CM Chandrababu Naidu: విదేశాలలో వెంకన్న మందిరాలు
ABN , Publish Date - Jun 23 , 2025 | 03:11 AM
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేరకు విదేశాలలో శ్రీ వేంకటేశ్వర స్వామి మందిరాల నిర్మాణానికి కృషి చేస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు.
సీఎం చంద్రబాబు సూచనతో నిర్మాణం: టీటీడీ చైర్మన్ వెల్లడి
బహ్రెయిన్‌లో కన్నులపండువగా శ్రీ శ్రీనివాస కల్యాణోత్సవం
(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి): ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేరకు విదేశాలలో శ్రీ వేంకటేశ్వర స్వామి మందిరాల నిర్మాణానికి కృషి చేస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. టీటీడీ చైర్మన్ హోదాలో విదేశీ పర్యటనకు వచ్చిన ఆయన శుక్రవారం బహ్రెయిన్‌లో జరిగిన శ్రీ శ్రీనివాస కల్యాణోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తిరుపతి నుంచి ప్రత్యేకంగా వచ్చిన పురోహితుల నేతృత్వంలో కల్యాణోత్సవం కన్నులపండువగా సాగింది.
బహ్రెయిన్‌తో పాటు సౌదీ అరేబియా, ఇతర గల్ఫ్ దేశాల నుంచి వచ్చిన తెలుగు ప్రవాసీయులు స్వామివారి కల్యాణోత్సవాన్ని తిలకించారు. కాగా, బహ్రెయిన్‌లోని భారతీయ రాయబారితో బీఆర్ నాయుడు సమావేశమై శ్రీవేంకటేశ్వర స్వామి మందిర నిర్మాణానికి స్థలం కేటాయించే విధంగా చొరవ తీసుకోవాలని రాయబారిని కోరారు. శనివారం తనను కలిసిన ప్రవాసాంధ్రులతో నాయుడు మాట్లాడుతూ బహ్రెయిన్ సహా ఇతర దేశాలలో మందిరాల నిర్మాణానికి ప్రయత్నాలు ప్రారంభించామని తెలిపారు.