. ఘటనకు సంబంధించి నవంబరు నాలుగో తేదీలోగా సమగ్ర నివేదిక అందజేయాలని జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారుల్ని ఆదేశించింది. ఘటనపై ఇప్పటికే స్థానిక పోలీస్‌లు కేసునమోదు చేయగా తాజాగా లోకాయుక్త సుమోటోగా విచారణ చేపట్టింది.