జనరల్ మెడిసిన్ వైద్యులు ఏమయ్యారు?
ABN , Publish Date - Feb 15 , 2025 | 01:28 AM
జనరల్ మెడిసిన్ విభాగంలో ప్రధాన వైద్యులు ఎందుకు అందుబాటులో లేరు, ఇలాగైతే ప్రజలకు మెరుగైన వైద్యసేవలు ఎలా అందుతాయి,

జిల్లా కలెక్టర్ ప్రశాంతి
రాజమహేంద్రవరం అర్బన్, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): జనరల్ మెడిసిన్ విభాగంలో ప్రధాన వైద్యులు ఎందుకు అందుబాటులో లేరు, ఇలాగైతే ప్రజలకు మెరుగైన వైద్యసేవలు ఎలా అందుతాయి, డ్యూటీ డాక్టర్ లేకపోతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఎందుకు చేయలేదని జిల్లా కలెక్టర్ ప్రశాంతి ప్రభుత్వ సమగ్ర బోధనాసుపత్రి (జీటీజీహెచ్) వైద్యాధికారులను ప్రశ్నించారు. శుక్రవారం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిని కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. పలు విభాగాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జనరల్ మెడిసిన్ విభాగంలో ప్రధాన వైద్యులు లేకపోవడంతో అసహనం వ్యక్తంచేస్తూ అక్కడున్న వైద్యులను అడిగి కలెక్టర్ వివరాలు తెలుసుకున్నారు. విధుల్లో ఉన్న వైద్యులు రోగులకు అందిస్తున్న వైద్యసేవలపై కలెక్టర్ ఆరా తీశారు. చికిత్స పొందుతున్న రోగులు, వారి సహాయకులతో మాట్లాడి ఆసుపత్రిలో అందుతున్న వైద్యసేవల గురించి అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ వైద్యులంతా నిర్ణీత సమయం ప్రకారం ఆసుప త్రిలో అందుబాటులో ఉండాలని, రోగులకు సత్వర వైద్య సేవలు అందించాలని కోరారు.