రహదారి భద్రతపై అవగాహన పెరగాలి
ABN , Publish Date - Feb 14 , 2025 | 01:17 AM
రోడ్డు ప్రమాదాలు జరగకుండా రహదారి భద్రతపై ప్రజల్లో అవగాహన పెరగాల్సి ఉందని, అందుకోసం ప్రచారం నిర్వహిస్తున్నామని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్నరాముడు అన్నారు. జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల సందర్భంగా గురువారం రాజమహేంద్రవరంలో జిల్లా రవాణాశాఖ ఆధ్వర్యంలో కార్లు, ఆటోలు, మోటారుసైకిళ్లతో కూడిన భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు.

జాయింట్ కలెక్టర్ చిన్నరాముడు
రాజమహేంద్రవరంలో కార్లు, ఆటోలు, మోటారుసైకిళ్లతో భారీ అవగాహన ర్యాలీ
రాజమహేంద్రవరం అర్బన్, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదాలు జరగకుండా రహదారి భద్రతపై ప్రజల్లో అవగాహన పెరగాల్సి ఉందని, అందుకోసం ప్రచారం నిర్వహిస్తున్నామని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్నరాముడు అన్నారు. జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల సందర్భంగా గురువారం రాజమహేంద్రవరంలో జిల్లా రవాణాశాఖ ఆధ్వర్యంలో కార్లు, ఆటోలు, మోటారుసైకిళ్లతో కూడిన భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని జేసీ చిన్నరాముడు స్థానిక ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల గ్రౌండులో అడిషనల్ ఎస్పీ ఏవీ సుబ్బారావు, జిల్లా రవాణా అధికారి ఆర్.సురేష్‌తో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ వాహనాలు నడిపేవారు తప్పనిసరిగా రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలన్నారు. హెల్మెట్ ధరించకపోవడం, ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం వల్ల ఏటా అనేక మంది వాహనదారులు ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. అడిషనల్ ఎస్పీ ఏవీ సుబ్బరాజు మాట్లాడుతూ రోడ్డు భద్రతా నిబంధనలు పాటించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా రవాణా అధికారి సురేష్ మాట్లాడుతూ వాహన ప్రమాదాలు నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక అవగాహన కార్యక్రమాలు రూపొందిస్తోందని, వాటిని తాము ప్రజల్లోకి తీసుకెళుతున్నామన్నారు. ప్రజల్లో చైతన్యం రావాలనే ఈ అవగాహన ర్యాలీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. మితిమీరిన వేగంతోపాటు వాహనాల్లో నిర్దేశిత సంఖ్య కంటే ఎక్కువ మంది ప్రయాణిస్తున్నారని, ఇది చట్టరీత్యా నేరమని అన్నారు. ఈ నెల 15వ తేదీ వరకూ రహదారి భద్రత మాసోత్సవాలు జరుగుతాయని వెల్లడించారు. కార్యక్రమంలో ఎంవీఐలు సీహెచ్ సంపత్‌కుమార్, ఏఎంవీఐలు జి.రాధికా దేవి, పీవీవీడీ సాయికుమార్, రోడ్డు సేఫ్టీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పి.మాధురి, పెద్ద సంఖ్యలో ద్విచక్రవాహనదారులు, క్యాబ్, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.