గీతకు..లక్!
ABN , Publish Date - Mar 07 , 2025 | 12:56 AM
త కులాలకు ప్రభుత్వం కేటాయించిన మద్యం షాపుల లాటరీ ప్రక్రియ గురువారం పూర్త యింది.

రాజమహేంద్రవరం/అర్బన్, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): గీత కులాలకు ప్రభుత్వం కేటాయించిన మద్యం షాపుల లాటరీ ప్రక్రియ గురువారం పూర్త యింది. మద్యం పాలసీ 2024-26కి సంబంధించి గీత కులాలకు 10 శాతం షాపులను కేటాయిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.ఈ మేరకు జిల్లాలో 13 షాపులను కేటాయించారు. వీటికి సంబంధించి 387 మంది దరఖాస్తు చేస్తున్నారు. దీంతో లాటరీ ద్వారా ఎంపిక చేశారు. రాజమహేంద్రవరం ఆర్డీవో కృష్ణ నాయక్ పర్యవేక్షణలో అసిస్టెంట్ ఎక్సయిజ్ సూపరింటెండెంట్ వినీష ఆధ్వర్యంలో ప్రక్రియను పూర్తి చేశారు. షాపులను లాటరీలో చేజిక్కించుకున్న వారు వెంటనే లైసెన్సు ఫీజు చెల్లించడంతో ప్రొవిజనల్ లైసెన్సులు జారీ చేశారు. వాళ్లు షాపులను ఏర్పాటు చేసుకున్న తర్వాత తగు తనిఖీల అనంతరం రెండేళ్లకు లైసెన్స్‌లు జారీ చేస్తారు. కాగా.. గీత కులాల వారికి మద్యం షాపుల లైసెన్సు ఫీజులో 50 శాతం ప్రభుత్వం రాయితీ ఇస్తూ మరో వరం ఇచ్చింది. దీంతో గీత కులాల వారి మాటున ఇతరులు రంగంలోకి దిగారని తెలుస్తోంది.అదే జరిగితే ప్రభుత్వ ఉద్దేశం నీరుగారే పరిస్థితి వస్తుందనే ఆరోపణలున్నాయి.